మధురఫలం విషతుల్యం


Fri,May 24, 2019 03:38 AM

mango turns Poisonous

-ప్రాణాంతకంగా మారిన మామిడి
-గడ్డిఅన్నారం మార్కెట్‌లో చైనా ఇథలిన్‌పొడితో పండ్లను మగ్గబెడుతున్న వ్యాపారులు
-అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల స్వార్థంతో విచ్చలవిడిగా నిషేధితపొడి వినియోగం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యాపారుల స్వార్థం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మధురఫలం మామిడి ప్రాణాంతకంగా మారుతున్నది. నిషేధిత చైనా ఇథలిన్‌పొడితో మామిడి పండ్లను మగ్గబెడుతున్నారు. వీటిని తినడంవల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.

హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్లమార్కెట్‌లోని ఇథలిన్‌చాంబర్‌ను నామమాత్రంగా మార్చి.. చైనా ఇథిలిన్‌పొడిని విచ్చలవిడిగా వాడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికారుల వైఖరితో ప్రభుత్వ ఆదేశాలు, కోర్టుతీర్పులు అమలవుతున్న దాఖలాలు ఎక్కడా కనుపడటంలేదు. పండ్లమార్కెట్‌లో నిఘా, తనిఖీలు కొరవడుతున్నాయి. క్షేత్రస్థాయిలో మార్కెటింగ్, వైద్య, ఆరోగ్య, ఉద్యాన, పోలీసు, ఆహారభద్రత విభాగం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు పట్టించుకోకపోవడంతో చైనా ఇథిలిన్‌పొడితో మామిడికాయలను మగ్గబెడుతున్నారు. శీతలగిడ్డంగుల చాంబర్ ఆచరణాత్మకంగా అమలుకాకపోవడంతో. .తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని వాడుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ప్యాకింగ్ సమయంలోనే చైనా ప్యాకెట్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే మామిడికాయలను కొనుగోలుచేస్తున్న వ్యాపారులు.. వాటిని ప్యాక్‌చేసే సమయంలోనే కాయల కింద చిన్న పరిమాణంలో ఉండే హానికర చైనా ఇథిలిన్‌పొడి ప్యాకెట్లను పెడుతున్నారు. అలా మగ్గబెట్టిన పండ్లనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పెద్ద,పెద్ద వాహనాల్లో ఎగుమతిచేస్తున్నారు. కాల్షియంకార్బైడ్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ చాంబర్‌లో మగ్గపెట్టాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు పట్టించుకోవడంలేదు. పచ్చిమామిడికాయలు కొనుగోలుచేసే వ్యాపారులు.. వాటిని నిల్వచేయడానికి మార్కెట్‌లో తగిన ఏర్పాట్లులేవంటున్నారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు గడ్డిఅన్నారం మార్కెట్‌లో రూ.కోటి వ్యయంతో, ఫ్రూట్ రైపనింగ్ చాంబర్‌ను 60 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ఏర్పాటుచేశారు.

ప్రారంభంలో మార్కెటింగ్‌శాఖ నిబంధనలను పాటించడంతో ఏడాదిపాటు ఆ చాంబర్‌లోనే మామిడికాయలను మగ్గబెట్టారు. ఆ తర్వాత అధికారుల ఉదాసీనత కారణంగా మూలనపడింది. దీంతో ఈ చాంబర్‌ను ఒక వర్తకుడికి అద్దెకుఇచ్చారు. ఆ వ్యాపారి దానిని ఆపిల్‌పండ్లను నిల్వచేసేందుకు వినియోగించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారిపట్టింది. వ్యాపారి లీజు గడువు ముగియనుండటంతో.. ఈ సారైనా మామిడిపండ్లను మగ్గబెట్టేందుకు చాంబర్‌ను వినియోగించాలని వ్యాపారులు కోరుతున్నారు.

శాంపిళ్లను పరీక్షలకు పంపిస్తాం

మామిడికాయలను మగ్గబెట్టేందుకు చైనా ఇథిలిన్‌పొడిని వాడుతుండటం వాస్తవమే. వాటిని సరఫరాచేసేవారికి ఫుడ్‌సేఫ్టీ ఆఫ్ ఇండియా అనుమతిచ్చిందని చెప్తున్నారు. చైనా ఇథలిన్ పౌడర్ ప్యాకెట్లను సరఫరాచేసేవారిని పిలిచాం. శాంపిళ్లను తీసుకొని పరీక్షలకు పంపుతాం. మార్కెట్ గేటువద్దనే తనిఖీలను కట్టుదిట్టంచేశాం. లోకల్ సీఐని కూడా నిఘా ఉంచాలని కోరాం. రెండేండ్లపాటు ఖాళీగా ఉండటంవల్ల ఇథలిన్‌చాంబర్‌ను కిరాయికి ఇచ్చాం. లీజు గడువు ముగిసింది. ఇకనుంచి మామిడిపండ్లను మగ్గబెట్టడానికే వినియోగిస్తాం. మామిడిపండ్లు మార్కెట్‌లో రెండు, మూడు నెలలు మాత్రమే నిల్వ ఉంటాయి.
- వెంకటేశ్వర్లు, స్పెషల్‌గ్రేడ్ మార్కెట్ కార్యదర్శి

3536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles