ఇల్లు నిలబెట్టిన కొలువు


Fri,July 12, 2019 02:08 AM

mandha eshwaramma praises cm kcr after get school assistant job

-మొదట కల్యాణలక్ష్మి.. కేసీఆర్ కిట్.. ఇప్పుడు టీచర్ ఉద్యోగం
-సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఈశ్వరమ్మ

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న ఈమె పేరు మంద ఈశ్వరమ్మ. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉద్యోగం కోసం 2018 ఫిబ్రవరిలో పరీక్ష రాసింది. ఫలితాల కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలో 1,978 పోస్టులకు సుమారు 50 వేల మంది పోటీ పడగా.. ఈశ్వరమ్మకు రాష్ట్రస్థాయిలో 92వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 16వ ర్యాంకు వచ్చింది. ఉద్యోగం వచ్చినందుకు అందరిలా ఆమె కూడా ఎంతో సంతోషపడింది. ఒకవేళ ఉద్యోగం రాకుంటే ఆమె పరిస్థితి దయనీయంగా ఉండేది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వరమ్మ పుట్టిన ఊరు మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం గార్లపాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

అన్నల వద్ద పెరిగింది.

2014లో ఈశ్వరమ్మను జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటాన్‌దొడ్డికి చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి వివాహం చేశారు. గతంలో ఒకసారి డీఎస్సీ రాసినా కొద్దిలో ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోయింది. ఈసారి తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలని ఆమె భర్త శ్రీనివాసులు హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పించాడు. ప్రైవేటు కంపెనీలో పని చేసే శ్రీనివాసులుకు కంపెనీ మూతపడి ఉద్యోగం పోయింది. దీంతో ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఈశ్వరమ్మ చదివింది. ఇటీవల విడుదల చేసిన టీఆర్‌టీ ఉద్యోగాల్లో ఆమెకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టు వరించింది.

సీఎంకు కృతజ్ఞతలు

గురువారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు మహబూబ్‌నగర్ వచ్చిన ఆమె తనకు ఉద్యోగం రావడంతో భావోద్వేగానికి లోనైంది. కేసీఆర్ వల్లనే తనకు ఉద్యోగం వచ్చిందని ఆనందబాష్పాలు రాల్చింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన తనకు ఉద్యోగం రావడంతో కుటుంబం నిలబడిందన్నారు. చంటి బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆర్‌వీఎం కార్యాలయం వద్ద ఏడుస్తూ ఉంటే..అక్కడి వారంతా ఉద్యోగం రానందుకు ఏడుస్తుందేమో అని వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఇన్నాళ్లు తను పడిన మానసిక సంఘర్షణ నుంచి బయటపడిన వేళను గుర్తుకుతెచ్చుకుంటూ కన్నీరు పెట్టుకున్నది.

ఇక తన కష్టాలన్నీ దూరమయ్యాయనీ, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 2014లో తన పెండ్లికి కల్యాణలక్ష్మి చెక్కును, 2018లో తన కూతురుకు కేసీఆర్ కిట్ అందించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నది. సీఎం కేసీఆర్ వల్లే తన జీవితం నిలబడిందని సంతోషం వ్యక్తం చేసింది. ఇది ఒక్క ఈశ్వరమ్మ హృదయ స్పందనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు సాధించిన అనేక మంది గుండె చప్పుడు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా మన ఉద్యోగాలు మనం సాధిస్తున్నామని చెప్పేందుకు నిదర్శనం ఈ ఘటన.

1684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles