బౌద్ధుల వస్సావాసం ఎల్ మడుగు


Thu,February 21, 2019 02:47 AM

Manchiryal district is a man made up of hillocks on the shore of the river

-మంచిర్యాల జిల్లా శివ్వారం గుట్టపై మానవనిర్మిత కొండగుహలు
-గుహల లోపల, బయట ప్రణాళికతో నివాసాలు, ఆరామాల నిర్మాణం
-చారిత్రక పరిశోధకుడు సముద్రాల సునీల్ పరిశోధనతో వెలుగులోకి..

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామం శివారు ఎల్ మడుగు ఒడ్డున మానవనిర్మిత కొండగుహలు వెలుగులోకి వచ్చాయి. చక్కగా చెక్కిన ద్వార స్తంభాలు, లోపల, బయట పక్కా ప్రణాళికతో నిర్మించిన 4 గుహలు ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 1,2 శతాబ్దాల నాటివిగా భావిస్తున్నారు. ఈ గుహలు బౌద్ధుల వస్సావాసం (వర్షరుతువులో బౌద్ధ భిక్షువులు నివసించే తాత్కాలిక ఆవాసాలు)గా తెలుస్తున్నది. ఈ బౌద్ధ్ధగుహారామాలను పెద్దపల్లి జిల్లా చారిత్రక పరిశోధకుడు సముద్రాల సునీల్ వెలుగులోకి తీసుకొచ్చారు. సర్వేయర్ అయిన సునీల్ పదేండ్లలో ఈ ప్రాంతంలో అనేక చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చారని చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఎల్ మడుగులో వెలుగులోకి వచ్చిన మానవ నిర్మిత గుహల గురించి ఆయన వివరించారు.

ఎల్ మడుగు అంచున ఉన్న కొండగట్టు (దాదాపు 250 అడుగుల ఎత్తు)లో ఈ మానవ నిర్మిత కొండగుహలు ఉన్నాయి. ఒక గుహలో ఇసుక రాతితో చెక్కిన ఎత్తైన పానవట్టంలో శివలింగం ఉన్నది. ఇక్కడి రాతిస్తంభాలకు గౌరికుండల జలపాతం వద్ద గుహాలయస్తంభాలకు పోలిక కనిపిస్తున్నది. ప్రస్తుతం కనిపించే నాలుగు గుహాలయాలు బయటకు ద్వారస్తంభాలతో, లోపల రాతి గద్దెలతో దేవాలయాలన్పించేలా, దీపాల గూడులతో, మలుపులు తిరిగిన రాతి గోడలతో, చదునైన రాతి నేలతో ఉన్నాయి. ఇవి బౌద్ధుల వస్సావాసాలు అనిపించేలా ఉన్నాయి. గుహలున్న ప్రదేశంలోనే శాతవాహన కాలంనాటి ఇటుకలు ఉన్నాయి. ఒక గుహద్వారం పక్కన గుర్రంమీద స్వారీచేస్తున్న (రాచ)జంట శిల్పం కనిపిస్తున్నది.
madugu1
మరో గుహ గదులు చక్కగా తొలిచిన పైకప్పుతో, దేవతా ప్రతిష్ఠానగర్భస్థానంతో కనిస్తున్నది. గుహల బయట కనిపిస్తున్న ప్రదేశంలో చక్కగాచెక్కిన రాతిస్తంభాలు, రాతి ఇటుకలు, రాతి కడీలతో పరిచిఉన్నది. గుహల పైభాగంలోనూ తొలిచిన రాతిమెట్లు ఉన్నాయి. అటవీశాఖ అనుమతితో పరిశోధిస్తే ఈ ప్రాంతంలో మరిన్ని బౌద్ధారామాలు బయటపడే అవకాశం ఉన్నదని హరగోపాల్ పేర్కొంటున్నారు. వజ్రయాన బౌద్ధంలో భిక్షువులు ఆచరించిన తాంత్రికాభ్యాసంలో స్త్రీలను చేర్చుకోవడం, మైథున తంత్రాల వల్ల ఆనాటి సమాజం బౌద్ధాన్ని బూతుపదాలతో అభిశంసించిందన్నారు. ఎల్ మడుగు అనే పేరు ఆ కోవలో వచ్చిందేనన్నారు.
madugu-horse

రామగిరిచరిత్రలో ఎల్ మడుగు

ఎరబాటి బాబూరావు రచించిన రామగిరి చరిత్రలో ఎల్ మడుగుకు ఒక పురాణకథను వివరించారు. జటాయువు దహనసంస్కారాలు చేసి గోదావరి ఒడ్డునుంచి రామ,లక్ష్మణులు నడుచుకుంటూ వెళ్తుండగా అయోముఖి అనే రాక్షసి చూసిందట. రావోయి రమిద్దాం అంటూ లక్ష్మణుడిని పట్టుకున్నదట. కోపోద్రిక్తుడైన అతడు కత్తి తీసి అయోముఖి ముక్కు, చెవులు కోసాడట. ఆయోముఖి అవమానంతో అక్కడ ఉన్న మడుగులో పడి మరణించిందట. అదే ఎల్ మడుగు అయింది.
madugu-pillars

సహజ సౌందర్య ప్రాంతం

ఏలాల జాతర తొవ్వదాటి 15 కి.మీల పోతే శివ్వారం వస్తుంది. దానికి కి.మీ దూరంలో ఎల్.మడుగు ఉంది. గోదావరిఖని నుంచి మంచిర్యాల తొవ్వలో ఇందారం నుంచి 35 కి.మీ ప్రయాణి స్తే చేరుకోవచ్చు. ఇక్కడ మొసళ్ల పెంపక కేంద్రం ఉన్నది. గోదావరి అందాలను చూడొచ్చు. ఇసుక రాతిగుట్టల ను మోసుకొచ్చిన కొండవీటి ప్రవాహాలు ఈ మడుగు ఒడ్డు బీచులను తలపిస్తాయి. మడుగు చుట్టూ సహజ సౌందర్యం వర్ణనాతీతం. ఇక్కడ బోటింగ్‌కు కూడా ఏర్పాట్లుచేస్తే విహారయాత్రాస్థలం అవుతుంది.

658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles