రికార్డుల్లో గోల్‌మాల్!


Sun,July 21, 2019 02:59 AM

Mancherial Farmers Suffering Revenue Officers Neglect Land Registration

-మ్యుటేషన్ కోసం వెళ్తే.. అడ్డం తిరిగారు
-నకిలీ పత్రాలు సృష్టించినోళ్లకే పాస్‌పుస్తకాలు జారీ
-ఆధారాలడిగితే.. రికార్డులు పోయాయంటున్నారు
-ధర్మగంటను ఆశ్రయించిన మంచిర్యాల జిల్లా బాధితుడు

నకిలీపత్రాలు సృష్టించినవారికి పాస్‌పుస్తకాలు జారీచేసిన రెవెన్యూ అధికారులు.. అసలు కొనుగోలుదారుడికి చుక్కలు చూపిస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరితే.. రికార్డులు పోయాయని జవాబిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పుస్కూర్ రాజకిషన్‌రావు న్యాయంకోసం ధర్మగంటను ఆశ్రయించారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పుస్కూర్ రాజకిషన్‌రావు.. కన్నెపల్లి మండలం నాగేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 78లో 12.34 ఎకరాల భూమిని 2009లో మునిమంద రమేశ్‌బాబునుంచి కొనుగోలుచేశారు. అంతకుముందు 2007లో ఆ భూమిని రమేశ్‌బాబుకు తాళ్లపల్లి గోపాల్‌రావు విక్రయించారు. మ్యుటేషన్ కోసం 2012లో రాజకిషన్‌రావు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా.. పోలాజి చిన్నక్క అభ్యంతరం తెలిపారు. దీంతో అప్పటి తాసిల్దార్ మ్యుటేషన్‌కోసం ఉన్న ఆధారాలన్నీ సమర్పించాలని రాజకిషన్‌రావుకు సూచించారు. వాటిని పరిశీలించిన తాసిల్దార్.. 2012 సెప్టెంబర్ 12న సర్వేనంబర్ 78లోని 12.34 ఎకరాల భూమికి తాళ్లపల్లి గోపాల్‌రావు అసలు పట్టాదారు అని మెమో జారీచేశారు కానీ, రాజకిషన్‌రావుకు మ్యుటేషన్ చేయలేదు.
Dharmaganta
రేపు.. మాపు అని తిప్పుకొన్న అధికారులు ఆరునెలల తర్వాత పోలాజి సంతోష్, పోలాజి సురేశ్ పేరిట పాస్‌బుక్ మంజూరుచేశారని రాజకిషన్‌రావు తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా గోపాల్‌రావు 1992లోనే పోలాజి సంతోష్, పోలాజి సురేశ్‌కు సాదాబైనామా ద్వారా చెరో 6.17 ఎకరాల భూమిని విక్రయించారని.. 2007లో వారికి 13బీ జారీఅయినట్టు అధికారులు సమాధానమిచ్చారని పేర్కొన్నారు. అయితే, పోలాజి సంతోష్ పేరిట 13బీ జారీచేసినట్టు పేర్కొన్న తేదీ ఆదివారమని.. సెలవురోజున 13బీ ఎలా మంజూరుచేశారని బాధితుడు ప్రశ్నిస్తున్నారు. 1992 నాటికి పోలాజి సంతోష్ వయస్సు రెండేండ్లు మాత్రమే ఉన్నదని.. 13బీ జారీచేసేనాటికీ అతని వయస్సు 17 ఏండ్లేనని చెప్పారు. గోపాల్‌రావునుంచి వారు కొనుగోలుచేసింది వాస్తవమే అయితే, 1992 నుంచి 2012 వరకూ పట్టాదారుగా కానీ, అనుభవదారుగా కానీ వారి పేరు ఎందుకు నమోదుకాలేదని ప్రశ్నిస్తున్నారు. 2007లోనే పోలాజి సంతోష్, సురేశ్ పేరిట 13బీ జారీచేసి ఉంటే.. 2012లో సదరు భూమికి పట్టాదారు గోపాల్‌రావేనని మెమో ఎలా జారీచేస్తారని నిలదీస్తున్నారు. సదరు భూమికి సంబంధించిన పాస్‌బుక్‌లో పేరు మార్చడానికి గల ఆధారాలు చూపమంటే రెవెన్యూ అధికారులు దాటవేస్తున్నారని.. అప్పటి వీఆర్వో మండల రెవెన్యూ కార్యాలయానికి రికార్డులు అప్పగించలేదని చెప్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఆధారాలు పోయినయ్ అంటున్నరు


రాజకిషన్‌రావు, బాధితుడు

గోపాల్‌రావు నుంచి పోలాజి సంతోష్, పోలాజి సురేశ్ భూమిని కొన్నారనేది అవాస్తవం. అధికారులతో కుమ్మక్కై, నకిలీ 13బీ పుట్టించి, నా భూమిని దోచేయాలని చూస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో ఉన్న రికార్డులు పరిశీలించాలని కోరినా, అవి కూడా పోయాయని అధికారులు దాటవేస్తున్నారు. హాజీపూర్‌లో నాకున్న భూమిని అమ్మి, నాగేపల్లిలో కొన్నాను. ఇప్పుడు ఆ భూమి వేరే వారిదంటూ ఏండ్ల తరబడి తిప్పుకొంటున్నరు. పాస్‌బుక్ మంజూరుచేయకుండా అధికారులు సతాయిస్తున్నారు. నేను స్థానికేతరుడినని నాపై దౌర్జన్యం చేస్తూ మోఖాపైకి రానివ్వటంలేదు. అధికారులకు చెప్తే పట్టించుకోవడంలేదు.
- రాజకిషన్‌రావు, బాధితుడు

మూడ్రోజులు సమయమిస్తే.. పహాణీలు పరిశీలిస్తాం

నాగేపల్లి ఇంతకుముందు వేమనపల్లి మండలంలో ఉండేది. అక్కడ రికార్డులు పోయిఉంటే మేమేం చేయలేం. ఆ మండలం నుంచి వచ్చిన రికార్డులు మాత్రమే మా వద్ద ఉంటాయి. మాకు రికార్డులు రాలేదని లెటర్ పంపినా వేమనపల్లి మండలాధికారులు స్పందించకపోతే మేమేం చేస్తం? మాకు మూడ్రోజులు సమయమిస్తే పహాణీలు పరిశీలించి సమస్య ఎలా తలెత్తిందో తేలుస్తాం. దీనిపై ఆర్డీవోకూ అప్పీల్ చేసుకోవచ్చు.
- లక్ష్మి, కన్నెపల్లి తాసిల్దార్

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles