రైతును పిలిచి కుర్చీవేసి..సమస్య పరిష్కారానికి హామీ


Thu,April 18, 2019 07:57 AM

mancherial farmers says neglect of the officers for land patta

-చనిపోయినోళ్ళు సాక్ష్యం చెప్పాలట’ కథనంపై అధికారుల్లో కదలిక
-సమస్య పరిష్కారానికి హామీ

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇన్నాళ్లూ తాసిల్దార్‌ కార్యాలయ గోడలు పట్టుకొని తిరిగిన రైతుకు అనుకోకుండా గౌరవం లభించింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయికి చెంది న రైతు కుడుకల బాపు అనే రైతు తన భార్య పేరిట పట్టా కోసం గతేడాది కాలం గా తాసిల్దార్‌ కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు. రైతు పడుతున్న కష్టంపై నమస్తే తెలంగాణలో ‘చనిపోయినోళ్ళు సాక్ష్యం చెప్పాలట’ అనే పేరుతో మెయిన్‌ పేజీలో కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. రైతు బాపును తాసిల్దార్‌ కార్యాలయానికి పిలిపించి కుర్చీవేసి సమస్యను వినే స్థాయికి తీసుకొచ్చింది. కోటపల్లి మండలం జనగామ గ్రామంలో సర్వే నెం.76లో 2.30 ఎకరాలు, సర్వే నెం.72లో 0.39 గుంటల భూమి బాపు మామ అల్లారి పోచంపై ఉంది.

అల్లారి పోచంతో పాటు అతని కొడుకు సైతం చనిపోయాడు. తన భార్య పేరిట ఈ భూమిని పట్టా చేయాలని బాపు కోటపల్లి తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ ఏడాదికాలంగా తిరుగుతున్నాడు. పత్రికలో కథనం రావడంతో విచారణ చేపట్టాలని తాసిల్దార్‌ రాజ్‌మోహన్‌ ఆర్‌ఐ డిలీశ్‌ను ఆదేశించడంతో రైతు బాపును తాసిల్దార్‌ కార్యాలయానికి పిలిపించి విచారణ ప్రారంభించారు. పట్టా కావాల్సిన భూమి చుట్టు ఉన్న రైతుల వివరాలను సేకరించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. సర్వే నం.72లోని భూమిలో కాస్తుదారునిగా వేరే వ్యక్తి పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీశారు. అతనికి నోటీసులు జారీచేసి సమస్యను మరో వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

రైతు సమస్యపై స్పందించిన కలెక్టర్‌

-పెద్ద సూరారంలో భూ మార్పిడి చేయాలని ఆదేశం
నల్లగొండ మండలంలోని పెద్దసూరారం గ్రామంలో సర్వే నెం.737పై చోటు చేసుకున్న భూ వివాదంపై ‘నమస్తే తెలంగాణ’ కథనం ఆధారంగా నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ రైతు యాదగిరిరెడ్డి పేరిటనే భూమి పట్టా చేయాలని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నివేదికను సిద్ధం చేసి రాత్రి కలెక్టర్‌కు అందజేయగా దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన ఆయన వెంటనే యాదగిరిరెడ్డి పాస్‌ పుస్తకంలో నుంచి తొలిగించిన భూమిని తిరిగి యాడ్‌ చేయాలని ఆదేశించారు. 737 సర్వే నెంబర్‌లోని వల్లపు యాదగిరిరెడ్డి-జయమ్మకు మధ్య భూ మార్పిడి విషయంలో అధికారుల పొరపాట్లను ఎత్తి చూపుతూ ‘తారుమారు పట్టాదారు’ పేరుతో నమస్తే తెలంగాణ మెయిన్‌లో బుధవారం ప్రచురించిన వార్త ఆధారంగా స్పందించిన కలెక్టర్‌ నివేదిక కోరి రైతు యాదగిరిరెడ్డికి న్యాయంచేసే చర్యలు చేపట్టారు.

యాదగిరిరెడ్డికి ఉన్నటువంటి భూమి.. ఎవరి నుంచి కొనుగోలుచేశాడు.. తర్వాత పరిస్థితి ఏమిటనే కోణంలో బుధవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌ ఎడిషన్‌లో కథనం రాసింది. దీనిపై కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ వెంటనే సంబంధిత వార్తా కథనంపై నివేదిక కోరుతూ సదరు సర్వే నంబర్‌లో ఉన్న రైతులు, విస్తీర్ణం, రికార్డులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి నల్లగొండ తాసిల్దార్‌ దామోదర్‌రావు 1968 నుంచి ఇప్పటివరకు ఉన్న రికార్డులు పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీన్ని పరిశీలించిన కలెక్టర్‌ 22 కుంటల భూమిని యాదగిరిరెడ్డి పేరిట చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ నేపధ్యంలో తప్పుగా పడిన రికార్డును అన్‌సైన్‌ చేసి నేడో రేపో యాదగిరిరెడ్డి పేర పట్టా మార్చే అవకాశముంది.

వీఆర్వోదే.. పొరపాటు..

-చర్యల కోసం ఆర్డీవో సిఫారసు
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామం లో రైతు ఎనమాల మల్లయ్య కుటుంబానికి రెవెన్యూ, వ్యవసాయశాఖ చేసిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య సీరియస్‌గా తీసుకున్నారు. జరిగిన పొరపాటుపై కలెక్టర్‌ తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్యను విచారణాధికారిగా నియమించారు. వీఆర్వో నర్సయ్య పొరపాటు వల్ల రైతు కుటుంబం నష్టపోయిందని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యకు బుధవారం నివేదిక సమర్పించారు.
వీఆర్వో కారణంగానే మల్లయ్య కుటుంబం నష్టపోయిందని నివేదికలో పేర్కొన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘చిన్న నిర్లక్ష్యం..పెద్దశాపం’ కథనంతో కలెక్టర్‌ స్పందించిన విషయం పాఠకులకు తెలిసిందే.

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బావోజి గూడెం రైతు ఎనమాల మల్లయ్య 2019 జనవరి 3న అనారోగ్యంతో మరణించాడు. ఆ రైతు కుటుంబానికి అధికారుల నిర్లక్ష్యం వలన రైతుబంధుతో పాటు రైతుబీమా ప్రయోజనం అందలేదు. రికార్డుల ప్రక్షాళన సమయంలో వీఆర్వో తప్పిదం వల్ల రైతు మల్లయ్య భూమి పాస్‌ పుస్తకంలో నమోదు కాలేదు. ఇతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించారు. రైతుకు పట్టా నెంబర్‌ జనరేట్‌ అయినప్పటికీ అధికారులు బీమా చేయకుండా నిర్లక్ష్యంచేశారని నివేదించినట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ శివలింగయ్య సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. రైతు మల్లయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య తెలిపారు.

నమస్తే తెలంగాణకు రుణపడి ఉంటాం..

నేను ఏడాది కాలంగా ఇబ్బందులు పడుతున్నా. అధికారులు కనీసం పట్టించుకోలేదు. నేను పేద రైతుని. నా గోడు వినే నాథుడే లేకుండా పోయాడు. అప్పులు చేసి పట్టా కోసం తిరుగుతున్నా. కల్టెకరమ్మను కలిసినా. అయినా నా సమస్య పరిష్కారం కాలేదు. అడగకుండానే నా దగ్గరికి వచ్చి నా సమస్యను తెలుసుకుని భూమికి పట్టా అయ్యేలా ‘నమస్తే తెలంగాణ’ చొరవ తీసుకుంది. మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న నాలాంటి రైతుల సమస్యలను కూడా పరిష్కరించాలి.
- కుడకల బాపు, మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామరైతు

6868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles