పోలీస్‌కు రెవెన్యూ వత్తాసు


Fri,July 19, 2019 01:59 AM

Mahabubnagar district Farmers Meets Dharmaganta

-సోదరుల భూమి రిటైర్డ్ డీఎస్పీకి రిజిస్ట్రేషన్
-ఇదేమిటని ప్రశ్నిస్తే స్థానిక సీఐ నుంచి బెదిరింపులు
-గతంలో చేసిన తప్పును ఎలా సరిచేస్తామంటూ డిప్యూటీ తాసిల్దార్ వాదన
-పోలీస్ కొడుకు అండతో ఓ తండ్రి కబ్జాపర్వం
-క్రమంగా తరుగుతున్న పొరుగు రైతు భూమి
-కబ్జాదారుడి కొత్త పాస్‌పుస్తకంలో రోజుకింత నమోదు
-ధర్మగంటను ఆశ్రయించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాధితులు

పోలీసుల కబ్జా పర్వానికి రెవెన్యూ అధికారుల అండదండలు తోడయితే.. సామాన్య రైతుల పేరిట ఉన్నభూమి క్రమంగా తరిగిపోవాల్సిందే! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సంఘటనలే ఇందుకు ఉదాహరణలు. రిటైర్డ్ డీఎస్పీ రెవెన్యూ అధికారుల అండతో స్వయాన సోదరుల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాడు. గతంలో తప్పు జరిగిందేమో .. దీనిపై ఇప్పుడేమీ చేయలేమంటూ డిప్యూటీ తాసిల్దార్ వితండవాదన చేస్తున్నాడు. మరోవైపు పోలీసు అధికారి అయిన కొడుకు అండచూసుకుని ఓ తండ్రి పక్కనే ఉన్న భూమిని క్రమంగా ఆక్రమించుకుంటూ వస్తున్నాడు. తన భూమికి కొలతలు వేయాలంటూ బాధితుడు సర్వేకోసం ఫీజు కట్టినా తాసిల్ అధికారులు దరఖాస్తును పక్కన పడేశారు. కబ్జాదారుడు ఆక్రమించింది ఆక్రమించినట్టు కొత్త పాస్‌పుస్తకంలో నమోదు చేస్తున్నారు. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారుల నుంచి తమ భూమిని కాపాడాలంటూ బాధితులు ధర్మగంటను ఆశ్రయించారు.
Dharmaganta
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కన్మన్‌కాల్వ గ్రామానికి చెందిన ముర్గని పెంటయ్యకు సర్వేనంబర్లు 20, 95, 96, 97, 104, 106 లో మొత్తం 14.06 ఎకరాల భూమి ఉండేది. పెంటయ్యకు ఐదుగురు కొడుకులు కాగా, పెద్దకొడుకు కిష్టయ్య రిటైర్డ్ డీఎస్పీ. పెంటయ్య మరణానంతరం అతని పేరిట ఉన్న భూమిని తల్లి బుచ్చమ్మ, ఐదుగురు కొడుకులు ఆరు భాగాలుగా పంచుకొని.. పట్టాలు సైతం పొందారు. వీటికి సంబంధించి 1బీ, పాత పాస్‌పుస్తకాలు ఉన్నాయి. ఎవరికి వచ్చిన భూమిని వారు సాగుచేసుకుంటూ ఉంటున్నారు. అయితే, రెండో సోదరుడు ముర్గని కృష్ణయ్య పేరిట ఉన్న 2.14 ఎకరాల భూమిని ఆయనకు తెలియకుండానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. మోఖా మీదికి వెళ్లి పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు రిటైర్డ్ డీఎస్పీ కిష్టయ్య పేరిట కొత్త పాస్‌పుస్తకం జారీచేశారు. దీంతో కృష్ణయ్య రికార్డుల్లో భూమి లేకుండాపోయింది. కాస్తులో ఉన్న కృష్ణయ్యను ఆయన అన్న కిష్టయ్య తన అధికార బలంతో బెదిరిస్తున్నారు. దీనికి స్థానిక పోలీసుల జోక్యం కూడా తోడయింది. స్థానిక సీఐ కిషన్.. రిటైర్డ్ డీఎస్పీకి వత్తాసు పలుకుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని కృష్ణయ్య కొడుకు విజయచందర్ తెలిపారు.

తప్పు జరిగి ఉండొచ్చు

ఆ భూమికి సంబంధించి పట్టా మార్పిడిలో తప్పు జరిగి ఉండవచ్చు. ఒక తాసిల్దార్ ఇచ్చిన దానిని మేం ఎలా మార్చగలం. అదే ఫైనల్. సమస్య ఉంటే బాధితులు కోర్టుకెళ్లి తేల్చుకోవాలి. తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూపత్రాలు అందుబాటులో లేవు. ఆ భూమికి సంబంధించి పహాణీలు దొరుకడంలేదు. మాన్యువల్ పహాణీలు కావాలి. ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదనుకుంటా. పట్టా ఇంకొకరికి అయిందంటే దానికి మేం బాధ్యులంకాదు.
- రాజశేఖర్, డిప్యూటీ తాసిల్దార్, నవాబ్‌పేట

భూమి లేకుండాచేశారు


విజయ్‌చందర్, బాధితుడు కృష్ణయ్య కొడుకు

మా నాన్న పేరు మీద పట్టా ఉన్నప్పటికీ.. రెవెన్యూ అధికారులు మా పెద్దనాన్న పేరుతో కొత్త పాస్‌పుస్తకం జారీచేశారు. మా మిగతా బాబాయిల భూమిని కూడా మా పెద్దనాన్న ఇలాగే కాజేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. పేరు మార్పిడి ఎలా జరిగిందని రెవెన్యూ అధికారులను అడిగితే.. ఎవరూ పట్టించుకోవడంలేదు. డిప్యూటీ తాసిల్దార్ రాజశేఖర్ చాలాసార్లు దురుసుగా ప్రవర్తించారు. ప్రజావాణిలో ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. కోర్టుకెళ్లి తేల్చుకోండంటూ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. రిటైర్డ్ డీఎస్పీతో పెట్టుకోకండి.. ఒక మూడునెలలు భూమిని వదిలేసుకోండి.. తర్వాత ఎలాగైనా ఒప్పించి న్యాయం జరిగేలా చూస్తా అని సీఐ కిషన్ బెదిరిస్తున్నారు.


కండ్లముందే తరిగిపోతున్న భూమి!

Mohanreddy
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన సువర్ణమ్మ, మోహన్‌రెడ్డి 1992లో గ్రామానికే చెందిన సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి నుంచి సర్వే నంబర్ 142/ఈ లోని 6.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారిపేరు మీదనే కొత్తపట్టాదారు పాస్‌పుస్తకం (ఖాతా నంబర్ 2790) కూడా వచ్చింది. వీరి భూమికి పక్కనే పొలం ఉన్న సంపతి పర్వతరెడ్డి.. పోలీస్ అధికారి అయిన తన కొడుకు అండతో మోహన్‌రెడ్డి భూమిని క్రమంగా ఆక్రమిస్తూ వస్తున్నారు. కండ్లముందే భూమి ఆక్రమణకు గురవుతుండటంతో సువర్ణమ్మ, మోహన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామపెద్దలను ఆశ్రయించారు. ముందుగా న్యాయంచేస్తామని చెప్పినవారు.. పోలీస్ అధికారి ప్రమేయం ఉన్నదని తెలుసుకుని వెనక్కితగ్గారు. దీనిని అలుసుగా తీసుకున్న ఆక్రమణదారుడు ఏకంగా 2.27 ఎకరాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

భూ రికార్డుల ప్రక్షాళనలో మోహన్‌రెడ్డికి 6.7 ఎకరాలకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వగా.. ఆయన ఆధీనంలో భూమి మాత్రం 3.20 ఎకరాలే మిగిలింది. తనవద్ద ఉన్న పత్రాల ఆధారంగా భూమి కొలతలు చేయాలని 2017లో తాసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోగా.. సర్వేయర్, గిర్దావర్.. దానిని పట్టించుకోలేదు. పైగా ఆక్రమణదారుకు అండగా నిలిచి, అతడు దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి 142 సర్వేనంబర్‌లో 3.34 ఎకరాలు ఉంటే దానిని 5.25 ఎకరాలకు పెంచేశారు. మరో సర్వే నంబర్ 143 లో 6.05 ఎకరాలు ఉంటే దాన్ని కూడా 6.25 ఎకరాలుగా నమోదు చేశారు. పట్టాల్లో ఉన్నదానికంటే ఎక్కువ పొలాన్ని చూపించడం విచిత్రం. పర్వతరెడ్డి కొడుకు పోలీస్ అధికారి కావడంతో రెవెన్యూ అధికారులు సహకరించారని మోహన్‌రెడ్డి వాపోతున్నారు. తాసిల్దార్ కార్యాలయం, ప్రజావాణి వద్దకు న్యాయం చేయాలని కోరుతూ ఏండ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అక్రమంగా మోఖా రిపోర్టును తయారుచేసి అన్యాయం చేస్తున్నారని, ఆక్రమణకు గురైన తమ 2.27 ఎకరాలను తిరిగి సర్వేయర్‌తో కొలిపించి అప్పగించాలని, తమకు న్యాయం చేయాలని మోహన్‌రెడ్డి కోరుతున్నారు.

781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles