2 లక్షలు తిన్నా పనిచేయలేదు


Wed,June 12, 2019 02:34 AM

Mahabubabad district Farmers Meets Namaste Telangana Office Dharmaganta

-స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న అధికారులు
-సర్వేచేసినా భూమిని అప్పగించని వైనం
-ఉన్నతాధికారుల ఆదేశాలను బుట్టదాఖలుచేసిన మండలాధికారులు
-ధర్మగంటను అశ్రయించిన మహబూబాబాద్ జిల్లా రామన్నగూడెంవాసి రామనర్సమ్మ

స్వాతంత్య్రసమరయోధుడి కుటుంబం పట్ల కూడా రెవెన్యూ అధికారులు నిర్ల్యక్షంగా ప్రవర్తిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కడారి కర్రెయ్య కుటుంబానికి ఐదెకరాల భూమిని అప్పగించాలని జిల్లాస్థాయి అధికారులు ఆదేశాలు జారీచేసినా.. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. రికార్డులు దొరుకడం లేదంటూ.. ఆ భూమి వ్యవసాయానికి పనికిరాదంటూ ముప్పుతిప్పలు పెడ్తున్నారు. 20 ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఆ కుటుంబసభ్యులు చివరకు ధర్మగంటను ఆశ్రయించారు.

నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కడారి కర్రెయ్య 40 ఏండ్ల క్రితం చనిపోయారు. ఆయన మరణానంతరం ఆయన భార్య రామనర్సమ్మకు ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో పింఛన్ మంజూరుచేసింది. తమకు వ్యవసాయ భూమి ఇప్పించాలని కోరుతూ ఆమె అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ అంబరీశ్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఏడీ మాణిక్‌రావు, సర్వేయర్ నారాయణరెడ్డి సర్వే నిర్వహించి.. ముంగిమడుగు గ్రామంలోని సర్వే నంబర్ 310 లో ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. సదరు భూమికి హద్దులు ఏర్పాటుచేసి.. రామనర్సమ్మకు అప్పగించాలని 2002లోనే జిల్లాస్థాయి అధికారులు ఆదేశించారు. కానీ మండల రెవెన్యూ అధికారులు రాకుండానే.. సర్వేచేయకుండానే.. తమకు రికార్డులు దొరుకడంలేని.. అది సేద్యానికి పనికిరాని భూమి అంటూ సమరయోధుడి కుటుంబాన్ని తిప్పుకొంటున్నారు. తమ నుంచి దాదాపు రూ.2 లక్షల వరకు లంచాలు తీసుకొని కూడా రెవెన్యూ అధికారులు ముప్పుతిప్పలు పెడ్తున్నారని కర్రెయ్య కుటుంబసభ్యులు వాపోతున్నారు. సర్వే నంబర్ 310లో 5.28 ఎకరాల బంచరాయి (ప్రభుత్వ) భూమి ఉన్నదని.. దానిని కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించారు.
TRR0

నాటి సీఎం వైఎస్ ఆదేశించినా.. ఫలితంలేదు


నారాయణరెడ్డి, రామనర్సమ్మ కుమారుడు

అప్పటి ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కూడా స్వయంగా కలిసి దరఖాస్తు చేసుకొన్నాం. అయినా రెవెన్యూ అధికారులు కనికరించలేదు. అప్పటి తాసిల్దార్, ఇతర అధికారులు మా దగ్గర డబ్బులు తీసుకొని కూడా పనిచేయలేదు. 1978 నుంచి 2002 వరకు పహాణీలు తీసుకొని రమ్మన్నారు. అవి తీసుకవెళ్లినా ఫలితంలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాం. ఉన్నతాధికారులు ఆదేశించినా స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదు. గతంలో పనిచేసిన వీఆర్వో.. తాసిల్దార్‌ను అడుగు. నాకు తెలియదు అని సమాధానమిస్తున్నారు. ఈ విషయం తలనొప్పిగా మారిందంటూ తాసిల్దార్ దురుసుగా ప్రవర్తించి.. బయటకు పంపించారు. చేసేదిలేక మహబూబాబాద్ కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదుచేశా.


నా కుమారుడికి భూమి ఇప్పించండి


రామనర్సమ్మ, స్వాతంత్య్ర సమరయోధుడి భార్య

మా ఆయన పోరాటంచేసి జైలుకు పోయిండు. ఆయన పోయినాక నాకు పింఛన్ ఇస్తున్నారు. ఐదెకరాల భూమి ఇస్తామంటే చాలాసార్లు హైదరాబాద్, వరంగల్‌కు పోయిన. మా ఇంటికి అధికారులు వచ్చిండ్రు.. భూమి ఇస్తామన్నారు. ఇప్పటివరకు భూమి చూపించలె. నాకు చేతకావడంలేదు. కండ్లు సరిగా కనిపించడంలేదు. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు, కోడలు చనిపోయారు. వాళ్లకు కుమార్తె ఉన్నది. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారు. మా ఆయన స్వాతంత్య్ర పోరాటంచేసినదానికి అధికారులు కనీసం గౌరవం ఇవ్వడంలేదు. బాధేస్తున్నది. చివరిదశలో ఉన్నా. భూమి ఇస్తే నా కుమారుడు వ్యవసాయం చేసుకొని బతుకుతాడు.

ఏండ్ల సమస్యలు తీరిపోతున్నాయ్


పాశం పుల్లారెడ్డి

భూరికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయించుకునేందుకు ఎన్నో ఏండ్లు ప్రయత్నించినా అవి సరికాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూశాఖలో తీసుకొస్తున్న మార్పులతో ఆ సమస్యలన్నీ తీరిపోతున్నాయి. ఇన్నాళ్లూ రైతులు ఎన్నిసార్లు అధికారులను కలిసినా పట్టించుకొనే వారు కాదు. ఎవరు డబ్బులు ఇస్తే అధికారులు వాళ్ల పనులే చేసిపెట్టేది. ఇప్పుడు పరిస్థితి అలాలేదు. సమస్య ఉందంటూ వెళ్తే వెంటనే పనులు చేస్తున్నారు. అధికారుల్లో ఈ మార్పు సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
- పాశం పుల్లారెడ్డి, కల్మల్‌చెర్వు రైతు, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా


రైతులకు మేలు జరుగుతున్నది


నిమ్మల శ్రీకాంత్ తిమ్మాపురం

ధర్మగంట ద్వారా భూసమస్యలు తీరిపోయి రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. భూసమస్యల పరిష్కారం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయారు. ధర్మగంటతో అధికారుల్లో చలనం వచ్చింది. భూరికార్డుల్లో ఉన్న తప్పులను సవరించి రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తున్నారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. కానీ అధికారుల అలసత్వంతో రికార్డుల ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరుగలేదు. ఇప్పుడు ధర్మగంట ద్వారా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తున్న నమస్తే తెలంగాణకు ప్రత్యేక ధన్యవాదాలు.
- నిమ్మల శ్రీకాంత్ తిమ్మాపురం, అర్వపల్లి మండలం, సూర్యాపేట జిల్లా


అధికారులు నిర్లక్ష్యం వీడుతున్నారు


శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి దేవస్థానం చైర్మన్

రైతులకు జీవనాధారమైన భూమి హక్కులను పొందడానికి రెవెన్యూ అధికారులు సతాయించడం నిత్యకృత్యంగా మారింది. కొందరు అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి వారిని ధర్మగంట ద్వారా నమస్తే తెలంగాణ మేలుకొలిపి వారి బాధ్యతను గుర్తుచేస్తున్నది. అధికారులు నిర్లక్ష్యం వీడుతుండటంతో ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యలు తీరుతున్నాయి.
- శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి దేవస్థానం చైర్మన్


రెవెన్యూశాఖ ప్రక్షాళన అవసరం


వైకుంఠచారి, మిర్యాలగూడ

రెవెన్యూశాఖలో సమస్యలపై నమస్తే తెలంగాణ చేపట్టిన ధర్మగంట ఎంతో బాగున్నది. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించే వీలున్నప్పటికీ, ఉద్యోగులు పూర్తిస్థాయిలో పరిష్కరించకపోవడంతో సామాన్యులు ఇబ్బం దులెదుర్కొన్నారు. ధర్మగంట ద్వారా అటు అధికారుల్లో, ఇటు సామాన్యుల్లో కొంతమేర చైతన్యం వచ్చింది.
-వైకుంఠచారి, మిర్యాలగూడ

1311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles