మాదిరాజు లక్ష్మీనరసింహారావు మృతి


Sat,February 13, 2016 02:19 AM

madiraju lakshmi narasimha rao passed away

raju
-స్వాతంత్య్ర సమరయోధుడు, సాహితీవేత్త
కాచిగూడ, నమస్తే తెలంగాణ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సాహితీవేత్త మాదిరాజు లక్ష్మీనరసింహారావు (87) గత కొద్దిరోజులుగా ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2012వ సంవత్సరంలో భార్య ప్రమీలాదేవి మరణించారు. లక్ష్మీనరసింహ్మారావు నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడంటూ ఆయన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన నరసింహారావు కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయంలో గత 50 ఏళ్లుగా కార్యదర్శిగా, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకులుగా, గాంధీ పీస్ ఫౌండేషన్ కార్యదర్శిగా సేవలందించారు. తెలంగాణ వైతాళికులు, వినోబా జీవితం-ఉద్యమం,

స్వామీ రామానందతీర్థ, గాంధీ మహాత్ముడు, ఇందిరాగాంధి జీవిత చరిత్ర, హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమం-తెలంగాణ, వందేమాతరం, మాడపాటి హన్మంతరావు జీవిత చరిత్ర తదితర 36కు పైగా పుస్తకాలు రాసి సాహితీవేత్తగా పేరుపొందారు. ఆయన మృతికి పలువురు రచయితలు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రగడ సంతాపం తెలిపారు. సాయంత్రం ఆయన పార్థివదేహానికి బన్సిలాల్‌పేటలోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నరసింహారావు పార్థివదేహానికి మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర్‌రావు, విజిలెన్స్ కమిషనర్ నందన్, గాంధి జ్ఞాన్ ప్రతిష్ఠాన్ అధ్యక్షుడు సీవీ చారి, వైసీపీ నేత మురళీకృష్ణ, రచయితలు, స్వాతంత్య్ర సమరయోధులు, తదితరులు పుష్పాంజలి ఘటించారు.

-సీఎం కేసీఆర్ సంతాపం
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయానికి సేవలందించిన సాహితీవేత్త ఎంఎల్ నరసింహారావు మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భాషా నిలయానికి చాలాకాలంగా సేవలు అందించారన్నారు. తెలుగుభాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

3109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS