ఉలిక్కిపడ్డ కాప్రా!

Sat,January 19, 2019 03:03 AM

-పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు దుర్మరణం
-పేలుడుధాటికి కూలిన ఇంటి నాలుగు గోడలు
-మొదటి అంతస్తు నుంచి పడి యజమాని మృతి
-రోడ్డుపై వెళ్తుండగా శిథిలాలు తగిలి మరొకరు..
-ముగ్గురికి తీవ్రగాయాలు.. దవాఖానలో చికిత్స
-హైదరాబాద్ శివారు కాప్రాలో విషాదం
-ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
-మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించిన మేయర్ బొంతు రామ్మోహన్

కాప్రా/మల్లాపూర్/చర్లపల్లి: రాజధాని శివారు ప్రాంతమైన కాప్రా శుక్రవారం తెల్లవారుతుండగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ ఇంటి యజమాని మృతిచెందాడు. పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంటి గోడలు రోడ్డుమీద బైక్‌పై వెళ్తున్న మరో యువకుడికి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. యజమాని భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

తునాతునకలైన గోడలు

రాజస్థాన్‌లోని కుషాల్‌పూర్‌కు చెందిన మోహన్‌లాల్ చౌదరి (42), లీల(40) దంపతులు 15 ఏండ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చారు. కాప్రా మండల కార్యాలయం పక్కన సాయిప్రియకాలనీలో నివాసముంటూ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. వీరి పిల్లలు గోవింద్‌చౌదరి(12), నిఖితాచౌదరి(10) స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మోహన్‌లాల్ చౌదరి ఇంట్లో భారీపేలుడు సంభవించింది. మొదటి అంతస్తులో ఉంటున్న వీరి ఇంటి నాలుగు గోడలు పేలుడుధాటికి తునాతునకలయ్యాయి. తీవ్రంగా కాలినగాయాలతో మోహన్‌లాల్‌చౌదరి ఇంటిపై నుంచి కిందికి అమాంతంగా పడిపోవడంతో స్థానికులు సమీపంలోని లైఫ్‌లైన్ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. అదే సమయంలో యాద్రాదిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేడుపల్లికి చెందిన ఎలగందుల రవి(30)రోడ్డుమీద బైక్‌పై వెళ్తుండగా, పేలుడు ధాటికి దూసుకొచ్చిన శిథిలాలు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మోహన్‌లాల్‌చౌదరి భార్య లీల(35), పిల్లలు గోవింద్ చౌదరి(14), నిఖితా చౌదరి(11)కూడా తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతున్నారు. మరో నలుగురు స్వల్ప ంగా గాయపడ్డారు. పేలుడుధాటికి చుట్టుపక్కల నివాసాలు సైతం ధ్వంసమయ్యాయి. శిథిలాలు వందమీటర్ల మేర ఎగిసిపడటంతో స్థానికులు భయకంపితులయ్యారు. లైఫ్‌లైన్ దవాఖాన అద్దాలు పగిలిపోయాయి.
Gass1

ఆర్థిక సహాయం ప్రకటించిన మేయర్

ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి సందిర్శించారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ తరపున రూ.రెండు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఆపద్బంధు పథకం కింద మరో రూ.లక్ష అందజేస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్ స్వర్ణరాజు,కలెక్టర్ ఎంవీ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్, మ ల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్‌శర్మ, అడిషనల్ కమిషర్ సుధీర్‌కుమార్, ఏసీపీ శివకుమార్ ఘటనాస్థలంలో విచారణ చేపట్టారు.

గ్యాస్ లీకైంది: కుషాయిగూడ సీఐ చంద్రశేఖర్

ప్రాథమిక దర్యాప్తు తర్వాత గ్యాస్ లీకేజీతోనే పేలుడు సంభవించినట్టుగా భావిస్తున్నామని కుషాయిగూడ సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందా? గ్యాస్ లీకై బంగారు ఆభరణాల తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల పేలుడు సంభవించిందా అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ వివరించారు.
Gass-KTR

పెండ్లయి ఏడాదిన్నర.. భార్య గర్భవతి

ఈ దుర్ఘటనలో అమాయకుడైన ఎలగందుల రవి బలైన తీరు ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టింది. ఓల్డ్‌కాప్రాలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటూ ఏఎస్‌రావునగర్ సమీపంలోని సాయినాథపురంలో రవి హెయిర్ సెలూన్ నిర్వహిస్తున్నా డు. ఏడాది కిందటే మాధవితో అతనికి వివాహమైంది. ఆమె ప్రస్తుతం గర్భవతి. శుక్రవారం ఉదయం సెలూన్‌కు బైకుపై వెళ్తుండగా పేలుడు ధాటికి శిథిలాలు దూసుకొచ్చి ఢీకొట్టడంతో మృతిచెందాడు. సమాచారం తెలుసుకొని వచ్చిన భార్య మాధవి.. రవి మృతదేహంపై పడి విలపించడం స్థానికులను కంటతడిపెట్టించింది.
Gass3
Gass2

4094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles