కొత్త పింఛన్‌దారులు 8,45,339


Mon,July 22, 2019 02:36 AM

Lot of people will be benefitted by the enhancement of Aasara pension

-గతేడాది నవంబర్ ఓటరు జాబితా ప్రకారం లెక్కతేల్చిన అధికారులు
-అర్హుల జాబితా రూపకల్పనకు కసరత్తు
-పంచాయతీలు, వార్డులవారీగా ముసాయిదా
-అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాతే తుదిజాబితా
-ఆమోదముద్రపై తుది నిర్ణయం కలెక్టర్లదే
-నేటినుంచి లబ్ధిదారుల ఖాతాల్లో రెట్టింపు పింఛన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్త పింఛన్‌దారుల ఎంపికకు కసరత్తు మొదలైంది. గతేడాది నవంబర్ 19న విడుదలచేసిన జాబితాను అనుసరించి వృద్ధాప్య పింఛన్‌దారుల కొత్త జాబితాను రూపొందించనున్నారు. కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలో 57 నుంచి 64 ఏండ్లలోపువారు 8,45,339 మంది ఉన్నట్టు అధికారులు లెక్కతేల్చారు. ప్రస్తుతం 65 ఏండ్లు పైబడిన వారందరికీ పింఛన్లు ఇస్తున్నారు. ఇకపై 57 ఏండ్లు నిండిన వారికి కూడా పిం ఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఆ ప్రకారమే అర్హుల ఎంపిక మొదలుపెడుతున్నారు. మరోవైపు రెట్టింపు చేసిన పింఛన్ల సొమ్ము సోమవారం నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నది. ఇందుకోసం బ్యాం కులు, పోస్టాఫీసులకు మొత్తం రూ.863.24 కోట్లు తరలించారు. పింఛన్ల పెంపుదల ఉత్తర్వులు కూడా గ్రామగ్రామాన లబ్ధిదారులకు చేరాయి. పింఛన్‌దారులకు పోస్టాఫీసుల మాదిరిగా బ్యాంకర్లు కూడా నగదు ఇవ్వాలని, మండలాల్లో గ్రామాలవారీగా నిర్దేశించిన రోజుల్లో పింఛన్ సొమ్మును అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రతినెలా రూ.863.24 కోట్లు చెల్లింపు

ప్రస్తుతం రాష్ట్రంలో 38.99 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులున్నారు. పెంచిన సొమ్ము ప్రకారం వారికి ప్రతినెలా రూ.863.24 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇందుకు బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లకుపైగా కేటాయించారు. గతంలో ఏటా రూ.5,500 కోట్లు కేటాయించేవారు. కానీ సీఎం కేసీఆర్ పింఛన్ సొమ్మును రెట్టింపు చేయడంతోపాటు వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల వయోపరిమితిని తగ్గించడంతో నిధులు పెంచడం అనివార్యమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,92,594 మంది వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నారు. అర్హుల వయోపరిమితి తగ్గించడంతో ఈ సంఖ్య మరో ఏడు లక్షలకుపైగా పెరిగే అవకాశమున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు మాత్రమే ఈ పింఛన్లకు అర్హులు.

అర్హులకు అన్యాయం చేయరాదు

జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఆసరా పింఛన్లలో అన్యాయం చేయరాదని, లబ్ధిదారుల ఎంపికలో అధికారులు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని ప్రభుత్వం పేర్కొన్నది. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను వార్డులు, గ్రామపంచాయతీల్లో నిర్దేశించిన ప్రదేశాల్లో కచ్చితంగా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాలని, ఆ తర్వాత అర్హుల అన్ని వివరాలతో తుదిజాబితాను సిద్ధంచేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లదేనని స్పష్టంచేసింది. జాబితా సిద్ధమైన తర్వాత మండలాల నుంచి ఎంపీడీవోలు, మున్సిపాలిటీల నుంచి కమిషనర్లు ఆమోదం కోసం జిల్లా కలెక్టర్లకు నివేదించాలని, కలెక్టర్ల ఆమోదం తర్వాత సదరు జాబితాను ఆసరా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.

1592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles