మూడ్రోజులు ఓ మోస్తరు వర్షాలు


Fri,July 12, 2019 02:29 AM

Light to moderate rains in telangana

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి మూడ్రోజులపాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం

గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల గురువారం సాయంత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ప్రభావం కనిపించినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, అబిడ్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, బాలానగర్, చింతల్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లో గ్రేటర్‌లోని చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 59 శాతంగా నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

rain3

పలు జిల్లాల్లో మోస్తరు వానలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వానలు పడ్డాయి. పలుచోట్ల జోరువాన కురిసింది. ఈ వర్షాలు పంటలకు మేలు చేస్తాయని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బాల్కొండ , బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఓ మోస్త్తరు వానపడింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 72.4 మి.మీ. వర్షం పడగా, అత్యధికంగా దస్తురాబాద్ మండలంలో 20 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడగా, ములుగు జిల్లా కేంద్రం, వాజేడు, వెంకటాపురం(నూగూరు), ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాల్లో వర్షం కురిసింది.

మహబూబాబాద్ జిల్లాకేంద్రంతోపాటు బయ్యారం, గార్ల , కేసముద్రం, కురవి తదితరమండలాల్లో వర్షం పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రంలో చిరుజల్లులు పడగా, జైనూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆలేరు, ఆత్మకూరు (ఎం) మండలాలలో ఓ మోస్తరు వర్షం కురువగా, బొమ్మలరామారం, రాజాపేట, ఆలేరు, తుర్కపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుజల్లులు పడ్డాయి. వికారాబాద్ జిల్లా వికారాబాద్, తాండూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడగా, మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 7.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా చెన్నూర్ మండలంలో 31.1 మి.మీ. జన్నారంలో 21.8 మి.మీ వర్షం కురిసింది.
rain2

3289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles