నేటి నుంచి ప్రపంచ తెలుగు వైభవం


Fri,December 15, 2017 10:42 AM

LB Stadium Is Geting Ready To Prapancha Telugu Mahasabhalu

-నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
-ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
-విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్
-అధ్యక్షత వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-ఎల్బీ స్టేడియంలో ప్రధాన కార్యక్రమం
-ఐదు వేదికలలో ఇతర కార్యక్రమాలు
-100 పుస్తకాల ఆవిష్కరణ
-అపూర్వ అతిథి సత్కారాలు
-12వేల మంది పోలీసులతో బందోబస్తు

రెండువేల ఏండ్ల తెలుగు భాషా సాహిత్య చరిత్రలో సరికొత్త యుగం ఆవిష్కృతమవుతున్నది. సమస్త తెలుగుజాతిని ఏకంచేసి పాలించిన కాకతీయుల కాలంలో విరాజిల్లిన తెలుగు సరస్వతి.. మళ్లీ ఆ స్వర్ణయుగాన్ని చూడబోతున్నది. మన తెలంగాణము తెలుగుకు మాగాణమని చాటుకుంటున్న సందర్భమిది. దశాబ్దాల తరబడి తెలంగాణేతరుల వలస పాలనలో విస్మృతికి గురైన తెలంగాణ సాహిత్యం ఉజ్జలంగా వెలుగులీనుతున్న అద్భుతమైన దృశ్యమిది. తెలుగు అక్షరకాంతులను విశ్వమంతటా వెదజల్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. అనితరసాధ్యమైన రీతిలో తెలుగు సంబురాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు అపూర్వమైన ఆతిథ్యాన్ని చవిచూడబోతున్నారు. తెలుగు సాహిత్య అస్తిత్వ ప్రతీకలైన మహానుభావులు హైదరాబాద్ నలుచెరగులా తామే స్వాగత తోరణాలుగా నిలిచి.. మహాసభలకు సమస్త ప్రజాసమూహాన్ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అన్ని ప్రక్రియలపై ఐదు రోజులపాటు నిరంతరంగా జరిగే అనేక సదస్సులు, కవి సమ్మేళనాలు, అవధానాలతో ఈ మహాసభలు తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని కొత్తమార్గం పట్టించనున్నాయి.

telugu-mahasabaluహైదరాబాద్, నమస్తేతెలంగాణ:తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ప్రపంచ తెలుగుమహాసభలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా ఈ మహాసభలను ప్రారంభిస్తారు. తెలుగు భాష సాహిత్యాలపై ఒక దార్శనికతతో ప్రపంచ మహాసభలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు విశిష్ట అతిథులుగా ఈ ప్రారంభ వేడుకలలో పాల్గొంటారు. ప్రధాన వేదికైన లాల్‌బహదుర్ స్టేడియంతోపాటు ప్రధాన వేదికలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎల్బీ స్టేడియంతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలంగాణ సారస్వత పరిషత్‌లన్నీ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేవిధంగా అలంకరించారు. ఈ సభల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకొన్నారు. ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపైన వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన డా.రాధా రాజారెడ్డి మన తెలంగాణ నృత్యరూపకం ప్రారంభసభలకు హైలైట్‌గా నిలువనున్నది. అనంతరం రామాచారి బృందం పాటలకచేరి ఉంటుంది.

జయ జయోస్తు సంగీత నృత్యరూపకాన్ని కళాకృష్ణ బృందం ప్రదర్శిస్తున్నది. తెలుగుభాషలో కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి అందుకున్న సాహితీ దిగ్గజాలు నగరానికి చేరుకున్నారు. ఒరియా, సంస్కృతం భాషలలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న సాహితీ వేత్తలు అతిథులుగా విచ్చేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు నగరానికి చేరుకున్నారు.సాయంత్రం ఆరు గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన సాంస్కృతిక సమావేశం నిర్వహిస్తారు. దీనికి ముఖ్యఅతిథిగా నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, గౌరవ అతిథిగా చెన్నైకి చెందిన ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ హాజరవుతారు. ప్రధానవేదికైన ఎల్బీస్టేడియంలో కాకతీయుల కాలం నుంచి ప్రాచీన శిల్ప కళాకృతులు.. తెలంగాణ ప్రాంతంలోనే అనేక ఆలయాల నమూనాలను ఏర్పాటుచేశారు. తెలంగాణ పల్లెసీమలను తలపించే విధంగా స్టాళ్లను నెలకొల్పారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడానికి కారణమైన జినవల్లభుని కురిక్యాల శాసనం నమూనాను మహా సభల వేదిక సమీపంలో ఏర్పాటు చేశారు. శాసనంలోని కందపద్యాలను తప్పనిసరిగా వేదిక సమీపంలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ శాసనాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. శాతవాహనుల కోటిలింగాలలో లభించిన నాణేలతోపాటు, ఫణిగిరి నాణేలు, అసఫ్‌జాహీల కాలంనాటి నాణేలను ప్రదర్శించనున్నారు.

kadiyam-srihari ఈ వరుసలోనే తెలుగుభాష చరిత్రకు గొప్పకానుకలను అందించిన అపురూపమైన తాళపత్రగ్రంథాల నమూనాలను ప్రదర్శిస్తారు. సిరిసిల్ల, పోచంపల్లి, పుట్టపాకల నుంచి వచ్చిన చేనేత వస్ర్తాలను ఈ ఐదు రోజులపాటు ప్రదర్శిస్తారు.
తెలుగు అకాడమీ, తెలంగాణ రాష్ట్ర సాహిత్యఅకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్‌లతో పాటు సాహితీ వేత్తలు కలిసి మొత్తం ఈ ఐదు రోజులలో అనేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. తెలుగు అకాడమీ 60 పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య, భాగ్యరెడ్డివర్మ, వంటి మహామహుల మోనోగ్రాఫ్‌లను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ 25 పుస్తకాలను ప్రచురించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాల ప్రకారం వాగ్భూషణమ్ భూషణమ్, మందార మకరందాలు పుస్తకాలను కిట్‌లలో భాగంగా అందజేస్తున్నారు.
హోటళ్ల సంఘం సారథ్యంలో 65 రకాల తెలంగాణ రుచులను సరసమైన ధరలలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకొన్నారు. మహాసభలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు ఐదువేల మందికి పైగా ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. భాషాపండితులతోపాటు విశ్వవిద్యాలయాల ఆచార్యులు, కళాశాలల ఉపన్యాసకులు కూడా వస్తున్నారు. కాగా మహాసభలకు పోలీసు విభాగం పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు తీసుకొన్నది. సుమారు 12వేలమంది పోలీసులతో కట్టుదిట్టంగా భద్రతాఏర్పాట్లు చేశారు. అతిథులు, ప్రతినిధులు బసచేసే హోటళ్లు, వేదికల వద్ద పటిష్ఠమైన భద్రతాచర్యలు చేపట్టారు. సభలకు హాజరయ్యే వారి వాహనాలకు ఇబ్బంది కలుగకుండా ఆయా ప్రదేశాల్లో దాదాపు 30.5 ఎకరాల ఖాళీ స్థలాలను గుర్తించి 1600 పెద్ద వాహనాలు, 6000 వాహనాలు ఒక్కే సారి పార్క్ చేసుకొనే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లుచేశారు. ముఖ్యఅతిధులు, వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే మార్గాలు, ప్రధాన వేదిక, కార్యక్రమాలు జరిగే ప్రాంగణాలు, వసతి గృహాల వద్ద భారీగా పోలీసు సిబ్బందిని మొహరించారు. ప్రధాన వేదిక వద్ద భద్రత ఏర్పాట్లను ఆ ప్రాంత డీసీపీ పర్యవేక్షిస్తారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఉన్నతాధికారులు మహాసభలు జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రతి దృశ్యాన్ని వీక్షించనున్నారు.

telugu-mahasabalu1

తెలుగు పోటీల్లో విజేతలు

-మహాసభల్లో బహుమతి అందుకోనున్న విద్యార్థులు
జాబితాను విడుదలచేసిన తెలుగు విశ్వవిద్యాలయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతల జాబితాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురువారం విడుదలచేసింది. అంతర్‌జిల్లా, రాష్ట్రస్థాయి, విశ్వవిద్యాలయాల స్థాయిలో పాఠశాల, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం, బృంద సాహిత్యం, వక్తృత్వం, వచన కవిత, వ్యాసరచన, పాటలు, చిత్రలేఖనం, పద్యపఠనం, క్విజ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యఅతిథుల చేతులమీదుగా బహుమతులు అందజేయనున్నారు.

అంతర్‌జిల్లా పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు:
-శాస్త్రీయ నృత్యం: పూజిత (జీజీహెచ్‌ఎస్, జోగుళాంబ, గద్వాల); అనూష (యూపీఎస్, కాంతపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి); గంగోత్రి (జెడ్పీహెచ్, కొత్త కదిర, మహబూబ్‌నగర్).
-బృంద నృత్యం: మధుకర్ గ్రూప్ (టీఎస్‌ఎంఎస్, మహబూబ్‌నగర్); శ్రావణి గ్రూప్ (జెడ్పీహెచ్‌ఎస్, దేవరుప్పుల, జనగామ); అనురాధ గ్రూప్ (జీహెచ్‌ఎస్, వరంగల్ అర్బన్, హన్మకొండ);
-వక్తృత్వం (సీనియర్): ఎం స్వరూప (జెడ్పీహెచ్‌ఎస్, పెనుపహాడ్, సూర్యాపేట); బీ రమ్య (కేజీడీవీ, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ); ఎం నిఖిత (జెడ్పీహెచ్‌ఎస్, గుర్గుల్, కామారెడ్డి)
-వక్తృత్వం (జూనియర్): దీక్షిత (విజ్ఞాన్ స్కూల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల); నందిని (జెడ్పీహెచ్‌ఎస్, బిక్కనూర్, కామారెడ్డి); ఎ ప్రణతి (స్లేట్ స్కూల్, జన్నారం, మంచిర్యాల)
-వచన కవిత/గేయం (సీనియర్): టీ అక్షిత (జెడ్పీచ్‌ఎస్, చెల్పూర్, కరీంనగర్); జీ రమేశ్ (జెడ్పీహెచ్‌ఎస్, ఊట్కూర్, మహబూబ్‌నగర్); బీ అనూష (జెడ్పీహెచ్‌ఎస్, ఫోర్ట్ వరంగల్ అర్బన్)
-వచన కవిత/గేయం (జూనియర్): కే వాసవి (స్లేట్ స్కూల్, జన్నారం, మంచిర్యాల); టీ సతీశ్ (యూపీఎస్, తాండూర్, మంచిర్యాల); ఎం పున్నారెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, మధిర, ఖమ్మం)
-వ్యాసరచన: పీ వైష్ణవి (త్రివేణి పాఠశాల, ఖమ్మం); డీ రేణుక ( జెడ్పీహెచ్‌ఎస్, చిన్నకాపర్తి, చిట్యాల, నల్లగొండ); వీ శ్రీయ (కేజీబీవీ, మొగుళ్లపల్లి, జయశంకర్)
-పాటల పోటీ (సీనియర్): జీ దివాకర్ (జెడ్పీహెచ్‌ఎస్, మూసాపేట్, మేడ్చల్); ఇ ఆకాంక్ష (జీహెచ్‌ఎస్, వరంగల్ అర్బన్); ఎ శివసాయి (జెడ్పీహెచ్‌ఎస్, వరంగల్ రూరల్)
-పాటల పోటీలు (జూనియర్): టీ రాహుల్ (కేజీబీవీ, పెనుబల్లి, ఖమ్మం); డీ శాంతిప్రియ (త్రివేణి స్కూల్, ఖమ్మం); జ్యోత్స్న (టీఎస్‌ఎంఎస్, నిజాంసాగర్, ఖమ్మం)
-చిత్రలేఖనం: టీ మల్లీశ్వరి (జెడ్పీహెచ్‌ఎస్, అమరచింత, వనపర్తి); సీహెచ్ పద్మశ్రీ (జెడ్పీఎస్‌ఎస్, సింగరాయపాలెం, ఖమ్మం); సీహెచ్ వెంకటేశ్ (జెడ్పీహెచ్‌ఎస్, హరిపరల, మహబూబాబాద్)
-పద్య పఠనం (సీనియర్): వీ సౌజన్య (జెడ్పీహెచ్‌ఎస్, చెన్నూరు, మంచిర్యాల); ఇ ముక్తశ్రీ (సెవెన్‌హిల్స్ హైస్కూల్, మంచిర్యాల); తేజస్వి (జెడ్పీహెచ్‌ఎస్, గర్గుల, కామారెడ్డి)
-పద్య పఠనం (జూనియర్): సీహెచ్ వేదాంత (జెడ్పీఎస్‌ఎస్, చెన్నూరు, మంచిర్యాల); జీ దేవీప్రసాద్ (సెవెన్‌హిల్స్ హైస్కూల్, మంచిర్యాల); పీ మానస (జెడ్పీహెచ్‌ఎస్, కృష్ణాజివాడి, కామారెడ్డి)

జూనియర్ కళాశాలల పోటీల్లో విజేతలు..
-శాస్త్రీయ నృత్యం: హిమబిందు (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖమ్మం); రిజ్వానా (ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెద్దపల్లి)
-బృంద నృత్యం: రమాదేవి బృందం (కనగల్, నల్లగొండ); బద్రుకా గ్రూప్ (బద్రుకా కళాశాల, హైదరాబాద్)
-వక్తృత్వం: అస్మ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదిలాబాద్); బీ ఎల్లం (బీజీసీ, గజ్వేల్, సిద్దిపేట); ఆర్ మనీశ్ (బీజేసీ, మేడ్చల్)
-క్విజ్: తిరుపతిరావు (ప్రభుత్వ జూనియర్ కళాశాల, బనిగండ్లపాడు, ఖమ్మం)
-వచన కవిత/గేయం: కే కృతి (ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, నిజామాబాద్); డీ నాగమల్లిక (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖమ్మం); ఎస్ శివాని (ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామన్నపేట, నిజామాబాద్)
-వ్యాసరచన: జే ప్రవీణ్ (సీఎస్‌ఎన్‌ఆర్ జూనియర్ కళాశాల, యాదాద్రి); ఎన్ మౌనిక (ప్రభుత్వ జూనియర్ కళాశాల, నిజామాబాద్); జీ స్నేహ (సరోజినీనాయుడు జూనియర్ కళాశాల, హైదరాబాద్)
-పాటల పోటీలు: జీ సరిత (ప్రభుత్వ జూనియర్ కళాశాల, నల్లగొండ); కే పవన్‌కుమార్ (అంబేద్కర్ జూనియర్ కళాశాల, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్); ఎన్ నమ్రతారాణి (ప్రభుత్వ జూనియర్ కళాశాల, సుల్తానాబాద్, పెద్దపల్లి)
-పద్య పఠనం: టీ అంజలి (ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంచిర్యాల); బీ నాగమల్లిక (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖమ్మం); బీ శిల్ప (ప్రభుత్వ జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్)
-చిత్రలేఖనం: ఆర్ పవన్‌కుమార్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోహెడ); ఆర్ రాజు (ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్దిపేట); బీ నవీన్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, మెదక్)

డిగ్రీ కళాశాలల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు
-శాస్త్రీయ నృత్యం: రాజేశ్ (గిరిరాజా డిగ్రీ కళాశాల, నిజామాబాద్); సౌజన్య (అనురాగ్ కళాశాల, కరీంనగర్); అరుణ (ఎస్‌డబ్ల్యూడీసీ, ఆర్మూర్)
-బృంద నృత్యం: మంజుల గ్రూప్ (ఎస్‌డబ్ల్యూడీసీ, ఆర్మూర్); నిగమ గ్రూప్ (నిగమ కళాశాల, కరీంనగర్); సంధ్య గ్రూప్ (వాగేశ్వరి డిగ్రీ కళాశాల, కరీంనగర్)
-వచన కవిత/ గేయం: జీ సునీల్‌కుమార్ (ఐఏఎస్‌సీ, హైదరాబాద్); ఎం మైత్రి (ఏఎంఎస్, హైదరాబాద్); వీ పవన్‌కల్యాణ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్)
-వక్తృత్వం (సీనియర్): జీ అనూష (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్); శ్రీహర్షారెడ్డి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట); సునయన (నిషిత డిగ్రీ కళాశాల, నిజామాబాద్)
-క్విజ్: ఎన్ విజయ (ఎస్ రామాంజనేయులు ఐఏఎస్‌ఈ, హైదరాబాద్); జీ సునీల్‌కుమార్ (ఐఏఎస్‌ఈ, హైదరాబాద్); ఎం రజినీకాంత్ (పవన్‌కల్యాణ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్).
-వ్యాసరచన: డీ హరికృష్ణ (ఎస్‌యూఎంజీడీసీ, నాగర్‌కర్నూల్); వీ ప్రశాంతి (ఐఏఎస్‌సీ, హైదరాబాద్); దేవడ చిట్టిమణి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్).
-పాటల పోటీలు: టీ ఉమామహేశ్వరి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్); కే శకుంతల (ఎస్‌ఆర్‌ఎంకే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడ, కామారెడ్డి); జీ దీపిక (వాగ్దేవి డిగ్రీ కళాశాల, నిజామాబాద్).
-పాటల పోటీ (బృందగానం): ఎం సరస్వతి గ్రూప్ (సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల, ఆర్మూర్); ఆనంద్ గ్రూప్ (నిషిత డిగ్రీ కళాశాల, నిజామాబాద్); ఎస్డీ సహానా (ఎస్‌డబ్ల్యూజీ డిగ్రీ కళాశాల, నిజామాబాద్).
-పద్య పఠనం: టీ ఉమామహేశ్వరి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్); కే రమేశ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తాండూర్, వికారాబాద్); జే దివ్య ( ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, కరీంనగర్).
-చిత్రలేఖనం: ఎం ఉపేందర్ (పీఎస్టీయూ, హైదరాబాద్); ఎం రాజశేఖర్ (ఎస్‌ఆర్‌ఎన్‌కే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి); జీ సువర్ణ (ఎస్‌డబ్ల్యూ డిగ్రీ కళాశాల, నిజామాబాద్).

విశ్వవిద్యాలయాలస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు
-శాస్త్రీయనృత్యం: ఎన్ శరత్ (పీఎస్టీయూ, హైదరాబాద్); బీ గీత ( పీఎస్టీయూ, హైదరాబాద్); పీ స్నేహ (పీఎస్టీయూ, హైదరాబాద్).
-బృంద నృత్యం: డప్పు నృత్యం (పీఎస్టీయూ, హైదరాబాద్); థింసా నృత్యం (పీఎస్టీయూ, హైదరాబాద్); సాయిలు బృందం ( తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్).
-నృత్యం: యూ సాయిలక్ష్మి (పీఎస్టీయూ, హైదరాబాద్); కృష్ణవేణి ( పీఎస్టీయూ, హైదరాబాద్); వినోద్‌కుమార్ (తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్).
-వక్తృత్వం: ఎన్ సైదులు (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); ఎం శ్రీనివాస్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్); కే మహేశ్ (పీఎస్టీయూ, హైదరాబాద్).
-వచన కవిత/ గేయం: బీ ఆంజనేయులు (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్); ఎన్ హరికృష్ణ (బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం); టీ రమేశ్ (పీఎస్టీయూ, హైదరాబాద్).
-క్విజ్: కే భరత్‌కుమార్ గ్రూప్ (ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల); ఎం మహేశ్ గ్రూప్ (నిజాం కళాశాల, హైదరాబాద్); కే స్వామి గ్రూప్ ( పీఎస్టీయూ, హైదరాబాద్).
-వ్యాసరచన: ఎన్ ప్రవీణ్‌రెడ్డి (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్); పీ స్వాతి (బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్); కే స్వామి (పీఎస్టీయూ, హైదరాబాద్).
-పాటల పోటీలు: కే శారద (పీఎస్టీయూ, హైదరాబాద్); పీ రాజు( పీఎస్టీయూ, హైదరాబాద్); నిరంజనాచారి (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్).
-పాటల పోటీలు(బృందం): సాయిలు గ్రూప్ (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); విష్ణు (గ్రూప్, పీఎస్టీయూ, హైదరాబాద్); మల్లేశ్ గ్రూప్ (పీఎస్టీయూ, హైదరాబాద్)
-చిత్ర లేఖనం: వై సామ్రాట్ (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); ఆర్ మాధవి (ఖండవల్లి లక్ష్మీరంజనం కళాశాల, హైదరాబాద్)
-పద్యపఠనం: జే అభిలాశ్ ( పీఎస్టీయూ, హైదరాబాద్); ఎల్ శ్రావ్య (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); ఎం శ్రీనివాస్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం).

3577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles