అతివేగానికి కళ్లెం!


Mon,June 17, 2019 02:26 AM

Laser Speed Guns Installed on Telangana

-హద్దుమీరే వాహనాలపై పోలీసుల దృష్టి
-లేజర్ స్పీడ్‌గన్లతో చోదకులకు చలాన్ల వాత
-కొత్తగా మరో 30 స్పీడ్‌గన్ల కొనుగోలు
-వేగ నియంత్రణే లక్ష్యంగా సిబ్బందికి శిక్షణ
-ఫలితమిస్తున్న చర్యలు.. తగ్గుతున్న ప్రమాదాలు
-2017లో రాష్ట్రంలో 1,36,999 రోడ్డు ప్రమాదాలు
-54 శాతం ప్రమాదాలకు అతివేగమే కారణం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మితిమీరిన వేగంతో దూసుకెళ్లే వాహనాలకు కళ్లెం వేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతున్నది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలమంది ప్రాణాలు కోల్పోతుండటం, మితిమీరిన వేగమే ఇందుకు కారణమని శాస్త్రీయ అధ్యయనంలో తేలడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. ఈ బ్లాక్‌స్పాట్స్‌లో నిఘాను మరింత పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌తోపాటు కొన్ని జిల్లా కేంద్రాల్లో వాడిన లేజర్ స్పీడ్‌గన్స్‌ను అన్ని జిల్లాల్లో వాడేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 28 లేజర్ స్పీడ్‌గన్స్‌కు అదనంగా మరో 30 లేజర్ స్పీడ్‌గన్స్‌ను కొనుగోలు చేసింది. వీటి వాడకంపై అన్ని జిల్లాల, కమిషనరేట్ల సిబ్బందికి డీజీపీ కార్యాలయంలోని లెర్నింగ్ సెంటర్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

తప్పుచేస్తే తక్షణమే చలాన్

తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలతోపాటు వాహనాల వేగం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది లేజర్ స్పీడ్‌గన్స్‌తో మాటువేసి ఉంటారు. స్పీడ్‌గన్‌తో టార్గెట్ చేసిన ఏ వాహనాన్నయినా ఫొటో తీయవచ్చు. డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా పనిచేసే స్పీడ్‌గన్ ఆ వాహన వేగాన్ని లెక్కిస్తుంది. వేగం పరిమితికి మించితే వెంటనే ఆ వాహనదారుడికి చలాన్ వెళుతుంది. అయితే గతంలో ఈ ఫొటోలను సర్వర్‌కి పంపి నిబంధనలను అతిక్రమించినట్టు గుర్తించిన తర్వాత చలాన్లు పంపేవారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 30 లేజర్ స్పీడ్‌గన్స్‌తో వేగంగా వెళ్లే వాహనాన్ని ఫొటో తీయగానే ఆ ఫొటోతోపాటు వాహన నంబర్‌ప్లేట్ వివరాలు ఆటోమ్యాటిక్‌గా సర్వర్‌కి వెళ్తాయి. దీంతో వెంటనే చలాన్ జనరేట్ అవుతుంది. వాహనదారుడు 200 మీటర్ల దూరం వెళ్లేలోపే అతడి ఫోన్‌కు మెసేజ్ రూపంలో చలాన్ వెళ్తుంది. ఒక రోజులో ఎన్నిసార్లు మితిమీరిన వేగంతో స్పీడ్‌గన్‌కు దొరికితే అన్నిసార్లు చలాన్లు వస్తూనే ఉంటాయి. దీనివల్ల వాహనదారుల్లో బాధ్యత పెరుగుతుందని, నిబంధనలను పాటించేలా చూడటం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషరేట్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డులో లేజర్ స్పీడ్‌గన్స్‌ను వినియోగించి 20 16లో 13,008 కేసులు, 2017లో 3,35,331 కేసులు, 2018లో 5,07,605 కేసులు, 2019 ఫిబ్రవరి వరకు 99,892 కేసులు నమోదు చేసినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు.

అతివేగం వల్లనే 54 శాతం ప్రమాదాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2017లో రాష్ట్రంలో మొత్తం 1,36,999 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. వీటిలో 54 శాతం (73,896 ప్రమాదాలు) అతివేగం వల్ల జరిగినవే. ప్రమాద మృతుల్లో 18 నుంచి 35 ఏండ్ల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాతీయ రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుల్లో గరిష్ఠ వేగం గంటకు 100 కి.మీ. మించరాదు. ఇది వాహనాలను బట్టి మారుతుంది. అలాగే ఇతర రహదారుల్లో గరిష్ఠ వేగం గంటకు 60 కి.మీ. మించకూడదన్న నిబంధన ఉన్నది. ఈ నిబంధనలను వాహనదారులు అతిక్రమిస్తుండటంతో వేగాన్ని కట్టడిచేసేందుకు లేజర్ స్పీడ్‌గన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు సిబ్బందిని బ్లాక్‌స్పాట్స్‌లో ఉంచి మితిమీరిన వేగంతో వెళ్లే వాహనచోదకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Laser-speed-gun1

3330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles