రెవెన్యూ అండతో 20 ఎకరాలు కబ్జా?


Thu,May 16, 2019 02:35 AM

Land is removed from records

-30 ఏండ్లుగా తిరుగుతున్నా పట్టించుకొనే వారే కరువు
-న్యాయం చేయాలని ధర్మగంటను ఆశ్రయించిన బాధితులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తాతల నుంచి సంక్రమించిన ఆస్తి వారసులకు వెళ్తుంది. అయితే ఎవరూ అమ్మకుండానే మరొకరి పేరు మీదకు ఎలా మళ్లుతుంది?. సరిగ్గా ఇదే ప్రశ్నను నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన రైతు జొన్నలగడ్డ వెంకయ్య (50) రెవెన్యూ అధికారులను 30 ఏండ్లుగా ప్రశ్నిస్తున్నాడు. కానీ సమాధానం చెప్పేవారే లేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. జొన్నలగడ్డ వెంకయ్య తాత జొన్నలగడ్డ సోములు పేరు మీద 204 సర్వేనంబర్‌లో 21 ఎకరాల రెండు గుంటల భూమి ఉన్నది. 1954 నుంచి 1974 వరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నది. అనంతరం ఆయన వారసుల ఆధీనంలో కొనసాగగా.. 1973 నుంచి రికార్డుల్లో పేర్లు మారిపోయాయి. వారసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొన్న ఓ కబ్జాదారు వీరి భూమిని తన పేరిట మార్చుకొనే ప్రయత్నానికి అప్పటి రెవెన్యూ అధికారులు మద్దతు తెలిపారు.

దాంతో దిక్కుతోచని వెంకయ్య, ఆయన వారసులు నాటి నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భూమి తన తాతలు, తర్వాత తన తండ్రి పేరిట ఉన్నదని చూపేందుకు ఆధారాలను సేకరించారు. నల్లగొండ కలెక్టర్, ఆర్డీ వో, తాసిల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. భూముల ప్రక్షాళన జరుగుతున్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరి ఆవేదనను వీఆర్వో అర్థం చేసుకోని న్యాయం చేయాల్సిందిపోయి.. ఆ భూమికి మీకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. వారసత్వంగా సంక్రమించిన భూమిని తమ పేరిట రికార్డుల్లోకెక్కించి పట్టాదారు పాస్‌బుక్కు ఇవ్వాలని వారు అధికారులను వేడుకొంటున్నారు. ఇదే విషయమై త్రిపురారం తాసిల్దార్ కృష్ణను సంప్రదించగా.. తాను ఇటీవలే బదిలీపై ఇక్కడికి వచ్చానని తెలిపారు. రికార్డులు పరిశీలించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

తాతల కాలం నుంచి వచ్చిన భూమిని దక్కకుండా కబ్జాదారులకు అధికారులు అండగా నిలుస్తున్నారు. మా పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ భూమిని రికార్డుల్లో నుంచి తొలగించారు. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. 204 సర్వేనంబర్‌లోని 21 ఎకరాల 2 గుంటల భూమిని మా పేరుతో పాస్‌బుక్కు ఇప్పించాలి.
- జొన్నలగడ్డ వెంకయ్య, బెజ్జికల్ రైతు, త్రిపురారం మండలం

313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles