దంచికొడుతున్న ఎండలు


Thu,May 16, 2019 02:49 AM

Kumarambheem Asifabad district records 45 degrees

-మరో మూడ్రోజులు వడగాడ్పులు
-హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
-కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 45 డిగ్రీలు
-గ్రేటర్ హైదరాబాద్‌లో 43.2 డిగ్రీలు నమోదు
-వడదెబ్బతో ఆరుగురు మృతి
-పలు జిల్లాల్లో వర్షాలు
-పిడుగుపాట్లకు నలుగురు బలి

హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. వాయువ్య భారతంలోని రాజస్థాన్ నుంచి విదర్బ మీదుగా తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తుండటంతో విదర్బను ఆనుకుని ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణలో వడగాడ్పులు వీస్తున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కుమ్రంభీం, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మరో మూడ్రోజులపాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, పెద్దపల్లిలో 44.3 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో పనిచేస్తున్న రష్యా దేశానికి చెందిన పర్యాటకుడు అలెగ్జాండర్(38)తోపాటు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వడదెబ్బతో ఆరుగురు మృతిచెందారు.

sunny2

గ్రేటర్ హైదరాబాద్‌కు నేడు వర్షసూచన

గ్రేటర్ హైదరాబాద్ బుధవారం మరోసారి వేడెక్కింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో అప్పుడప్పుడు మబ్బులు కమ్ముకున్నా ఎండతీవ్రత కనిపించింది. బుధవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణికి అధిక ఉష్ణోగ్రత వల్ల ఏర్పడే క్యుములోనింబస్ మేఘాలు తోడవడంతో రాగల 24 గంటల్లో గ్రేటర్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు.

tree

పలు జిల్లాల్లో ఈదురుగాలుల వర్షం

జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాల్లో బుధవారం వర్షం కురిసింది. వేర్వేరుచోట్ల పిడుగుపాట్లకు నలుగురు మృత్యువాతపడ్డారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని సిలార్మియాగూడెంలో జక్కలి మాధవి (16), డిండి మండలంలోని బ్రాహ్మణపల్లిలో ముడావత్ గణేశ్ (14), చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన దూదిమెట్ల విజయ(40), నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి శివారులోని రైతు బన్నే ఈదన్న(35) పిడుగులుపడి మృతిచెందారు. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, నార్కట్‌పల్లి, డిండి, చండూరు, కనగల్, తిరుమలగిరిసాగర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

hailstorm
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం, తరిగొప్పుల, కొడకండ్ల, చిలుపూరు మండలాల్లోని పలుచోట్ల వడగండ్ల వాన పడగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అకాల వర్షం కురిసింది. మామిడి కాయలు నేలరాలాయి. రాజాపేట, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం) మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ, వెల్దండ, బల్మూరు, లింగాల, కల్వకుర్తి మండలాల్లో వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, మోతె, చివ్వెంల, నాగారం మండలాల్లో గాలివానకు నష్టం వాటిల్లింది.
sunny3

1768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles