భూ వివాదాలను కొలిక్కి తెస్తాం


Tue,June 19, 2018 02:29 AM

KTR vows to resolve land disputes

-ఎల్బీనగర్ రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
-అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ
-ఫతుల్లగూడ సర్వే నంబర్-58 నివాసితులకు 15 రోజుల్లోగా పట్టాలు
-అసైన్డ్ స్థలాల సమస్యలకు 15 రోజుల్లో పరిష్కారం

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని భూ వివాదాలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా ఒక కొలిక్కి తెస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. చట్టాలను సవరించాల్సిన భూ వివాదాలకు సంబంధించి తీర్మానాలు రూపొందించి, వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చట్ట సవరణ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇటీవల ఎల్బీనగర్‌లో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ సోమవారం జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌జోన్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రెసిడెన్షియల్ కాలనీల ప్రముఖులతో సమావేశమయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన సమావేశంలో ప్రతి కాలనీ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు భూ వివాదాలను పరిష్కరించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ పరంగా చిన్నచిన్న చిక్కులు ఉన్న స్థలాలకు 15 రోజుల్లో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

యూఎల్‌సీ స్థలాలపై అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో చర్చించి సమస్యలను కొలిక్కి తెస్తామని హమీఇచ్చారు. అసైన్డ్, వక్ఫ్‌బోర్డు, ఎండోమెంట్స్, ఎఫ్‌టీఎల్‌లకు సంబంధించిన వివాదాలు అధికంగా ఉన్నాయని, పాలనా సంబంధ అంశాలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నందున ఎఫ్‌టీఎల్, కన్జర్వేషన్ జోన్‌ల జోలికి వెళ్లబోమని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సవరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఆర్ కృష్ణయ్య, మేయర్ బొంతు రామ్మోహన్, సీసీఎల్‌ఏ కమిషనర్ రాజేశ్వర్‌తివారీ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ktr-land2

సమావేశంలో మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు

-నాగోల్ సాయినగర్‌లోని సర్వేనంబర్-101, 102ల్లోని 1,952 నివాసాల వివరాలను భూ రికార్డుల్లో తప్పుగా పేర్కొన్నందున సమస్యలు వచ్చాయని, వీటిని 15 రోజుల్లోగా సవరించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీరెడ్డిని ఆదేశించారు.
-నాగోల్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీ సర్వే నంబర్-104లోని అసైన్ట్ స్థలాల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.
-ఫతుల్లగూడ సర్వే నంబర్-58లోని నివాసితులకు 15 రోజుల్లో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ చేతుల మీదుగా పట్టాల పంపిణీ.
-కర్మన్‌ఘాట్‌లోని సర్వేనంబర్-243లోని గ్రీన్‌పార్కుకాలనీకి చెందిన 3,200 గజాల ప్రభుత్వ స్థలంలో స్పోర్ట్స్‌కాంపెక్స్ నిర్మించాలని కార్పొరేటర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ భూమి విషయంలో ఏ వివాదం లేకుంటే వెంటనే స్పోర్ట్స్‌కాంపెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఈస్ట్‌జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
-రెవెన్యూ డివిజన్ స్థాయిలో రికార్డులను సవరించకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 15 రోజుల్లో రికార్డులు సవరించాలని ఆర్డీవోకు
ఆదేశం.
-సాహెబ్‌నగర్ సర్వే నంబర్-71కి సంబంధించిన వక్ఫ్‌బోర్డు వివాదాలపై త్వరలో డిప్యూటీసీఎం మహమూద్ ఆలీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారు.
-హస్తినాపురం జనార్దన్‌రెడ్డినగర్ కాలనీలో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల్లో గతంలో విక్రయించగా.. పదేండ్లకు పైగా ఉన్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ఎన్‌వోసీలు జారీచేయడానికి చర్యలు తీసుకోనున్నారు.
-మన్సూరాబాద్‌లోని సర్వేనంబర్-44,45ల్లోని సీలింగ్ భూముల్లో ఉన్న నిర్మాణాలకు 2007లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆయా కాలనీవాసులు విజ్ఞప్తి చేయగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి హమీ ఇచ్చారు.
-ప్రెస్‌కాలనీ, వాంబేకాలనీల్లో జీవో నంబర్-58,59 కింద గతంలో దరఖాస్తు చేసుకోనివారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
-స్పష్టమైన టైటిల్‌లో ప్రభుత్వ భూములు ఉంటే డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలని ఆదేశించారు.

1171

More News

VIRAL NEWS

Featured Articles