అంటువ్యాధుల నివారణకు చర్యలు

Tue,September 10, 2019 03:17 AM

- అవసరమున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
- బస్తీ దవాఖానలను 300కు పెంచుతాం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో అంటువ్యాధుల నివారణకు విస్తృత చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేయనున్నట్టు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభించామని, బస్తీ దవాఖానల సంఖ్యను 106 నుంచి 300 కు పెంచాలని నిర్ణయించామన్నారు. పరిశుభ్ర త, అంటువ్యాధులు, రోడ్లు తదితరాలపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. నగరంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు క్యాలెండర్‌ రూపొందించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించినట్టు చెప్పారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అన్నివిద్యాసంస్థల్లో అవగాహనా కార్యక్రమా లు నిర్వహిస్తామని చెప్పారు. కొత్తగా 15 మంది ఎంటమాలజిస్టులను నియమించాలని నిర్ణయించామన్నారు.

నాలాల్లో చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని, అవసరమైతే జరిమానా విధించడమే కాకుండా వాహనాలను సీజ్‌చేస్తామని హెచ్చరించారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను వార్షిక నిర్వహణ కింద అప్పగించాలని భావిస్తున్నామని, దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రోడ్లు, పారిశుద్ధ్యంలో గుణాత్మక, నిర్మాణాత్మక మార్పు కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పురపాలనలో సంస్కరణలు

పట్టణ ప్రజలకు మెరుగైన సేవల్ని అందించేందుకు పురపాలకశాఖలో సంస్కరణలను తీసుకొనిరావాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రిగా రెండోసారి ప్రమాణంచేసిన అనంతరం సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ కార్యాలయంలో సంబంధిత విభాగాధిపతులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలపై విభాగాధిపతులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles