మున్సిపోల్స్‌లో విజయం మనదే


Sun,July 21, 2019 02:55 AM

KTR Says TRS will sweep municipal polls

-అద్భుతంగా కొత్త మున్సిపల్ చట్టం
-75 గజాల ఇంటి నిర్మాణానికి అనుమతి అక్కర్లేదు
-ప్రజాప్రతినిధులను తొలగించాల్సివస్తే అది టీఆర్‌ఎస్ నుంచే మొదలు
-చట్టంపై అవగాహన పెంచుకుని రాజకీయాల్లోకి రావాలి
-సిరిసిల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అన్నివర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి ఉన్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదేనని కార్యకర్తలకు తెలిపారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాలులో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యనాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల పట్టణంలో బారానా వంతు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన చారాణా వంతు పనులు కూడా పూర్తిచేస్తామని ఉద్ఘాటించారు.

పార్టీ సభ్యత్వాలు పూర్తిచేసి, పదిమందితో బూత్ కమిటీలు వేయాలని సూచించారు. సుశిక్షితులైన గులాబీ సైనికులను తయారుచేయాలని పట్టణ కమిటీని కోరారు. పట్టణంలోని 39 వార్డులకు 39 బృందాలు ఏర్పాటుచేసి ఒక ఇంచార్జిని నియమించాలని సూచించారు. ప్రతి వార్డుకు మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టిక్కెట్ రాలేదని అది చేస్తాం, ఇది చేస్తామంటూ చేసే బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. నాలుగున్నరేండ్లు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ప్రభుత్వమే ఉంటుందని, అప్పటిదాకా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉన్నదని తెలిపారు. డబ్బులతో గెలుస్తామనుకుంటే పొరపాటని, ప్రజల వద్దకు వెళ్లి చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో మంచి చెడు బాధ్యత అంతా తనదేనన్నారు.

పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వాళ్లకే టిక్కెట్లు దక్కుతాయన్నారు. టిక్కెట్ రాలేదని బాధ పడవద్దని, ఇంకా అనేక నామినేట్ పోస్టులు ఉన్నాయని గుర్తుచేశారు. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరుకక టిక్కెట్ రాని వాళ్లను గుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ అన్నారు. సర్వేలు నిర్వహించి సమర్థులైన అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామని స్పష్టంచేశారు. టిక్కెట్ వచ్చిన అభ్యర్థులు రాని వాళ్ల వద్దకు వెళ్లి నచ్చజెప్పి తమ గెలుపునకు సహకరించేలా చూసుకోవాలని సూచించారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, తోట ఆగయ్య, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిందం చక్రపాణి, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles