ఎండల్లో ఏరువాక


Wed,May 16, 2018 10:58 AM

KTR  Rythu Bandhu Checks Distribution in Boinpalli

-చెక్కులు, బుక్కులతో రాష్ట్రమంతా రైతుబంధు కోలాహలం
-ప్రక్షాళనతో చిక్కులు వీడాయి.. నేడు చెక్కులు వచ్చాయి
-సంతోషంతో చెప్పుకొంటున్న మహిళారైతులు
-జారీచేసిన చెక్కుల వివరాలు ఏరోజుకారోజు
-రైతుబంధు పోర్టల్‌లో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం
-6వ రోజు 1,179 గ్రామాల్లో
-4,77,179 చెక్కుల పంపిణీ
-ఆరు రోజుల్లో మొత్తం 34,53,746 చెక్కులు

KTR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కూలిపనులకు వెళ్లే మాకు.. ప్రభుత్వమే మూడెకరాల భూ మి ఇచ్చి, రైతులను చేసింది. ఇప్పుడు ఆ భూమికి పంట పెట్టుబడి సాయం అందించింది. సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది ఇది.. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన మహిళారైతు ధర్మారపు శిరీష ఆనందం! ఎప్పటినుంచో రిజిస్ట్రేషన్ కాని మా భూమి రికార్డుల ప్రక్షాళన సందర్భంగా చిక్కులు వీడి మా సొంతమైంది. ఇప్పుడు ఆ మూడెకరాల భూమికి సర్కారు నుంచి సాయం అందింది. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఇది.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మహిళారైతు చిలివేరి రాజమల్లు సంతోషం!! ఇలాంటివే అనేక కృతజ్ఞతలు.. మొక్కులు.. సీఎం చల్లగా ఉండాలంటూ ఆశీర్వచనాలు!! రాష్ట్రవ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్న రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ చూసినా ఇవే తరహా సంతోషాలు వ్యక్తమవుతున్నాయి! ఏరువాక నాటి సంబురం.. ఇప్పుడు ఎండల్లోనే కనిపిస్తున్నది! పొలం పనులకు వెళ్లేటప్పుడు ఉండే ఉత్సాహం.. ఇప్పడే వెల్లివిరుస్తున్నది! ఈ రోజు తెలంగాణలో ప్రతి పల్లె చిరునవ్వులు చిందిస్తున్నది! రాబోయే పంటకాలానికి అప్పుడే చేతికందిన పంట పెట్టుబడి సొమ్మును చూసి.. భరోసా నింపుకొంటున్నది! సర్కారు సాయాన్ని తల్చుకుని.. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నది! సాగుకు స్వర్ణయుగం తేవాలన్న సదుద్దేశంతో అమలుచేస్తున్న ఈ పథకానికి రైతుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజైన మంగళవారం 1179 గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి 4,77,178 లక్షల చెక్కులతోపాటు పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీచేశారు. చెక్కులు పొందిన రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల్లో నగదుగా మార్చుకున్నారు. మొత్తంగా ఈ ఆరు రోజుల్లో 8235 గ్రామాల్లో 34,53,746 చెక్కుల పంపిణీ పూర్తయింది. ఆయా జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కే తారకరామారావు, తన్నీరు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, బండా ప్రకాశ్ తదితరులు పాల్గొని రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో మరుసటి రోజైన సోమవారం బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుందని గుర్తించిన అధికారులు.. చెక్కుల మార్పిడికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఊహించినట్టే పెద్ద సంఖ్యలో రైతులు బ్యాంకులకు వచ్చిన నేపథ్యంలో ఎంత డబ్బులు డ్రా చేశారనే విషయంపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.

చెక్కుల పంపిణీ వివరాలు పోర్టల్‌లో

రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ వివరాలను రైతుబంధు పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్కుల పంపిణీ సరళిపై మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రోజువారి చెక్కుల పంపిణీ, రైతు గ్రామసభలపై సమీక్షించారు. అందజేసిన చెక్కుల కాలపరిమితి మూడు నెలలు ఉంటుందని, బ్యాంకులలో నగదు నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా చెక్కులను నగదుగా మార్చుకోవచ్చన్నారు. అభ్యంతరాలుంటే గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో సమాచారం అందించి సమస్య పరిష్కరించుకోవాలని విజ్ఞప్తిచేశారు. చెక్కుల పంపిణీ తర్వాత ప్రతి గ్రామంలో ఎన్ని చెక్కులు పంపిణీ చేశారో రైతుబంధు పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయాలని అధికారులకు పార్థసారథి సూచించారు.
KTR1

2839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS