పింఛన్ల పండుగ


Sun,July 21, 2019 03:13 AM

KTR Participates In Increased Aasara Pensions Distribution

-రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
-ఒకేరోజు లబ్ధిదారులందరికీ పెన్షన్ పెంపు ఉత్తర్వుల కాపీలు
-వేడుకల్లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు
-రేపట్నుంచి నేరుగా ఖాతాల్లోకి పింఛన్ డబ్బు
-38,99,044 మందికి రెట్టింపైన పింఛన్
-దివ్యాంగులకు రూ.3016..మిగిలిన లబ్ధిదారులకు రూ.2016
-ప్రతినెలా పింఛన్ చెల్లింపుల మొత్తం రూ.863,24,07,084
-బ్యాంకుల నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.371.27 కోట్లు
-మిగతా మొత్తం పోస్టాఫీసుల నుంచి, నేరుగా నగదు చెల్లింపు
-పింఛన్లు పెంచిన ఘనత తెలంగాణదే
-రూ.12 వేల కోట్లలో కేంద్రం ఇస్తున్నది రూ.200 కోట్లే
-17 శాతం వృద్ధిరేటుతో ముందంజలో రాష్ట్రం
-అద్భుతంగా కొత్త మున్సిపల్ చట్టం
-పొదుపు సంఘాలకు రూ.65 కోట్ల వడ్డీలేని రుణం
-బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేస్తాం
-సిరిసిల్లలో పింఛన్ ప్రొసీడింగ్‌ల పంపిణీ కార్యక్రమంలో
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలో అందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్న మాటను నిలబెట్టుకున్నారు. అసహాయులందరికీ కన్నబిడ్డగా మారి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నికల సందర్భంలో ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీని తు.చ తప్పకుండా అమలుచేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆసరా పెంపుదల ఉత్తర్వులను లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందించారు. పింఛన్ పెంపుదల ప్రొసీడింగ్‌లను అందుకొన్న లబ్ధిదారుల కండ్లల్లో ఆనందబాష్పాలు రాలాయి. ఏ వేదిక దగ్గర చూసినా అమాయకపు పెద్దల ముఖాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అపారమైన ప్రేమ భావం తొణికిసలాడింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్‌లను అందించారు.
KTR1
సిరిసిల్లలో స్థానిక శాసనసభ్యుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పింఛన్‌దారులకు పెంపుదల ఉత్తర్వులను పంపిణీచేశారు. రాజధాని హైదరాబాద్ సహా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు.. పండుగ వాతావరణంలో ఉత్తర్వుల కాపీలను అందజేశారు. కామారెడ్డిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్‌లో మంత్రి ఈటల రాజేందర్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, మేడ్చల్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్‌లో మంత్రి తలసాని, హోం మంత్రి మహమూద్ అలీ, గద్వాలలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి, నిర్మల్‌లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్ పింఛన్ పెంపుదల ఉత్తర్వుల పత్రాలను లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38,99,044 మందికి పెరిగిన పెన్షన్లు సోమవారం అందనున్నాయి.

ఆభాగ్యులకు ఆసరాగా..

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. దివ్యాంగులకు రూ.1500 అందజేశారు. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛన్లను రెండింతలు చేయడమే కాకుండా అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 8 లక్షల వరకు పెరిగింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 38,99,044 కు చేరింది. వీరిలో 4,89,250 మంది దివ్యాంగులున్నారు.

బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు

ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్లో రూ.12,067 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత లెక్కల ప్రకా రం ప్రతి నెలా రూ.863.24 కోట్లు పంపిణీ చేస్తారు. కొత్తగా వచ్చేవారి సంఖ్య ఇందుకు అదనంగా ఉంటుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2016కు.. దివ్యాంగుల పింఛన్ రూ.1500 నుంచి రూ.3016 పెంచారు. రాష్ట్రంలో 1,31,736 లక్షల మంది ఒంటరి మహిళలకు నెలనెలా పింఛన్లు ఇస్తున్నారు. 14,131 మంది బోదకాలు బాధితులకు పింఛన్లలో అవకాశం కల్పించారు.
KTR2

రేపట్నుంచి ఖాతాల్లో..

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్టు పెరిగిన పింఛన్లను జూన్ నుంచి అమలుచేస్తున్నా రు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా చెల్లించే రూ.371.27 కోట్లను బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు. పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ ద్వా రా చెల్లించేందుకు నగదును బదిలీచేశారు. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక కారణాలతో నేరుగా పంపిణీ చేస్తున్నారు. పెరిగిన సొమ్ము లబ్ధిదారులకు సోమవారం అందుతుంది.

పింఛన్లు పెంచిన ఘనత తెలంగాణదే

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 38 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత తెలంగాణదే. రూ.12 వేల కోట్లలో కేవలం రూ.200 కోట్లిచ్చి కేంద్ర ప్రభుత్వం గోరంతల్ని కొండంతలు చెప్పుకొంటున్నది అని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల్లో రూ.2016 వరకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదనే విషయాన్ని కేంద్రాన్ని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో రాష్ట్రం 17 శాతం వృద్ధిరేటుతో ముందంజలో ఉన్నదని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టం అద్భుతమని అంతా ప్రశంసిస్తున్నారన్నారు. పేదలు 75 గజాలలో ఇల్లు కట్టుకుంటే వారు పర్మిషన్ తీసుకోనక్కరలేదని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పద్మనాయక కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన పింఛన్ల పెంపుదల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసరా పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ. 2016లకు పెంచుతామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని చెప్పారు. బీడీలు చుట్టే మహిళా కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, పీఎఫ్ కార్మికులకు కటాఫ్ డేట్ 2014 ఉంటే 2019కి పెంచారని, పింఛన్ వయోపరిమితిని సైతం 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారన్నారు.
KTR3

పేదలందరికీ డబుల్ ఇండ్లు

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూంలను త్వరలోనే మంచిరోజు చూసి పంపిణీచేస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇండ్ల మంజూరులో పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లక్కీ డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, రూపాయి లంచం లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చే జిమ్మేదారు తనదేనని భరోసా ఇచ్చారు. ఇప్పటికే తంగళ్లపల్లి మండలంలో 1300, సిరిసిల్ల పట్టణంలో 200 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. సంక్షేమంలో సింహభాగం పేద విద్యార్థులకే ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదని, రాష్ట్రంలో 700 గురుకులాలు ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. సిరిసిల్లలో ఏర్పాటుచేస్తున్న అపారెల్ పార్కు ద్వారా పదివేల మంది బీడీ కార్మిక మహిళలకు ఉపాధి కల్పించి, నెలకు రూ.పదివేల వేతనం వచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. స్వయం సహాయకసంఘాలకు రావాల్సిన పావలా వడ్డీ రుణాలు.. రూ.65 కోట్లు రెండు రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు.

మీ ఆశీస్సుల వల్లే ఇంతవాడినయ్యా..

సిరిసిల్ల ప్రజల ఆశీస్సుల వల్లే తాను ఇంతవాడినయ్యానని, దేశంలో, రాష్టంలో మంచి గుర్తింపు వచ్చిందంటే అది సిరిసిల్ల ప్రజల వల్లేనని కేటీఆర్ ఉద్విగ్నానికి లోనయ్యారు. తనకు గుర్తింపునిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్రం అసూయపడేలా సిరిసిల్లను అభివృద్ధిచేశానని, వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చి ఇది మా ఊరేనా అని సంబురపడేలా అన్ని రంగాల్లో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను గట్టెక్కించి ప్రతి కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం వచ్చేలా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చామన్నారు. కార్యక్రమం లో కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు సామల పావని, రైతు సమన్వయసమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
KTR4

2131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles