అజ్ఞాతసూర్యులకు ప్రేరణ మల్లేశం


Sun,June 16, 2019 02:54 AM

KTR Mind blowing Speech at Mallesham Movie Premiere Show Event

-ప్రతి తల్లికి స్ఫూర్తినిస్తుంది
-సినిమాకు ప్రభుత్వపరంగా సహాయం చేస్తాం
-మల్లేశం ప్రత్యేక షో వీక్షించిన అనంతరం కేటీఆర్ ప్రశంసలు

సినిమా డెస్క్, నమస్తే తెలంగాణ: ఆసు యంత్రానికి రూపకల్పన చేసి.. చేనేతరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా రూపొందించిన మల్లేశం చిత్రానికి ప్రభుత్వం తరపున సహకారం అందించడానికి కృషిచేస్తానని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రితో చర్చించి.. పన్ను మినహాయింపు లభించేలా చూస్తానన్నారు. ఈ నెల 21వ తేదీన విడుదలచేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో కేటీఆర్ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మానవీయ స్పృహతో సమస్త ఉద్వేగాలను హృద్యంగా ఒడిసిపట్టి మల్లేశం చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని చిత్రబృందాన్ని అభినందించారు. ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో.. అనే కవితాపంక్తులు ఈ సినిమాలోని భావోద్వేగాలను, ఉద్వేగభరితఘట్టాలను, ఓ సామాన్యుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించాయని కొనియాడారు. చేనేతరంగం దేశవ్యాప్తంగా మరుగునపడిపోతున్న తరుణంలో చేనేత కళాకారుల నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్టనష్టాలను ఈ సినిమాలో చూపించడం అభినందనీయమన్నారు.

ప్రతి తల్లికి స్ఫూర్తినిచ్చే చిత్రం

నవీన ఆవిష్కరణ చేయాలంటే ఓ వ్యక్తికి ఎదురైన అవరోధాలు, వాటిని అధిగమించి ఎలా విజయం సాధించాడనే అంశాన్ని మల్లేశం సినిమాలో సందేశాత్మకంగా దృశ్యమానం చేశారని కేటీఆర్ ప్రశంసించారు. ఈ సినిమాలో నెస్సెస్సిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ (అవసరమే ఆవిష్కరణకు ఆద్యం) అనే సామెతను తిరగరాసి.. మదర్ ఈజ్ ది నెస్సెస్సిటీ ఆఫ్ ఇన్వెన్షన్ అని చూపించారని కొనియాడారు. ఎలాంటి భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లేకపోయినా.. తల్లి కష్టాలను చూసి చలించిన మల్లేశం ఎంతో శోధనతో, పట్టుదలతో ఆసు యంత్రాన్ని కనిపెట్టాడన్నారు. ఇది ప్రతి తల్లికి స్ఫూర్తినిచ్చే చిత్రమని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువ ఆవిష్కర్తలకు, అజ్ఞాతసూర్యులకు ప్రేరణనిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదనే అంశాన్ని బలంగా చెప్పారని అభినందించారు. ఎంతో ప్రతిభావంతుడైన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్.. తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు.

చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించాలి

దేశంలో ఎక్కడా లేని విధంగా గత ఐదేండ్లలో చేనేత కళాకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. చింతకింది మల్లేశం కొత్త యూనిట్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే రూ.కోటి ఆర్థిక సహాయం అందజేసిందని గుర్తుచేశారు. చేనేత, జౌళిశాఖకు కేవలం రూ.70 కోట్లు ఉన్న బడ్జెట్‌ను రూ.1270 కోట్లకు పెంచామని.. సీఎం కేసీఆర్ కృషివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. చేనేత ప్రచారాన్ని చాలామంది ఓ చారిటీ కార్యక్రమంలా చూస్తున్నారని.. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరించాలన్న కార్యక్రమం కొంత సఫలమైందని.. చేనేత కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రముఖ దర్శక నిర్మాత బీ నర్సింగరావు మాట్లాడుతూ.. సహజత్వానికి పెద్దపీట వేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డీ సురేశ్‌బాబు, చిత్ర దర్శకుడు రాజ్ ఆర్, కథానాయకుడు ప్రియదర్శి, కథానాయిక అనన్య, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ లక్ష్మణ్ ఏలెతోపాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles