ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ ఓ విప్లవం


Tue,March 13, 2018 03:12 AM

KTR lays foundation stone for HFCCL

-ఏడాది చివరికల్లా కోటి కుటుంబాలకు ఇంటర్నెట్ సేవలు
-హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
-సీఎస్‌ఆర్ కింద ఐదు మొబైల్ మెడికేర్ క్లినిక్‌లను అందించిన సంస్థ

KTR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ పథకం విప్లవాత్మకమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాలన ఇంటింటికీ చేరాలని.. అందుకు సాంకేతిక సాధనంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రం ప్రవేశపెట్టని విధంగా ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ పథకాన్ని తాము చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నామని వివరించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ రెవెన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాల్లో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎఫ్‌సీఎల్) గ్రూపునకు చెందిన ఆప్టికల్ ఫైబర్ ప్లాంటుకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, స్థానిక సర్పంచ్ జెల్లల లక్ష్మయ్యతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ పథకం ద్వారా గ్రామం వరకు ఇంటర్నెట్‌ను ఇచ్చేందుకు సిద్ధమవగా తాము ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఇచ్చేందుకు టీ ఫైబర్ ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ వివరించారు. హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థ మొదటిదశలో ఫైబర్, తదుపరి దశలో కేబుల్, మూడోదశలో ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ల ముడిసరుకును తయారు చేయనుండటం సంతోషకరమన్నారు. దీనిద్వారా మొదటివిడుతలో వెయ్యి మందికి, రెండో విడుతలో 4 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇక్కడి యువతీ యువకులకు ఉద్యోగాలు లభించాలని కోరుతున్నారని, ఈ విషయంలో జయేశ్‌రంజన్ ప్రత్యేకంగా చొరువ తీసుకొని టాస్క్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. దేశంలో ఆప్టిక్ ఫైబర్ తయారీ సంస్థలు కేవలం నాలుగు మాత్రమే ఉండగా అందులో కీలక సంస్థ తెలంగాణలో తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు.

డిఫెన్స్ రంగంలోకి కూడా విస్తరించాలని హెచ్‌ఎఫ్‌సీఎల్ ఆకాంక్షించడం ఆనందకరమని.. ఈ విషయంలో రాష్ర్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇటీవలే కేంద్ర రక్షణశాఖ మంత్రి హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక టాటా బోయింగ్ కేంద్రా న్ని ప్రారంభించారని గుర్తుచేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రూపొందించిన విధానాలు, మంత్రి కేటీఆర్ చొరువ వల్ల రాష్ట్రంలోకి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే పలు కంపెనీల ద్వారా స్థానికంగా వేలమందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. హెచ్‌ఎఫ్‌సీఎల్ చైర్మన్ మహేంద్రప్రతాప్ శుక్లా మాట్లాడుతూ ఈ కేంద్రంలో ఏటా 6.4 మిలియన్ కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.260 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ ఫైబర్‌ను టెలీకమ్యూనికేషన్ (4జీ, 5జీ), బ్రాడ్‌బ్యాండ్.. ఎఫ్‌టీటీఎక్స్‌ను దేశంతోపాటు విదేశాల్లో నెట్‌వర్క్ ఏర్పరిచేందుకు వినియోగిస్తున్నారని తెలిపారు. తదుపరి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సంస్థ ఎండీ మహేంద్ర నహతా, ఐటీశాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు. హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా అందించిన 5 మొబైల్ మెడికేర్ క్లినిక్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ మొబైల్ వ్యాన్లు పూర్తిస్థాయి సిబ్బందితో రంగారెడ్డి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తాయి.

కేటీఆర్‌తో 15 నిమిషాల సమావేశమే కారణం

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో జరిపిన 15 నిమిషాల సమావేశమే తెలంగాణలో తమ కంపెనీ ఏర్పాటుకు కారణమని హెచ్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ చైర్మన్ మహేంద్రప్రతాప్ శుక్లా తెలిపారు. దేశంలో మా కంపెనీ విస్తరణకు ఏ రాష్ర్టాన్ని కేంద్రంగా చేసుకోవాలనే అన్వేషణలో భాగంగా తెలంగాణ ఐటీశాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరితో సమావేశం అయ్యారు. మాతో ప్రాథమిక భేటీ జరిపిన సుజయ్.. మంత్రి కేటీఆర్‌తో ఒక్కసారి సమావేశం అవ్వాల్సిందిగా మాకు సూచించారు. అనంతరం ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యాం. 15 నిమిషాలపాటు జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ తప్ప మరే రాష్ర్టాన్ని ఎంచుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే రాష్ట్రం కోసం ఆయన చూపుతున్న ఆసక్తి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అభివృద్ధి కోసం వారు రూపొందించిన ప్రణాళికలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే ఇలాంటి నాయకులు కావాలి. ఇలాంటి నాయకులు సారథ్యం వహిస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని ఆయన ప్రశంసించారు.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles