రక్షణ కంపెనీలకు తెలంగాణ బెస్ట్

Thu,December 5, 2019 02:45 AM

-దశాబ్దాలుగా అనేక రక్షణ పరిశ్రమలకు నిలయం
-ట్రంప్ హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లోనే తయారీ
-డిఫెన్స్‌కాన్‌క్లేవ్ ప్రారంభంలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దశాబ్దాల క్రితమే ఏర్పాటైన రక్షణరంగ సంస్థలు, స్థానిక వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పేందుకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రక్షణరంగానికి చెందిన కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు మరిన్ని ముందుకురావాలని పిలుపునిచ్చారు. బుధవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో డిఫెన్స్ కాన్‌క్లేవ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలానగర్, చర్లపల్లి, కుషాయిగూడ ప్రాంతాల్లో దాదాపు వెయ్యికిపైగా ఎయిరోస్పేస్, రక్షణ రంగానికి చెందిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయని చెప్పారు. డజన్‌కుపైగా డీఆర్డీవో రక్షణ రంగ పరిశోధనా కేంద్రాలు, 25కిపైగా పెద్ద కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. గత దశాబ్దకాలంగా చూస్తే ఎయిరోస్పేస్ రంగంలో హైదరాబాద్ అత్యంత ప్రముఖంగా మారిందని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించే హెలికాప్టర్ క్యాబిన్‌ను హైదరాబాద్‌లోనే తయారుచేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. నాలుగు ఎయిరోస్పేస్ పార్కులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, పలు అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయన్నారు. ఆదిబట్ల, జీఎంఆర్, అదానీ ఏరోస్పేస్ సెంటర్లు రక్షణ రంగ ఉత్పత్తులకే కేంద్రాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. లాక్‌హీడ్ మార్టిస్, బోయింగ్, రఫేల్ లాంటి బహుళజాతి సంస్థలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రస్ సంస్థ కూడా ఎయిర్ క్రాప్ట్ ఇంజిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటుచేసిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల భాగస్వామ్యంతో అతితక్కువ ఖర్చుతో ఏరోస్పేస్ రంగంలో సర్టిఫికెట్ కోర్సులు అందించేలా తెలంగాణలో ప్రైవేటు భాగస్వాములతో ఏరోస్పేస్ వర్సిటీ ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి చెప్పారు. టాస్క్ ద్వారా నిపుణత గలయువతను తయారుచేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన వర్క్‌ఫోర్స్ పుష్కలంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో సానుకూల ధృక్పథం ఉన్న ప్రభుత్వం ఉండడం సంతోషమని పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీఐఐ చైర్మన్ రాజు, వైస్‌చైర్మన్ కృష్ణ బడనపు, కో కన్వీనర్ సీఐఐ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ ప్యానెల్ చైర్మన్ అశోక్ అట్లూరి పాల్గొన్నారు.

228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles