పేద విద్యార్థులకు పెద్దన్న కేటీఆర్


Fri,July 19, 2019 02:05 AM

KTR helps two students pursue higher education

-అనాథకు సీబీఐటీలో, ఆటో డ్రైవర్ కుమార్తెకు ఐఐటీ సీటు
-ఇంటికి పిలిపించుకొని ఆర్థికసాయం అందజేత
-ఉన్నత చదువులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పేద విద్యార్థులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పెద్దన్నగా మారారు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాకూడదని అండగా నిలిచారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అష్టకష్టాలు పడుతూ చదివి సీబీఐటీలో సీటు సాధించిన అనాథ విద్యార్థిని, ఐఐటీ సీటు సాధించిన ఆటోడ్రైవర్ కుమార్తెకు అభయమిచ్చారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని తన నివాసానికి పిలిపించుకొని ఆర్థికసాయం అందించారు. విద్యార్థినుల బంగారు భవితకు భరోసా కల్పించి.. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

మీడియా ద్వారా తెలుసుకొని రచనకు అండ

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. రచన పదోతరగతి వరకు జగిత్యాల బాలసదనంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. తరువాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తిచేసింది. ఈ ఏడాది ఈ-సెట్‌లో మంచి ర్యాంకు సాధించి హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించింది. తల్లిదండ్రులు లేని రచన ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేదు. విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఆమెకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రచనను బేగంపేటలోని నివాసానికి పిలిపించుకొని చదువుకొనేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు.

ఫీజు చెల్లించేందుకు ఆర్థికసాయం అందజేశారు. చదువుపై శ్రద్ధపెట్టాలని సూచించారు. రాష్ట్రంలో తనలాగే అనేకమంది అనాథ విద్యార్థులు ఉన్నారని, వారికోసం ప్రత్యేక రిజర్వేషన్ క్యాటగిరీ ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా రచన.. కేటీఆర్‌ను కోరింది. అనాథలపట్ల రచనకు ఉన్న సామాజిక స్పృహను కేటీఆర్ అభినందించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం రచన బాగోగులు చూసుకుంటున్న విద్యార్థిని అక్కాబావలకు అవసరమైన ఆర్థికసాయం లేదా ఉపాధికి సంబంధించిన ఇతర సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్.. జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌కు ఫోన్‌చేసి సూచించారు.

KTR-students2

ఆటో డ్రైవర్ కూతురి ట్వీట్‌కు స్పందన

గ్రేటర్ వరంగల్ పరిధిలో హసన్‌పర్తి గ్రామానికి చెందిన మేకల అంజలి పేదరికాన్ని జయించి ఐఐటీ ఇండోర్‌లో సీటు సాధించింది. అంజలి తండ్రి రమేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కూతురు గత ఏడాది ఎంబీబీఎస్‌లో మంచి ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు పొందడంతో రమేశ్ తనకున్న భూమిని విక్రయించి ఫీజు చెల్లించారు. ప్రస్తుతం రెండో కూతురు అంజలి ఐఐటీ ఇండోర్‌లో సీటు సాధించగా, ఆమె ఫీజు చెల్లించే ఆర్థికస్థోమత అతనికి లేదు. తన తండ్రి పడుతున్న బాధలు, తాను ఐఐటీలో సీటు పొందిన విషయాన్ని అంజలి.. కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

వెంటనే స్పందించిన కేటీఆర్.. అంజలిని గురువారం హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకొన్నారు. ఐఐటీ ఫీజులకు అవసరమైన ఆర్థికసాయం అందించారు. భవిష్యత్తులో తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తానని ఈ సందర్భంగా అంజలి చెప్పింది. కుమార్తె ఫీజు కోసం ఆర్థికసాయం అందించిన కేటీఆర్‌కు రమేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సాయంతో కుటుంబానికి భరోసా లభించిందని చెప్పారు.

906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles