ఉద్యోగకల్పనే లక్ష్యం

Sat,September 14, 2019 03:02 AM

-భారీ పెట్టుబడులు వచ్చేలా ప్రణాళిక సిద్ధంచేయాలి
-అక్టోబర్‌లో పలు కంపెనీలు, పరిశ్రమలకు శంకుస్థాపన
-ఐటీరంగంలో గత ఐదేండ్లుగా అద్భుతమైన పురోగతి
-ఎలక్ట్రానిక్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తేవడమే లక్ష్యం
-ఐటీ, పరిశ్రమలశాఖపై సమీక్షలో మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని అధికారులకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇప్పటికే అనేక ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. మరిన్ని కంపెనీలు వచ్చేందుకు ప్రతిపాదనలు పంపాయని వెల్లడించారు. పరిశ్రమలు, ఐటీ శాఖపై శుక్రవారం మాసాబ్‌ట్యాంకులో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో అనేక కంపెనీలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఫుడ్‌ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ రంగాల్లో కొన్ని నెలల్లోనే భారీపెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

ఈ మేరకు ఆయా కంపెనీల ప్రతిపాదనలపై అధికారులు వివరాలు అందించారు. పలు కంపెనీలు టీఎస్‌ఐపాస్ ద్వారా వాటి అనుమతులు తీసుకొన్నాయని, అక్టోబర్‌లో వాటికి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని, కంపెనీ యాజమాన్యాలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి ఎన్ని ఎక్కువ కంపెనీలు, పెట్టుబడులు వస్తే అన్ని ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, సిరిసిల్ల అపారెల్ పార్కులతో పాటు పలు ఇండస్ట్రియల్, ఫుడ్‌ప్రాసెసింగ్ పార్కుల పురోగతిపైనా మంత్రి సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన పార్కుల్లో మరిన్ని కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ఇతరప్రాంతాలకు విస్తరించాలి

ఐటీ రంగంలో ఐదేండ్లుగా అద్భుత ప్రగతి సాధించామని, ఈ రంగంలో భారీపెట్టుబడు లు నగరానికి తరలివచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఐటీశాఖ కార్యక్రమాలపైన అధికారులు మంత్రికి వివరాలు అందజేయగా, ఐటీరంగ పురోగతిపై సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే నాలుగేండ్ల కాలానికి విభాగాలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన నివేదికను అందించాలని కేటీఆర్ కోరారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే అంశాలన్నీ సవాల్‌గా తీసుకోవాలని ఐటీశాఖాధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్‌రంగంలో మ రిన్ని పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, పరిశ్రమలశాఖ కమిషనర్ నదీంఅహ్మద్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమలు, ఐటీశాఖ అధికారులు పాల్గొన్నారు.
KTR1

1870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles