జల విద్యుత్‌కే శ్రీశైలం

Fri,January 11, 2019 02:28 AM

-సాగర్‌కు నీటి విడుదలతో రెండు రాష్ర్టాలకు సాగునీరు
-కృష్ణాబోర్డుకు మరోసారి స్పష్టంచేసిన తెలంగాణ
-తొమ్మిదో బోర్డు సమావేశ మినిట్స్‌పై తీవ్ర అసంతృప్తి
-బోర్డుకు ఘాటుగా లేఖరాసిన ఈఎన్సీ మురళీధర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జలాశయంనుంచి కరంటు ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై ప్రతిసారీ తెలంగాణను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణా బోర్డుకు నీటిపారుదలశాఖ మరోసారి సరైన కౌంటర్ ఇచ్చింది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిందే జల విద్యుత్ కోసం. అక్కడ కరంటు ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని వదిలి.. సాగర్ నుంచి రెండు తెలుగు రాష్ర్టాలు తాగు, సాగునీటి అవసరాలు తీర్చుకుంటాయి అని నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తాజాగా స్పష్టంచేశారు. గతంలో జరిగిన తొమ్మిదో బోర్డు సమావేశంలోనూ ఇదే విషయాన్ని సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వెల్లడించారని, కానీ ఆ సమావేశ మినిట్స్‌లో మాత్రం ఈ అంశాన్ని పొందుపరచలేదని రెండు రోజుల కిందట బోర్డుకు రాసిన లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు.

సీఎస్ చెప్పిన అంశాలను పట్టించుకోని బోర్డు

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా కరంటు ఉత్పత్తితో సాగర్‌కు తెలంగాణ నీటిని విడుదల చేస్తారు. ఈ నీటి విడుదలపై ఏపీ కొంతకాలంగా తరచూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గుతుందని, వెంటనే కరంటు ఉత్పత్తి ద్వారా నీటి విడుదల నిలిపివేయాలంటూ బోర్డుకు ఏపీ లేఖ రాయడం.. అందుకు బోర్డు తలూపుతూ తరచూ తెలంగాణను నీటి విడుదల నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన తొమ్మిదో బోర్డు సమావేశంలో సీఎస్ ఎస్కే జోషి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. కానీ బోర్డు ఉన్నతాధికారులు సమావేశ మినిట్స్‌లో సీఎస్ వెల్లడించిన అంశాలను పొందుపరచలేదు. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తూ ఈఎన్సీ మురళీధర్‌రావు బోర్డుకు లేఖ రాశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉద్దేశాన్ని మరోసారి బోర్డుకు స్పష్టంచేశారు.

తిత్లీ తుఫాన్ వల్ల గ్రిడ్ ఫెయిల్ కావడంతో తెలంగాణ శ్రీశైలంలో కరంటు ఉత్పత్తిని ఎక్కువగా చేయడం అనివార్యంగా మారిందని సీఎస్ జోషి చెప్పిన విషయాన్ని కూడా సమావేశ మినిట్స్‌లో ఎందుకు పొందుపరచలేదని ఈఎన్సీ ప్రశ్నించారు. పెన్నా బేసిన్‌లోని జిల్లాల తాగునీటి అవసరాలు (రాయలసీమ) అంటూ పదేపదే ఏపీ బోర్డుకు నీటి కోసం లేఖ రాసి పెద్ద ఎత్తున కృష్ణాజలాలను తరలించుకుపోవడం కూడా పరిపాటిగా మారింది. దీనిపైనా సీఎస్ ఎస్కే జోషి బోర్డుకు సూచన చేశారు. అసలు కృష్ణా బేసిన్ అవతల ఉన్న బేసిన్ జనాభా ఎంత? తాగునీటి అవసరాలు ఎంత? అనే వివరాలను బోర్డు సేకరించాలని, తద్వారా తాగునీటి అవసరాలకు నీరు విడుదలచేయాలని కూడా చెప్పారు. ఈ కీలక అంశాలను కూడా బోర్డు ఉన్నతాధికారులు సమావేశ మినిట్స్‌లో పొందుపరచకపోవడాన్ని ఈఎన్సీ ఎత్తి చూపారు.

డీపీఆర్‌లు ఇస్తామని ఒప్పుకోలేదు

బోర్డు తొమ్మిదో సమావేశ మినిట్స్‌లో తెలంగాణలోని కొన్ని సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించినట్టు పేర్కొన్నారని, కానీ తామేమీ ఒప్పుకోలేదని ఈఎన్సీ స్పష్టంచేశారు. మినిట్స్‌లో ఆ అంశాన్ని సవరించాలని సూచించారు. బచావత్ ట్రిబ్యునల్‌లోని ఏడో క్లాజు ప్రకారం హైదరాబాద్, మిషన్ భగీరథ కింద తాగునీటి కోసం తెలంగాణ వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని, ఈ అంశాన్ని మినిట్స్‌లో చేర్చాలని కోరారు. కొన్నిరోజుల కిందట జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశ మినిట్స్‌ను ఇప్పటివరకు విడుదల చేయలేదని, వెంటనే వాటిని రెండు రాష్ట్రాలకు పంపాల్సిందిగా ఈఎన్సీ తెలిపారు.

4321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles