భూమికి పచ్చాని రంగేసినట్టు..


Thu,July 12, 2018 06:53 AM

komati banda as a tourist destination

-కోమటిబండ వైపు దేశం చూపు
-నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం..
-ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పర్యావరణ సమతుల్యత

(ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ): గుట్టలు, ముళ్లపొదలతో ఎడారిని తలపించిన ఆ ప్రాంతం నేడు పచ్చని పర్యావరణంతో అలరారుతున్నది. ప్రకృతి రారమ్మని పిలుస్తూ.. రమణీయ వాతావరణంతో ఆహ్లాదాన్ని కలిగిస్త్తున్నది. నాటిబోసి మైదానప్రాంతం నేడు అడవిగా మారింది. రాష్ట్ర ప్రగతికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నది. హైదరాబాద్‌కు 65 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ మండలం పరిధిలోని కోమటిబండ ప్రాంతం ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషికి తార్కాణంగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలన్న బృహత్ సంకల్పంతో 2015 నుంచి తెలంగాణకు హరితహారాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్యక్రమంగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే.

మిషన్ భగీరథకు పునాది ఇక్కడే..

హైదరాబాద్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని కోమటిబండ ప్రాంతంలోనే ఇంటింటికీ మంచినీరందించే మిషన్‌భగీరథ పథకానికి పునాది పడింది. ఆ ప్రాంతంలోనే అడవుల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన మొదలు కావడం. రెండేండ్ల కిందట కోమటిబండ ప్రాంతాన్ని చూసినవారు ప్రస్తుత పరిస్థితిని చూసి అంతలో ఇంతమార్పా? అని ముక్కుమీద వేలేసుకునే పరిస్థితి. అటవీశాఖ అధికారులు నిరంతరంగా సాగించిన ప్రత్యేకకృషి ఫలితంగా దుర్భిక్ష ప్రాంతాన్ని తలపించిన ఈ ప్రాంతం పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. వంద అడుగుల ఎత్తయిన కోమటిబండపైకి ఎక్కి చూస్తే పది కిలోమీటర్ల వరకు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. ఆగస్టు7, 2016లో ప్రధాని మోదీ ఇక్కడ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 72 హెక్టార్లలో మొక్కలు నాటారు. ఆ తర్వాత యుద్ధప్రాతిపదికన దాదాపు రెండు వేల ఎకరాల్లో మేలుజాతి మొక్కలను నాటారు. క్షీణించి, ధ్వంసమైపోయిన అడవికి ఎయిడెడ్ నేచురల్ రీజనరేషన్ (ఏఎన్‌ఆర్) పద్ధతిలో తిరిగి జీవంపోశారు. సిద్దిపేట రేంజ్ గజ్వేల్ షరీఫ్‌లో 1200హెక్టార్లలో, నర్సంపల్లి, మీనాజీపేట, ధర్మారెడ్డిపల్లి, మర్పడగప్రాంతాలలో మరో 800 హెక్టార్లలో అడవికి తిరిగి జీవంపోశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడారు.

అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ నుంచి మొదలుకుని డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, రేంజ్ ఆఫీసర్ సీహెచ్ వెంకటరామారావు, సెక్షన్ ఆఫీసర్ బాలేశం, అధికారులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషి ఫలించింది. ఇక్కడ హైవే, అంతర్గత రహదారులకు ఇరువైపులా రెండు నుంచి మూడు వరుసల వరకు నాటిన మొక్కలు చెట్లుగా ఏపుగా ఎదిగి పరవశింపజేస్తున్నాయి. కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చదనమే. ఇక్కడ నాటిన మొక్కలలో 90 శాతం పైగా బతకడం విశేషం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాష్ర్టాల అటవీ ఉన్నతాధికారులతోపాటు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్‌తో పాటు ప్రపంచబ్యాంక్ బృందం పర్యటించి ఇక్కడి పర్యావరణం భేష్ అని ప్రశంసించారు. ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ కంట్రీహెడ్ అతుల్ బకాయ్ వచ్చి ఇది ఇతర ప్రాంతాలకు మార్గదర్శకం కావాలన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు కూడా ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు. మరికొన్ని రోజులలో పొరుగు రాష్ర్టాల నుంచి అధికారుల బృందాలు వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

KOMATI-BANDA2

పర్యాటక ప్రాంతంగా కోమటిబండ

అతితక్కువ కాలంలోనే కోమటిబండ పర్యాటకప్రాంతంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నదని స్ఠానిక డీఎఫ్‌వో శీధర్‌రావు అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలలోని పలుప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి రమణీయ వాతావరణంలో సేదదీరుతున్నారని తెలిపారు. అడవిని తిరిగి పునరుద్ధరించడంతో వలసపక్షుల రాక, వన్యప్రాణుల సందడి పెరిగాయని వివరించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రి హరీశ్‌రావు ఇతర ఉన్నతాధికారులు వెన్నంటి నిలవడం, ఇతర రేంజ్ అధికారుల సహకారం, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక కృషి వల్ల ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. గజ్వేల్ అటవీప్రాంతాన్ని ఎకో-టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

5504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles