ఖమ్మం ఖిల్లా


Wed,November 18, 2015 11:24 AM

Khammam Fort Khammam Telangana Tourism

కాకతీయులు, రెడ్డిరాజులు, సాళువ వంశీయులు, బహమని సుల్తానులు, అసఫ్‌జాహీ వంశస్థులు దశలవారీగా ఏలిన ఖమ్మం ఖిల్లా.. చరిత్రకు సాక్ష్యం. వెయ్యేళ్ల గతానికి నిలువుటద్దం! నాటి రాజులు, చక్రవర్తుల గుర్రపు డెక్కల చప్పుళ్లు, అశ్వగజ దళాధిపతుల కవాతులు.. కత్తులు, డాలు, బరిసెల విన్యాసాలు.. ఒకప్పుడు ఆ ఖిల్లాపై కదం తొక్కాయి. దానిపై లభించిన శాసనాలు, రాతికట్టడాలు, బురుజులు, ఫిరంగులు, అన్ని కాలాల్లోనూ నిండుగా నీరుండే కోనేరు.. ఆరాజుల విజయగాథలను ప్రతిబింబిస్తున్నాయి. ఎందరో రాజులు ఏలిన ఖిల్లా సాక్షిగా చరిత్ర తన పుటలను తిరగేస్తోంది. కాకతీయుల పాలనాదక్షతను ఈ కోట ప్రతిబింబిస్తోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఖమ్మంజిల్లాకే తలమానికమై నిలిచింది. విశాలమైన బురుజులు.. అనేక ప్రాకారాలతో నాటి రాజుల వైభవానికి దీప్తిగా మెరుస్తున్నాయి.. కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఖమ్మంకు ఓ లాండ్‌మార్క్‌గా మారి తన ఉనికిని చాటుతున్నదీ ఖిల్లా...!

తెలంగాణలో పాలన అంటే నిజాం పాలనే. తెలంగాణలో చరిత్ర అంటే నిజాం చరిత్రే! తెలంగాణలో కోట అంటే గోల్కొండ కోటే. పాలనా అవసరాల నిమిత్తం నిజాం ప్రభువులు నిర్మించిన కట్టడాలన్నీ చారిత్రాత్మకమే. నిజాం నిర్మాణాలు కానివీ చరిత్రలో నిలిచాయి! అలాంటి కట్టడాల్లో వెయ్యేళ్ల కిందట రెడ్డిరాజులు నిర్మించిన ఖమ్మం ఖిల్లా ఒకటి. కాకతీయులు, దేవరాయలు ఏలిన ఈ ఖిల్లాను 17శతాబ్దంలో నిజాం ప్రభువులు దానికి మెరుగులు దిద్దారు. కాకతీయుల రెండో రాజధాని అయిన ఖమ్మం కోటను కుతుబ్‌షాహీ రాజులు మరో గోల్కొండలా తీర్చిదిద్దారు. దురదష్టవశాత్తు 60 ఏళ్ల కింద ఈ ప్రాంతంలో ప్రారంభమైన ఆంధ్ర పాలన.. ఖమ్మం ఖిల్లా చరిత్రను, ఖ్యాతిని బయటి ప్రపంచానికి కానరానీయలేదు. ఈ క్రమంలో రెండు తరాలు మారేసరికి ఖిల్లా చరిత్రే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇన్నేళ్ల పోరటానంతరం పరాయి పాలన పీడ విరగడ అయింది. ఖమ్మం ఖిల్లాకూ పూర్వవైభవం రానుంది.

చెక్కుచెదరలేదు..

రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. రాచరికానికి దర్పణంగా నిర్మించిన కోటలు మాత్రం నేటికీ చెక్కుచెదరలేదు. రాణుల ప్రేమకోసం నిర్మించిన కోటలు కొన్ని అయితే, ప్రజల అవసరాల కోసం నిర్మించిన కోటలు మరికొన్ని. శత్రుసైన్యాల దాడినుంచి కాపాడుకునేందుకు నిర్మించిన ఈ రాతి కోటలు నిర్మితమై వెయ్యేళ్లు అవుతున్నా పెచ్చులు కూడా ఊడకపోవడం నాటి మానవ సాంకేతిక మేధస్సుకు సంకేతం. గుట్టల మధ్య చెరువులు, పరిపాలనకు అనుగుణంగా భవనాలు, కిలోమీటర్ల దూరంలోని శత్రువును కనిపెట్టే గడీలు నేటికీ సజీవమే. రాజులు, చరిత్రకారులు, నక్షాలు (ప్లాన్) రూపొందించిన ఇంజనీర్ల పేర్లూ చెదిరిపోని అక్షరాల్లో దాగున్నాయి. కోటలు, చెరువులతో గ్రామాలు నెలకొన్నాయి. కోటలోని భవనాలు, కోనేరులు, ఫిరంగులు నాటి రాచరికాన్ని తెలిపితే.. వాటి చుట్టూ ఉన్న చిన్నచిన్న కోట కట్టడాలు నాటి సైనికుల పనితనానికి కొలమానంగా మిగిలాయి. నాటి కోటల నిర్మాణంలో మనిషితోపాటు సమానపాత్రధారిగా శ్రమించిన ఏనుగులు, గుర్రాల నమూనాలు కోటలముందు నేటికీ కన్పిస్తాయి.

ఖిల్లా కథలు...

క్రీ.శ. 950లో వెలుగుమట్ల గ్రామానికి చెందిన లకా్ష్మరెడ్డి, రంగారెడ్డి, వేమారెడ్డి అనే రైతులు తమ భూముల్లో సేద్యంచేసుకుంటున్నప్పుడు నిధి నిక్షేపాలు దొరికాయి. ఈ విషయాన్ని కాకతీయుల రాజుకు తెలపడంతో ఆయన ఆదేశానుసారం ఈఖిల్లా నిర్మాణాన్ని చేపట్టారని చరిత్ర చెబుతోంది. తొలుత అది మట్టికోట! 997లో గజపతులతోపాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి ఈకోట నిర్మాణాన్ని కొనసాగించారు. క్రీస్తుశకం 1006లో అది పూర్తయింది. 300 ఏళ్లపాటు రెడ్డి వంశీయుల పాలనలో ఉంది. తర్వాత వెలమరాజులు చేజిక్కించుకున్నారు. తదుపరి నందవాణి, కాళ్లూరు, గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్లింది. సుల్తాన్ కులీకుత్బూల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మంకోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్‌షాహీ పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో ఇది అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది. కాకతీయుల ఏలుబడిలో ఉన్న ప్రదేశం కావడం, అప్పటికే శత్రుసైన్యాలు అనేక దఫాలుగా దాడులు చేయడంతో వాటిని ఎదుర్కొనేందుకు కాకతీయ రాజు.. తన పరిధిలో దొరికిన నిధి, నిక్షేపాలతో ఖిల్లా నిర్మాణానికి పూనుకున్నాడని కథనం. దీంతోపాటు వరంగల్ నుంచి రాజు ఆదేశాల మేరకు ఖమ్మం వచ్చి ఖిల్లా దుర్గాన్ని, దాని పక్కన చెరువును నిర్మించారని.. అందుకే లకా్ష్మరెడ్డి పేరుతో లకారం చెరువు ఏర్పడిందని మరో కథనం. ఖిల్లా నిర్మాణమయ్యాక రెడ్డి రాజులు, వెలమ రాజులు ఈ కోటను మెరుగుపరిచారు.

స్వరూపం...

ఖిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్లు. దీని ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు. మొత్తం10 ద్వారాలు. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం. తూర్పువైపు ద్వారాన్ని రాతిదర్వాజా అంటారు. దీన్నే పోతదర్వాజ అని కూడా పిలుస్తారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మోహరించే వీలుంది. కోట లోపల జాఫర్‌దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌దౌలా (బావి) ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు కాల్వలూ ఉన్నాయి. ఖిల్లాలోకి ప్రవేశించడానికి రెండు ముఖ ద్వారాలున్నాయి. లోపలి సింహద్వారం చదరంగా ఉండి 30 అడుగుల ఎత్తులో పెద్దపెద్ద రాళ్లతో నిర్మించారు. ప్రతి కోట బురుజు (గోడ)పై భాగం 45 అడుగుల వెడల్పుతో లోపలికి దిగడానికి మెట్లు కనబడతాయి. ప్రతి బురుజుపైనా రెండు ఫిరంగులున్నాయి. ఒక నీటి కుండ కూడా ఉంది. సింహద్వారం సమీపంలో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి గుండు తగిలినా చెక్కుచెదరని పటిష్ఠతతో నిర్మించారు ఈ రాతి కట్టడాన్ని. కోటగోడలపై ఉన్న చిన్నచిన్న గోడలను జాఫర్ దౌలా (ధంసా) నిర్మించారు.

వీటిని ఇటుకలు, సున్నంతో కట్టారు. ఖిల్లాలో 80 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద దిగుడు బావి ఉంది. లోపలికి దిగడానికి రాతి మెట్లు ఉన్నాయి. కోట సింహందాటి లోపలికి కొద్దిదూరం వెళ్లాక అసలు దుర్గం కన్పిస్తుంది. దీనిపైకి ఎక్కడానికి చిన్న మెట్లు ఉన్నాయి. ఈ మార్గంలో చిన్నచిన్న రాతిగోడలతో ద్వారాలున్నాయి. వీటిని దాలోహిస్వారు అంటారు. కొండపై కట్టిన ఈ ఖిల్లా విస్తీర్ణం మూడు చదరపు మైళ్లు. 15 బురుజులు శత్రుసైన్యం దాడులను తట్టుకునే విధంగా ఒకదానివెంట మరొకటి రెండు గోడలు నిర్మించారు. పెద్దపెద్ద రాళ్లను కోట నిర్మాణంలో నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మించారు. పక్కరాళ్లు అతకడానికి ఎలాంటి సున్నమూ వాడకపోవడం గమనార్హం. వాటి చుట్టూ లోతైన కందకం తీశారు. కాకతీయ పట్టణం ఓరుగల్లు నుంచి ఖమ్మం ఖిల్లా కోటకు సొరంగ మార్గం ఉందని, దాని ద్వారానే రాకపోకలు సాగేవని కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.

కాకతీయులకు రెండో రాజధానిగా..

మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం ఖిల్లా తదనంతరం స్వతంత్ర మండలి రాజ్యంగా రూపొందింది. కాకతీయుల సామ్రాజ్యం నశించిపోయిన తర్వాత తెలుగునేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంతరాజులు ఏకమై ఖమ్మం సమీపంలో ఉన్న మూసురూలి నాయకత్వంలో పదేళ్లపాటు విరోచితంగా పోరాటం జరిపారు.

అనంతరం సీతాపతి కాలంలో ఖమ్మం ఖిల్లా తెలంగాణ ముఖ్యకేంద్రం అయింది. సీతాపతి బహమని సుల్తానుల సహాయంతో వరంగల్‌కు రాజప్రతినిధిగా ఎన్నికయ్యాడు. పెద్దయ్యమాత్యుని సహాయంతో తెలంగాణలో తిరిగి తెలుగు సామ్రాజ్యం విస్తరింపచేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఖమ్మాన్ని తమ సామ్రాజ్యానికి రెండో రాజధానిగా చేసుకున్నారు. ఈ సమయంలో కులీకుతుబ్‌షాహీ ఓటమి పాలైనా సీతాపతి ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకుని ఈప్రాంతానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కూడా దండెత్తి ఇక్కడి ధనరాసులను గోల్కొండకు తరలించారు. ఈఖిల్లా ప్రవేశం ద్వారం వద్ద ఉన్న శిలాఫలకంపై ఆనాటి తెలుగులో ఈవిధంగా రాసి ఉంది. 1. హయగరుడ కోటలో గొంగ్గ, 2. బయ్యతల గుండు గండ గడి, 3. కోటమాల గంగని తలగుండు గండ, 4. తేరా సామంత బారామండలి కాయ, 5. జాయుల మూరురాయ జగద్దళ ముఖి, 6. బీరుసస్థాపంగా బీతిరుద్రకాని స్థాపంగా బీతి, 7. కాకతీయ రాజ్యస్థాపనాఛాయ్య నెల్లూరి వీరక్ష. క్రీ.శ. 1615లో శ్రీకష్ణదేవరాయలు కులీకుతుబ్‌షాహీని ఓడించి ఖమ్మం దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆంధ్రభోజుడు శ్రీకష్ణదేవరాయలు తన దిగ్విజయయాత్రలో భాగంగా దీనిని కూడా జయించినట్లు చరిత్ర చెబుతోంది. గజపతుల నుంచి 1615లో దీనిని వశపర్చుకున్నాడు.

గంభము మెట్టు గ్రక్కున గదల్చి.. రాజపుత్రుడే శ్రీకష్ణదేవరాయ విభుడు అంటూ ముక్కతిమ్మన తన పారిజాతాపహరణం ప్రబంధంలో వర్ణించాడు. ఆ తర్వాత గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ ముల్కీ రాజ్యాన్ని ఆక్రమించాడు. 1687 వరకు ఐదుగురు నవాబు ఖమ్మంగిరిని పాలించినట్టు చెబుతారు. వారిలో ఆఖరివాడు అబ్దుల్ హసన్ కుతుబ్‌షా. 1658-1687 వరకు పాలించాడు. ఈయనను తానీషా అని పిలుస్తారు. 1687 ప్రాంతంలో గోల్కొండపై దండెత్తిన ఔరంగజేబు ఈ దుర్గాన్ని వశపర్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అటు తర్వాత నిజాం ఏలుబడిలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. 1722లో ఈ ప్రాంత సుబేదారు నిజాం ముల్కీ అసల్‌జీ అనే వ్యక్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. 1761 నుంచి 1803 వరకు జాఫర్‌దౌల్ అనే తహసీల్దార్ పర్యవేక్షణలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. ఇతనికాలంలో ఖమ్మం ఖిల్లా మరింతగా ఆధునీకరించారు. అభివద్ధి కూడా జరిగింది. 1768లో రెండో జాఫర్‌దౌలా తహసీల్దార్‌గా నియమితుడయ్యాడు. ఈయన అన్న పేరుతోనే ధంసలాపురం గ్రామాన్ని స్థాపించారు. 1800 సంవత్సరం నాటి తెలంగాణ అధికారుల పరిపాలన కొనసాగిన ఈ ఖిల్లాను 1937లో నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

మరిప్పుడు..

ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఖిల్లా.. ఇన్నాళ్లూ పాలించిన ఆంధ్రపాలకులకు మచ్చుకైనా కానరాకపోవడం గమనార్హం. దీని అభివద్ధి తమకెందుకులే అనుకున్నారో ఏమో? అందుకే దీన్ని ఆధునీకరించడంపై దష్టిపెట్టి ఉండకపోవచ్చు. సరే.. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఏర్పడబోతున్న తెలంగాణ ప్రభుత్వ పాలనలోనన్నా ఈ ఖిల్లాకు మహర్దశ పట్టాలని ఆశిద్దాం. కాస్త దష్టిసారిస్తే ఖమ్మంఖిల్లా తెలంగాణలో రెండో అతిపెద్ద పర్యాటక కోటగా అవతరించనుంది.

12979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles