పట్టాదారుడినే మార్చేశారు


Thu,May 23, 2019 01:46 AM

Khammam Farmer Fighting for the Earth Registration

-వారసులకు భూమి దక్కకుండాచేశారు
-రెవెన్యూ అధికారుల తప్పిదంతో మరొకరిపాలైన భూమి
-భూమి కోసం పదేండ్లుగా పోరాటంచేస్తున్న ఖమ్మం జిల్లా
-నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం

నేలకొండపల్లి: తండ్రి మరణానంతరం కొడుకులకు వారసత్వంగా దక్కాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు.. వారికి తెలియకుండా మరొకరికి పట్టాచేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ గత పదేండ్లుగా ఆ కుమారులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంతలో పట్టాదారుగా అవతరించిన వ్యక్తి ఆ భూమిని అమ్మేసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆ బాధితుడు ధర్మగంటతో చెప్పుకున్నాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామానికి చెందిన షేక్ బాషాసాహెబ్ చెప్పిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన షేక్ మదార్‌సాహెబ్‌కు బోదులబండ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వేనంబర్లు 173/2, 173/3, 174లో కలిపి మొత్తం ఎకరం 25 గుంటల భూమి ఉన్నది. 1964లో అప్పటి అధికారులు పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. ఆ భూమిని ఆయనే సాగుచేసేవారు. 2005లో షేక్ మదార్‌సాహెబ్ చనిపోయారు. దీంతో ఆయనకున్న ఐదుగురు కుమారులు ఖాదర్‌సాహెబ్, ఖాసీంసాహెబ్, ఖాజాబోదుల్ సాహెబ్, మౌలాసాహెబ్, బాషాసాహెబ్ ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. అయితే, రెవెన్యూ అధికారులు ఆ భూమికి సంబంధించిన రికార్డుల్లోని పట్టాదారు కాలంలో ఉన్న షేక్ మదార్‌సాహెబ్ పేరును తొలిగించి.. ఆదే గ్రామానికిచెందిన షేక్ ఖాసీం అనే మరో వ్యక్తి పేరిట రికార్డులు మార్చి.. పాస్‌పుస్తకం ఇచ్చారు. ఈ విషయంపై మదార్‌సాహెబ్ కుమారులు తమ భూమిని తమకు ఇప్పించాలని ఎన్నోమార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం పట్టాదారుగా అవతరించిన షేక్ ఖాసీం ఆ భూమిని మరొకరికి విక్రయించారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం వల్ల తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన భూమి తమకు దక్కకుండాపోయిందని వారసులు ఆవేదనచెందుతున్నారు.

పదేండ్లుగా తిరుగుతున్నాం


షేక్ బాషాసాహెబ్

పదేండ్లుగా మా భూమిని మాకు ఇప్పించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్‌కు, ఆర్డీవోకు ఫిర్యాదులుచేశాం. మా బాధను మొరపెట్టుకున్నాం. వీఆర్వో చేసిన తప్పిదానికి మా తండ్రి ద్వారా రావాల్సిన భూమిని మేము కోల్పోవాల్సి వచ్చింది. మా అన్నదమ్ములకు తెలియకుండా మా భూమిని మరొకరికి పట్టాచేశారు. మా స్వాధీనంలో ఉన్న భూమికి తప్పుడు కాగితాలను సృష్టించి అక్రమంగా కట్టబెట్టారు. కూలీ పనులు చేసుకొని జీవిస్తున్న మా కుటుంబాలకు ఆధారంగా ఉంటుందనుకున్న భూమిని లేకుండాచేశారు.
- షేక్ బాషాసాహెబ్, కోరట్లగూడెం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా


సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతులకు మేలు


బానోత్ భిక్షంనాయక్, రైతు

సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతులకు మేలు జరుగుతుంది. బ్రిటిష్‌కాలంనాటి చట్టాలు, లంచగొండి అధికారుల వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు. గతంలో పటేళ్లు, పట్వారీలు ఇష్టానుసారం రికార్డులను తారుమారుచేసి, రైతుల మధ్య చిచ్చుపెట్టారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు రికార్డులను సరిచేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గత ఏడాది చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా అనేకమంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చాయి. వీటిలోనూ రెవెన్యూ సిబ్బంది చేతివాటం చూపి, ఒకరి భూమిని మరొకరి పాస్‌పుస్తకాల్లో ఎక్కించి.. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెవెన్యూవ్యవస్థ ప్రక్షాళనకు నడుంబిగించిన సీఎం కేసీఆర్‌కు రైతులంతా మద్దతుగా నిలవాలి.
- బానోత్ భిక్షంనాయక్, రైతు, గురువాయగూడెంతండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles