భవనాల అప్పగింత నేడు


Mon,June 17, 2019 02:41 AM

KCR On About New Secretariat Construction in Telangana State

-తెలంగాణకు సచివాలయంలోని పలు బ్లాకులు.. ఏపీ డీజీపీ కార్యాలయం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ అప్పగింత
-నేటి సాయంత్రంతో పూర్తికానున్న ప్రక్రియ
-ఏపీకి హెర్మిటేజ్, సీఐడీ భవనాల కేటాయింపు
-27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన!
-పాత ప్రదేశంలోనే నిర్మాణానికి నిర్ణయం
-తాత్కాలిక సచివాలయంగా బూర్గుల భవనం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం కీలకమైన భవనాల అప్పగింత కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తిరిగి అప్పగించనున్నట్టు ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులకు స్పష్టంచేశారు. సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లను తెలంగాణకు అప్పగించనున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాకులు తెలంగాణ ఆధీనంలోకి రానుండటంతో ఈ నెల 27న నూతన సచివాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు.

ఏపీ సీఎం జగన్ చొరవతో అప్పగింతలో వేగం

తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌తో తమకు అవసరం లేదని భావించి భవనాలను అప్పగించడానికి ముందుకువచ్చారు. దీంతో సచివాలయంతోపాటు ఇతర భవనాల అప్పగింత ప్రక్రియ వేగం అందుకున్నది. సచివాలయంలో ఏపీకి కేటాయించిన కే బ్లాక్‌లో పోస్టాఫీస్, బ్యాంకు, వైద్యశాల ఉన్నాయని, దీంతో ఈ బ్లాక్‌ను తెలంగాణకు అప్పగించినట్టేనని ఏపీ అధికారులు తెలిపారు. ఎల్ బ్లాక్, జే బ్లాక్‌లతోపాటు హెచ్ సౌత్‌బ్లాక్‌ను సోమవారం సాయంత్రం వరకు అప్పగిస్తామని పేర్కొన్నారు. హెచ్ నార్త్‌బ్లాక్‌లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉన్నది. హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఇతర శాఖాధిపతుల కార్యాలయాల భవనాలను కూడా అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏపీ డీజీపీ కార్యాలయం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ తెలంగాణ చేతికి రానున్నాయి. అయితే ఎర్రమంజిల్‌లో ఉన్న సాగునీటి పారుదలశాఖ కార్యాలయాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది.

ఈ భవనాలను ఖాళీ చేయడానికి ఏపీ అధికారులు సిద్ధంగా ఉన్నా.. ఇక్కడి సామగ్రి, ఫైళ్లను ఎక్కడకు పంపించాలనే దానిపై అమరావతిలో ఉన్న అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆలస్యమవుతున్నది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఏపీ ప్రభుత్వానికి రెండు భవనాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన తెలంగాణ.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న హెర్మిటేజ్ భవనం, ఏసీ గార్డ్స్‌లోని సీఐడీ భవనాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ మేరకు ఆయా భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ఇతర భవనాల్లోకి తరలిస్తున్నారు. హెర్మిటేజ్ భవనంలో ఉన్న కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తికావచ్చింది. త్వరలో ఆ భవనాలను ఏపీకి అప్పగిస్తారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పాలన కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వానికి సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు రాజధానిలో మరికొన్ని భవనాలను ఆ రాష్ర్టానికి కేటాయించారు. కానీ, ఏపీ ప్రభుత్వం 2016 నుంచే తన కార్యకలాపాలను అమరావతి నుంచే ప్రారంభించింది. అధికారులంతా అమరావతికి తరలివెళ్లారు. ఫైళ్లతోపాటు వివిధ రకాల సామగ్రినంతటినీ తీసుకువెళ్లారు. దీంతో అప్పటినుంచి ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నాటినుంచి భవనాలను అప్పగించాలని తెలంగాణ కోరుతూ వచ్చింది. కానీ, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వాటిని అప్పగించేందుకు ముందుకురాలేదు. ఇటీవల ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న భవనాలు అవసరం లేదని భావించింది. ఈ మేరకు తెలంగాణకు అప్పగించడానికి ముందుకువచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకొని ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి స్నేహహస్తం అందించారు.

ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలన్నీ తెలంగాణ చేతికి వస్తున్న నేపథ్యంలో నూతన సచివాలయాన్ని ఈ ప్రాంగణంలోనే నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో అన్ని హంగులతో పర్యావరణహితంగా ఉండేలా సచివాలయాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ఈ మేరకు నూతన సచివాలయానికి ఈ నెల 27న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నట్టు, ఈ మేరకు జీఏడీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. నూతన సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే తాత్కాలిక సచివాలయంగా బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను వినియోగించనున్నట్టు తెలిసింది. మంత్రిత్వశాఖ కార్యాలయాలన్నీ బీఆర్కే భవన్‌కు తరలించే అవకాశం ఉన్నది. కీలకమైన అధికారులు ఉండే ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలనశాఖ కార్యాలయంతోపాటు ఇతర కీలకమైన అధికారులకు ఎల్ బ్లాక్‌ను కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం.

5255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles