ఆరోగ్యలక్ష్మితో రక్తహీనతకు చెక్

Tue,December 3, 2019 04:10 AM

-నిత్యం 22,28,150 మందికి పోషకాహారం పంపిణీ
-రోజుకు రూ.2.46 కోట్లు ఖర్చు
-గర్భిణులకు అండగా కేసీఆర్ కిట్
-పరీక్షలకు వెళ్లేవారికి అమ్మ ఒడి వాహనం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పేదరికం, అవగాహనారాహిత్యం, పోషకాహారలోపంతో దేశవ్యాప్తంగా మహిళలను రక్తహీనత సమస్య పట్టిపీడిస్తున్నది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎక్కువగా గర్భిణులు మృత్యువాతపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి నిరుపేద మహిళలకు వరంగా మారింది. ఈ పథకంలో గర్భిణులు, బాలింతలు, బాలికలకు పోషకాహారం అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద 22,28,150 మందికి నిత్యం పాలు, గుడ్లు, అన్నం, పప్పుతో భోజనం అందిస్తున్నారు. ఈ పథకంలో 5,31,310 మంది బాలింతలు/గర్భిణులు, 10,42,675 మంది ఏడు నెలల నుంచి మూడేండ్ల్ల వయసు చిన్నారులు, 6,54,165 మంది మూడేండ్ల నుంచి ఆరేండ్ల వయసు బాలికలు పోషకాహారం పొందుతున్నారు. దీనికోసం ప్రభుత్వం రోజుకు రూ.2.46 కోట్లు ఖర్చు చేస్తున్నది.

తగ్గుతున్న బాధితుల సంఖ్య

గత ఏడాది జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 15-49 ఏండ్ల మధ్య వయసున్న మహిళల్లో 53 శాతం మంది రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో 7,786 కుటుంబాల్లో సర్వే చేపట్టగా 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు తెలిసింది. 6-59 నెలల చిన్నారుల్లో 60.7 %, నాన్ ప్రెగ్నెంట్ మహిళలు 15-49 ఏండ్లవారిలో 56.9 %, గర్భిణులు 18-40 ఏండ్లవారిలో 49.8 %, 15-49 ఏండ్ల వయసు మహిళల్లో 56.7 % మందిలో రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. వైద్యపరీక్షల కోసం దవాఖానకు వెళ్లేందుకు గర్భిణులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు అమ్మ ఒడి వాహనాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించే మహిళలకు ప్రోత్సాహకంగా కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. బాలింతలు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సహాయాన్ని (బాలికకు జన్మనిస్తే రూ .13 వేలు) విడుతలవారీగా అందజేస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకంతో గర్భిణులు పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటూ పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

రక్తహీనత నివారణకు మాత్రలు

ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఐరన్ లోపమని, విటమిన్ బీ12, ఫోలిక్‌యాసిడ్ సమృద్ధిగా లేకపోవడంతో ఈ సమస్యకు గురవుతున్నట్లు వైద్యనిపుణులు చెప్తున్నారు. రక్తహీనత నివారణకు ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఐరన్, ఫోలిక్‌యాసిడ్ మాత్రలను అందజేస్తున్నారు. రక్తహీనతతో బాధపడే మహిళలకు 200 ఐరన్ మాత్రలు అందజేస్తున్నారు.

847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles