డిండి ప్రాజెక్టును ఎండనివ్వం

Thu,December 5, 2019 02:50 AM

-రైతుల గౌరవాన్ని పెంచిన ఏకైక సీఎం కేసీఆర్
-డిండి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాం
-వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్/కల్వకుర్తి, నమస్తే తెలంగాణ/డిండి: ఎట్టి పరిస్థితుల్లో డిండి ప్రాజెక్టును ఎండనివ్వమని, డిండి కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్ కల అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం నల్లగొండ జిల్లా డిండి సమీపంలోని వ్యవసాయశాఖ విత్తన క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్టులో ఏడాది పొడవునా నిండుగా నీళ్లుండేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. ఈ ప్రాంతంలోని 176 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ఆధునిక వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 30 ఎకరాల్లో విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో 92.5 శాతం భూమి సన్న, చిన్నకారు రైతుల వద్ద ఉండగా, 22,500 మంది రైతుల వద్ద మిగిలిన భూమి ఉన్నదని వివరించారు. ఏడెకరాలలోపు భూమి ఉన్న రైతులు పింఛన్‌కు అర్హులని, అధికశాతం మంది రైతులకు ఆసరా పింఛన్ వస్తున్నదని చెప్పారు. దేశంలో రైతులకు సాయంచేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. విత్తనక్షేత్రంలోని వేరుశనగలో కలుపుపై నిర్లక్ష్యం ప్రదర్శించిన ఏవోపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే అతడికి మెమో జారీచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు అన్ని రకాల పంటలు పండించాలని పిలుపునిచ్చారు. సమీప పట్టణాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అధికారులు రైతులు పంటలు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. మోతాదుకు మించి రైతులు పురుగుమందులు, ఎరువులు వాడొద్దని చెప్పారు. ఆర్గానిక్ వ్యవసాయానికి, ఉత్పత్తులకు ఆదరణ పెరిగిందని, మన నాటుకోడి గుడ్డును సూపర్ మార్కెట్లలో రూ.15కు అమ్ముతున్నారని తెలిపారు.

కల్వకుర్తిలో వేరుశనగ సాగు క్షేత్రం పరిశీలన

డిండికి వెళ్తున్న క్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జోజిరెడ్డి వేరుశనగ బ్రీడర్ సీడ్ సాగు క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక వేరుశనగ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే సాగవుతున్నదని చెప్పారు. ఇందులో వనపర్తి జిల్లా అగ్రస్థానంలో ఉన్నదన్నారు. పాలమూరులో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి ఉన్న వేరుశనగను 25 నుంచి 30 క్వింటాళ్లకు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. మంత్రి వెంట దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డైరెక్టర్ కేశవులు, నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంచందర్‌నాయక్ తదితరులు ఉన్నారు.

397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles