గల్ఫ్‌నుంచి తిరిగొచ్చేయండి

Sun,October 13, 2019 01:37 AM

-మన దగ్గరే ఉపాధి లభిస్తుంది
-గల్ఫ్‌లోని తెలంగాణవాసులకు
-ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
-త్వరలో గల్ఫ్‌కు పయనం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పొట్టకూటికోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ర్టానికి తిరిగి వచ్చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డలతో మాట్లాడటానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు తెలిపారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు వివిధ పనులు చేసుకొంటూ ఇబ్బందులు పడుతున్నారని.. తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకొనేందుకు పనులున్నందున తిరిగి రావాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాం తాలనుంచి ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కొంటూ.. గల్ఫ్ దేశాలకు పోయా రు. అక్కడ దొరికిన పనిచేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతాచేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదు.

ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరుకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బిడ్డలు పనికోసం వేరేచోటుకు వెళ్తే.. తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యం గా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారిని వెనుకకు రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి న్యాక్‌లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి నిర్మాణ రంగం లో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళ్తాను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

కేరళకు అధికారుల బృందం

ఎన్నారై విధానం అధ్యయనం చేయడంకోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాతో కూడిన బృందం ఆదివారం కేరళలో పర్యటించనున్నది. గల్ఫ్ దేశాల్లో పనికి పోయినవారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సీఎం సమావేశం కానున్నారు.

134
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles