అయ్యో దేవుడా!


Wed,September 12, 2018 02:36 AM

KCR Announce 5 Lakhs Ex Gratia For Kondagttu Bus Mishap Victims

-కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోరప్రమాదం.. 58 మంది దుర్మరణం
-అదుపుతప్పి లోయలో పడిన బస్సు
-అంజన్న సన్నిధి నుంచి అనంత లోకాలకు..
-జనసంద్రమైన జగిత్యాల ఏరియా దవాఖాన
-ఎటు చూసినా మృతదేహాలే.. బంధువుల రోదనలే..
-రాష్ట్రపతి.. ప్రధాని.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
-మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
-ఆర్టీసీ తరఫున రూ.3లక్షలు పరిహారం
-దవాఖానలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన మంత్రి ఈటల
-క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీలు కవిత, పొంగులేటి
-జగిత్యాల ఆర్టీసీ డిపోమేనేజర్‌పై సస్పెన్షన్‌వేటు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మంగళవారం.. హనుమంతుడికి అత్యంత ఇష్టమైన రోజు.. అందులోనూ పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు.. అంజన్నను దర్శించుకొనేందుకు వచ్చేవారు.. దర్శనం చేసుకొని వెళ్లేవారితో కొండగట్టు కిటకిటలాడుతున్నది. అంతలోనే మహా విషాదం.. శనివారంపేట నుంచి జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అప్పటిదాకా సందడిగా ఉన్న కొండగట్టు అంతటా ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. కండ్ల ముందరే బస్సు పల్టీలు కొడుతూ లోయలోకి పడిపోవడం ప్రత్యక్షంగా చూసినవాళ్ల గుండెల్లో దడ పుట్టించింది. క్షణాల్లో 58 మంది విగతజీవులయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. కొండగట్టు మునుపెన్నడూ జరుగని విషాదంతో యావత్‌రాష్ట్రం నివ్వెరపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ సహా పలువురు సంతాపం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు సహాయచర్యలు సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ పక్షాన మరో రూ.3లక్షలు పరిహారం ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన జరిగిన వివరాలను మంత్రి కేటీఆర్, కవిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
BUS

సామర్థ్యానికి మించిన ప్రయాణం

మంగళవారం ఉదయం 10.30 గంటలకు శనివారంపేటనుంచి జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 2319) 11.05 గంటలకు కొండగట్టు ప్రాంతానికి చేరుకుం ది. కొండగట్టుకు చేరుకొనేసరికే బస్సు దాదాపుగా పూర్తి సామర్థ్యంతో ఉన్నది. కొండగట్టు దగ్గర భక్తులు అధికంగా ఉండటంతో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో ఎక్కారు. దాదాపు 100 మంది ప్రయాణికులతో ఘాట్‌రోడ్డు మీదుగా జగిత్యాలకు బయలుదేరిన బస్సు మొదటిమూల మలుపు వద్ద ఉన్న స్పీడ్‌బ్రేకర్ దగ్గర జంప్ కావడంతో బ్రేకులు ఫెయిలయ్యాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్ శ్రీనివాస్ అప్రమత్తమయ్యాడు. కొండనుంచి దిగువకు రావడం, వందురు అధికంగా ఉండటంతో బస్సు పూర్తిగా అదుపుతప్పింది. బస్సు ఊగిసలాడుతుండటాన్ని గమనించిన దుకాణదారులు పెద్దఎత్తున అరుస్తూ ఓ పక్కకు తీసుకోవాలని డ్రైవర్‌కు సూచించారు. బస్సును అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం వృథా కాగా, వేగంగా దిగువకు రావడం ఆరంభమైంది. ఘాట్‌రోడ్డు పక్కన రెండు మూడు ఆటోలను తప్పించిన డ్రైవర్ చివరి మూలమలుపు వరకు తీసుకురాగలిగాడు.
ktrrao
కానీ అదుపుచేయడం సాధ్యంకాలేదు. అక్కడ నిలిపి ఉంచిన టాటా ఆటోను ఢీకొట్టి.. దాని వెంటనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి.. కుడివైపున ఉన్న లోయలోకి జారిపోయింది. దాదాపు ఇరవై మీటర్ల లోతులో ఉన్న లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది.

హృదయ విదారకంగా ఘటనాస్థలం

బస్సు లోయలో పడిపోగానే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే లోయలోకి దిగి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. మూడునాలుగు పల్టీలు కొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసం కావడం.. ప్రయాణికులు గుట్టలా ఒకరిపై ఒకరు పడిపోవడంతో హృదయవిదారకమైన వాతావరణం నెలకొంది. జగిత్యాల ఎస్పీ సింధుశర్మ, జిల్లా కలెక్టర్ శరత్, ఆర్డీవో నరేందర్, కొండగట్టు ఉద్యోగులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయచర్యల్లో పాల్గొన్నారు. ఎస్పీ, కలెక్టర్లు స్వయంగా బస్సులోకి వెళ్లి ఒక్కొక్కరినీ బయటకు తీస్తూ.. ప్రాణాలతో ఉన్నవారిని వెంటవెంటనే అందుబాటులో ఉన్న వాహనాల్లో జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. లోయపైకి చేరుస్తుండగానే కొందరు ప్రాణాలు విడిచారు.. మరికొందరు దవాఖానకు చేర్చాక తుదిశ్వాస విడిచారు. బాధితుల బంధువులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలంలోనే 25 మంది మృతిచెందినట్టు అధికారులు నిర్ధారించారు. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 44కు చేరుకుంది. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించాడు. కరీంనగర్ దవాఖానకు తరలించినవారిలో మరో పదిమంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. సాయంకాలానికి మొత్తం మృతుల సంఖ్య 58కు చేరుకుంది. మృతులంతా కొడిమ్యాల మండలం శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, సండ్రల్లపల్లి, కోనాపూర్, రాంసాగర్ డబ్బు తిమ్మయ్యపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు చెందినవారు. ఘటనాస్థలి ఈ గ్రామాలకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి స్వగ్రామాలకు తరలించారు.
Death

క్షత గాత్రులకు మెరుగైన వైద్యం

కొండగట్టుఘాట్ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు జగిత్యాల వైద్యశాలకు మూడు వైద్యబృందాలను పంపినట్టు తెలిపారు. అదేవిధంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యశాలల్లో సేవలు అందించేలా అధికారులను అప్రమత్తం చేశామన్నారు.

కన్నీరు పెట్టిన కవిత.. చెమ్మగిల్లిన కండ్లతో ఈటల

చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, చావు బతుకుల మధ్య అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రులు, అయిన వారిని పోగొట్టుకొని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న వందల మందిని చూసి ఎంపీ కవిత చలించిపోయి కన్నీరు పెట్టుకొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెమ్మగిల్లిన కండ్లతోనే మూడుగంటలపాటు దవాఖానలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకొన్న మంత్రి కేటీఆర్ గంభీరంగా మారిపోయారు. రోదిస్తున్న మృతుల కుటుంబసభ్యులను దగ్గరికి తీసుకొని ఓదార్చుతూనే, తాము రోదించడం కలిచివేసింది. దవాఖాన ప్రధాన పర్యవేక్షకుడి గదిలోకి వెళ్లిన మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితిని చూసి ఒకింత ఉద్వేగానికి, భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడి పరిస్థితిని, ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. రాంసాగర్ గ్రామానికి చెందిన మృతుల కుటుంబసభ్యురాలైన లక్ష్మిని ఎంపీ కవిత దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఎంపీ కవిత దగ్గరకు వచ్చి అక్కున చేర్చుకోవడంతో లక్ష్మి బిగ్గరగా రోదించింది. లక్ష్మిని ఓదార్చుతూనే ఎంపీ కవిత తాను సైతం రోదించారు. కుటుంబసభ్యురాలిని కోల్పోయిన సంతోష్‌ను దగ్గరికి తీసుకొని మంత్రి కేటీఆర్ ఓదార్చారు. మృతదేహాలు.. నలభైకి పైగా ఉండగా, స్థలం చిన్నగా ఉండటంతో అక్కడే మృతుల కుటుంబ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు.. మృతదేహాలపై నుండే తిరుగుతూ ఉండటాన్ని గమనించిన మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. దుర్ఘటనలో వారు విగతజీవులయ్యారు. ఇప్పటికే వారి కుటుంబాలు ఆవేదనలో ఉన్నాయి.. మీరు ఇలా మృతదేహాలను తొక్కవచ్చునా..ఇదేమి పద్ధతి.. కాస్త్త దయతో వ్యవహరించండి.. వారి కుటుంబసభ్యులను గురించి ఆలోచించండి అంటూ వ్యాఖ్యానించారు.
Sites

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జగిత్యాల ఏరియా దవాఖానలో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమైనదని చెప్పారు. జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ పారుపెల్లి హన్మంతరావును సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జగిత్యాల ఏరియా దవాఖానలో ఆయన మాట్లాడుతూ, సంఘటనకు తక్షణ బాధ్యుడిగా డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేస్తున్నామని, సంఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామన్నారు. కొండగట్టు బస్సు దుర్ఘటనపై మల్యాల సీఐ నాగేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి

కొండగట్టు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్న నమ్మకం ఉందని రాష్ట్రపతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
MP-KAVITHA

మాటల్లో చెప్పలేని విషాదం-ప్రధాని

కొండగట్టు ప్రమాదం మాటల్లో చెప్పలేని విషాదం.. తీవ్ర బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకర మని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.

దురదృష్టకరం: గవర్నర్ నరసింహన్

కొండగట్టు రోడ్డు ప్రమాదంలో 50 మందికి పైగా మరణించడం దురదృష్టకరమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. బాధితులకు సత్వర సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

అత్యంత బాధాకరం: సీఎం కేసీఆర్

కొండగట్టు ప్రమాదం అత్యంత బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అం డగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభు త్వ ఖర్చులతో వైద్యసేవలందిస్తామని ప్రకటించారు.

దురదృష్టకరం: రాహుల్‌గాంధీ

కొండగట్టు ప్రమాదం దురదృష్టకరమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బాధిత కుటుంబాలకు సహాయం అందించాలన్నారు.

బాధాకరం: మంత్రులు

ప్రమాదంపై మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదం గుండెలను పిండే సేలా ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
Wife

మృతుల వివరాలు

శనివారంపేట: నామాల మౌనిక (23), చెర్ల లక్ష్మి (45), గోలి అమ్మాయి (44), పోలు లక్ష్మి (50), ఎండ్రిక్కాయల ఎంకవ్వ (55), కుంబాల సునంద (45), సలేంద్ర వరలక్ష్మి (28), చెర్ల గంగయ్య (75), ఎండ్రిక్కాయల సుమ (30) , గుడిసె రాజవ్వ (55), గాజుల శ్రీహర్ష (2), గోలి రాజమల్లు (60). హిమ్మత్‌రావుపేట: పోలు లక్ష్మి (50), లంబ కిష్టయ్య (65), మల్యాల అనిల్ (19), గండి లక్ష్మి (60), పందిరి సత్తవ్వ (75), నేదునూరి మదునవ్వ (70), కొండ అరుణ్ సాయి (5), వేముల భాగ్యవ్వ (50), పడిగెల స్నేహలత (22), ఆరె మల్లయ్య (70). రాంపల్లి (పెద్దపల్లి జిల్లా): బోంగోని మధునయ్య (55), బొంగోని భూమక్క (55), బొంగోని రాంచరణ్ (9). డబ్బుతిమ్మాయపల్లి: డబ్బు అమ్మాయి (50), లైశెట్టి చంద్రకళ (45) , ర్యాగల రాజవ్వ (50), గాజుల చిన్నయ్య(60), పిడుగు రాజిరెడ్డి (55), గోల్కొండ లచ్చవ్వ (51), గోల్కొండ దేవయ్య (63), పుండ్ర లలిత (36). తిర్మలాపూర్: ప్పర్తి వెంకటరత్నమ్మ (56), శ్యామకూర మల్లవ్వ (38), దాసరి సుశీల (55), సోమిడి పుష్ప (45), తైదల పుష్ప (40). రాంసాగర్: బైరి రిత్విక (3), బండపెల్లి చిలుకవ్వ (70), ద్యాగల ఆనందం (55), చెర్ల హేమ (30), తిర్మని ముత్తయ్య (60), మేడిచెల్మెల రాజేశం (70), చెర్ల మౌనిక (24), మేడిచెల్మెల గౌరి (48), ద్యాగల స్వామి (32). కోనాపూర్: ఉత్తం నందిని (2), ఉత్తమ్ భూలక్ష్మి (40). తిమ్మాయపల్లి: వొడ్నాల లస్మవ్వ (48), వొడ్నాల కాశీరాం (55). సండ్రల్లపల్లి: కంకనాల ఎల్లవ్వ (70). ముత్యంపేట: బందం లస్మమ్మ (65). చేగుర్తి (కరీంనగర్ జిల్లా): బాలుసాని రాజేశ్వరి (40). జగిత్యాల: చిర్ర పూజిత (15). కరీంనగర్: డ్రైవర్ శ్రీనివాస్ (53). మల్యాల: పోతుగంటి జ్యోత్స్న (27).

8867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles