ప్రతి ఓటూ విలువైనదే


Fri,December 7, 2018 02:37 AM

KCR Alerts Party Candidates Over Elections

-అప్రమత్తంగా ఉండండి అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతి ఓటూ విలువైనదేనని.. ఓటింగ్ సమయంలో అభ్యర్థులందరు అప్రమత్తంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఇన్నాళ్ల ప్రచారం ఒక ఎత్తు.. పోలింగ్‌రోజు ఒక ఎత్తని చెప్పారు. గురువారం పలువురు పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నియోజకవర్గాల్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలను తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి పలు సూచనలిచ్చారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్నదని, బ్రహ్మాండమైన మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. బహిరంగసభలకు వచ్చిన స్పందన ద్వారా టీఆర్‌ఎస్ వందకుపైగా స్థానాల్లో గెలువబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు టీఆర్‌ఎస్‌పై నమ్మకం, విశ్వాసం ఉంచారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందన్నారు. ఓటింగ్‌రోజున ముందుగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఇతర పథకాల లబ్ధిదారులు ఓటువేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

ఆ తర్వాత తటస్థులు.. ఇలా ఒక్కొక్క క్యాటగిరీవారీగా ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఓటర్లు నివాసం గుర్తించి వారంతా ఓటువేసేలా చూడాలని సూచించారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులను సమన్వయంచేయడానికి బాధ్యతాయుతమైనవారిని నియమించి ఎప్పుటికప్పుడు సమాచారం సేకరించి, సలహా లు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రత్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం లాంటి వాటిపై ఎన్నికల సంఘానికి, రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని సూచించారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, యాదవులకు గొర్రెలు, కేసీఆర్ కిట్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రజాదరణను చూరగొన్నాయని తెలిపారు. మూడు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారానికి కావాల్సినంతగా సమయం దొరికింది. కొందరు అభ్యర్థులైతే మూడుసార్లు కూడా ప్రచారంచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉత్సాహంగా ఓటువేయడానికి ముందుకొస్తున్నారు. పట్టణాల్లో ఉపాధికోసం పోయినవారు సైతం గ్రామాల్లోకి వస్తున్నారు. వారందరిచేత ఓటు వేయించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన సభల ద్వారా టీఆర్‌ఎస్‌కు మరింత ఊపు పెరిగింది.

1786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles