ప్రజలు గెలువాలి.. గెలిచి నిలువాలి


Fri,December 7, 2018 03:39 AM

Kaloji Narayana Rao had reacted seriously on peoples war

ఎన్నికలు వస్తయి.. పోతయి. పార్టీలు, అభ్యర్థులు పోటీలో నిలబడతారు. భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ప్రజాస్వామ్యంలో నిజమైన స్ఫూర్తి వస్తే ఎన్నికల్లో గెలువాల్సింది నాయకులు, పార్టీలు, అభ్యర్థులు కాదు. ప్రజలు గెలువాలి. ప్రజలు గెలిచినప్పుడే వారి ఎజెండా అమలవుతుంది. వారి ఆకాంక్షలు నెరవేరుతాయి.
- కే చంద్రశేఖర్‌రావు, సీఎం

ఓటిచ్చేప్పుడే ఉండాలి బుద్ధి.. అనుచుంటి ఈ మాట అనుభవం కొద్దీ అన్నాడు ప్రజాకవి కాళోజీ.. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పీపుల్స్‌వార్ జనగామశాఖ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఓట్లేసిన మొదటి ఐదుగురి చేతి వేళ్లను నరికేస్తామని బెదిరించింది. ఆనాడు కాళోజీ నారాయణరావు తీవ్రంగా స్పందించారు. నేనే మొదట ఓటేస్తానంటూ వచ్చి ఓటేశారు. కాళోజీ అంతటి ధిక్కార పురుషుడే ముందుకు వచ్చి ఓటేయడంతో పీపుల్స్‌వార్ ఆయనకు క్షమాపణ చెప్పుకున్నది. ఇది చరిత్ర. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. వేసే ప్రతి ఓటూ ఐదేండ్లపాటు మన భవిష్యత్‌ను తిరగరాస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మిగతా రాష్ర్టాలతో పోలిస్తే చాలా భిన్నమైనవి. నాలుగున్నరేండ్ల కిందట పునర్జన్మ ఎత్తిన రాష్ట్రమిది. ఆరున్నర దశాబ్దాలపాటు విధ్వంసమైన అన్ని రంగాలకూ ఒక్కటొక్కటిగా పునఃప్రాణం పోస్తూ ముందుకు సాగాల్సిన తరుణమిది. అన్నేండ్ల పరిపాలన సృష్టించిన సంక్షోభం కారణంగానే పుట్టిన ఉద్య మం సాధించిన ఫలితం తెలంగాణ. రాష్ట్ర ఏర్పాటు తర్వా త ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఆకాంక్షలున్నాయి.. ఎన్నెన్నో అనుమానాలున్నాయి. పరిపాలన ఎలా కొనసాగుతుందోనన్న సందిగ్ధం వెన్నాడింది. నాలుగున్నరేండ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం బజారుకు వెళ్లి ఒక కుండను కొనాలనుకుంటాం. దానిపై వేలితో కొట్టి నాణ్యమైందా? కాదా అని చూసి మరీ కొంటాం. మార్కెట్‌కు వెళ్లి ఆనపకాయ కొనాలనుకుంటే, లేతదా ముదురుదా అని చూసి మరీ కొంటాం. ప్యాకేజ్డ్ ఫుడ్ అయితే ఎక్స్‌పైరీ డేట్ చూడకుండా కొనుక్కోము. మరి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి?

తెలంగాణ ఏర్పడిన పునాది నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదం. మనది ప్రధానంగా వ్యవసాయ, సంప్రదాయ వృత్తి ఆధార రాష్ట్రం. ఆరున్నర దశాబ్దాలపాటు చెరువులు పూడిపోయి, పొలాలు పడావుపడి.. తలాపున నదు లు పారుతున్నా ఒకటికి పది బోర్లు వేసినా నీళ్లు రాక అల్లాడిపోయిన రాష్ట్రం.. కాస్తోకూస్తో తడి వస్తే అందులోనే మోటరు పెట్టి నీళ్లు లాగుదామనుకుంటే కరంటు లేక.. రాత్రి పూట అరకొరగా వచ్చే కరంటుతో.. షాకులు కొట్టి.. మృత్యువాత పడిన అన్నదాతల వెతలు తీర్చేనాథుడు లేక నీరసపడిన రాష్ట్రంలో ఇందుకు సంబంధించిన సమస్యలు ఏ మేరకు తీరాయి అని ప్రతి ఒక్క ఓటరు ఆలోచించాల్సిన తరుణమిది. కరంటు బాగుపడిందా? కరంటు కష్టాలు తీరినయా? చెరువులు నిండినయా? కాల్వల్లోకి నీళ్లు వస్తున్నాయా? భూగర్భ జలాలు ఏమైనా పెరిగాయా? అన్న అంశాలపై నిర్ణయానికి రావాల్సిన సమయం. మీది పీఠభూమి.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా నీళ్లు రావడం సాధ్యం కాదు అన్న మాటలు వినీ వినీ విసుగెత్తిపోయినం. రాష్ట్రం వచ్చింది. వాళ్లన్న ఆ మాటలే నిజమా? లేక తెలంగాణ బీడు భూములను సాగునీటితో తడిపేందుకు ఈ నాలుగున్నరేండ్లలో ఏదైనా కృషి జరిగిందా? ఎంతవరకు ప్రగతి సాధించాం? అన్నది ఆలోచించుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నట్టు తెలంగాణ ప్రజలు మనుగడ సాధించలేరు. తెలంగాణ ప్రజలకు మట్టి కూడా మనుగడలో భాగమే. ఆ మట్టిని మాగాణం చేసేందుకు చిత్తశుద్ధితో ఏ రకమైన ప్రయత్నాలు జరిగాయి? అన్నది ప్రధానంగా దృష్టి సారించాల్సిన విషయం. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి? ఆటంకాలు ఏర్పడితే ఎలా ఏర్పడ్డాయి? అందుకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని కూడా ఆలోచించాల్సిన తరుణమిది. వ్యవసాయరంగానికి తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం ఏమేరకు జరిగింది? ఈ విషయంలో ఏ మేరకు విజయాన్ని సాధించారనేది బేరీజు వేయాలి.

kcr-vote2
కుల వృత్తుల గురించి కూడా చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది. కులవృత్తుల సాటిలేదు గువ్వలచెన్నా అని కవులు పాడుకున్నవాళ్లే. వృత్తుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమాలే నడిచాయి. వృత్తుల విధ్వంసం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతగా ఛిన్నాభిన్నమైందో కమ్యూనిస్టు మేధావులకు, ప్రజాసంఘాలకు తెలియందేమీ కాదు. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మోసిన ఈ మేధావులు.. ప్రజాసంఘాలు ఆధునిక పద్ధతుల్లో కుల వృత్తులను ప్రోత్సహించాలని ఆకాంక్షించిన వారే.. ఉద్యమించిన వారే. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఈ దిశగా జరిగిన ప్రయత్నాలేమిటి? కుల వృత్తులకు ఆధునిక రీతిలో పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి జరిగిందా లేదా? అన్నది ఆలోచించాలి. అర్బన్ ఎకానమీకి సమాంతరంగా రూరల్ ఎకానమీని పెంపొందించడానికి నిబద్ధతతో ఎలాంటి ప్రయత్నం జరిగిందనేది ఆలోచించాలి. కులవృత్తుల అభివృద్ధి ద్వారా సంపదను పెంచే నిర్మాణాత్మక ప్రయత్నం ఏమేరకు జరిగిందనేది విశ్లేషించుకోవాలి. ఇదే సమయంలో గ్లోబల్ ఎకానమీతో పోటీ పడుతూ అర్బన్ ఎకానమీని, పారిశ్రామికీకరణ పట్ల పాలకులు ఏ మేరకు దృష్టి సారించారనేది ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ మరో నినాదమైన ఉపాధి కల్పనకు ముఖ్యంగా చేపట్టాల్సిన చర్య ఇది. ప్రభుత్వరంగంతోపాటు.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పన అవకాశాలను పెంపొందించేందుకు జరిగిన ప్రయత్నమేమిటన్నది కచ్చితంగా ఆలోచించాలి. సమాచార సాంకేతిక రంగం, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర పరిశ్రమల విషయంలో తెలంగాణ ఏ మేరకు పురోగతి సాధించిందనేది పరిగణనలోకి తీసుకోవాలి.

అన్నింటికీ మించి సంక్షేమ రంగం. తెలంగాణలో ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటుచేసినా ప్రధానంగా దృష్టి సారించాల్సింది ఈ రంగంపైనే. ఎందుకంటే తెలంగాణలో సంపన్నవర్గం కంటే.. వెనుకబడిన వర్గం జనాభానే ఎక్కువ. కుల, మత, జాతి భేదం లేకుండా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన సబ్బండ వర్ణాలకు పాలకవర్గం ఏ మేరకు మేలు చేసింది అన్నది కచ్చితంగా ఆలోచించాలి. పింఛన్లు కానీ, వేతనాలు కానీ, ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్య సంబంధమైన సౌకర్యాలు కానీ బాగుపడ్డాయా? లేదా? అన్న అంశాలు ప్రతి ఒక్కరి అనుభవంలోనే ఉంటాయి. వీటితోపాటు పరిపాలనలో పారదర్శకత ఏ మేరకు ఉన్నది? గతంలో ప్రభుత్వం దగ్గరకు ఒక పనికోసం వెళ్లాలంటే ఎంతదూరం వెళ్లాల్సి వచ్చేది? ఎన్ని ఇబ్బందులు పడేది? ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా? లేదా? అన్నది ఆలోచించాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త జిల్లాలు వచ్చాయి. మండలాలు వచ్చాయి. గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటి వల్ల పరిపాలనాపరంగా జరిగిన లాభమేమిటన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. స్థానికంగా అభ్యర్థి చేసే పనులు అతణ్ణి నడిపించే నాయకుడి దక్షత, దార్శనికతపైనే ఆధారపడి ఉంటాయి. ఆ నాయకుడు ఎవరన్నది విచక్షణతో ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ వస్తారు. జాతీయ నాయకులు వస్తారు. పొరుగు రాష్ర్టాల నాయకులూ వస్తారు. అనేక అంశాలు చెప్తారు. వాగ్దానాలు చేస్తారు. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తారు. మీడియా ద్వారా ప్రచారమూ చేస్తారు. ఓటరు మాత్రం విచక్షణతో ఆలోచించి ఒక అభిప్రాయానికి రావాల్సిఉంటుంది. ఇందులో రహస్యంగా ఉండాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కటీ మనకు కండ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. మంచైనా, చెడైనా ఆ కనిపించిందే తార్కా ణం. దాని ఆధారంగానే మనకు మేలు చేసే నాయకుడు ఎవరన్నది గుర్తించాలి. మన కలలు సాకారం చేసే పాలకుడిని ఎం చుకోవాలి. అందుకే మరోసారి కాళోజీ మాట. ఓటిచ్చేప్పుడే ఉండాలి బుద్ధి.. అనుచుంటి ఆ మాట అనుభవం కొద్ది.
-కోవెల సంతోష్‌కుమార్

2074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles