తపాస్‌పల్లికి కాళేశ్వరం జలాలు

Mon,November 11, 2019 02:23 AM

-మల్లన్నసాగర్ ద్వారా తరలింపునకు కసరత్తు
-రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసిన నీటిపారుదల శాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ద్వారా గోదావరిజలాలను సాధ్యమైనంత ఎక్కువమేర వినియోగించుకోవాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ మరో ప్రతిపాదన సిద్ధంచేసింది. ఇప్పటికే ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుకు జీవం పోసేందుకు తుపాకులగూడెం బరాజ్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు దేవాదుల చివరి భూములకు సైతం కాళేశ్వరం జలాలను పుష్కలంగా అందించేందుకు తాజాగా కసరత్తు మొదలుపెట్టింది. దేవాదుల ప్రాజెక్టు కింద 6.25 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. కానీ గత డిజైన్ ప్రకారమైతే.. ఇన్‌టేక్ పాయింట్ వద్ద నీటి లభ్యత లేకపోగా, కేవలం నాలుగు టీఎంసీలు నిల్వచేసే రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో దేవాదుల ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా తయారయింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రీడిజైనింగ్‌లో భాగంగా దేవాదులకు జీవం పోసేందుకుగాను తుపాకులగూడెం బరాజ్ నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో 365 రోజుల పాటు దేవాదుల ఇన్‌టేక్ పాయింట్ వద్ద నీటి లభ్యత ఉండి, ప్రాజెక్టు మనుగడ సాఫీగా సాగుతున్నది. గతంలో దేవాదుల ప్రాజెక్టు డిజైన్‌లో భాగంగానే తపాసుపల్లి రిజర్వాయర్‌కు కూడా నీటిని తరలించి సుమారు 83వేల ఎకరాలు, సమీపంలోని చెరువులను నింపడం ద్వారా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకుగాను దేవాదుల ఇన్‌టేక్ పాయింట్ నుంచి ఏకంగా 187 కిలోమీటర్ల దూరంలో.. అందునా 465 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేయాల్సి రావడంతో చివరి భూములకు సాగునీరు అందడం కష్టసాధ్యంగా మారుతున్నది. ఇలాకాకుండా కాళేశ్వరం ద్వారా తపాసుపల్లి రిజర్వాయర్‌కు నీరందించేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు.

రెండు ప్రతిపాదనలు సిద్ధం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా తపాసుపల్లికి నీరందించేందుకు నీటిపారుదలశాఖ రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్ నుంచి పది కిలోమీటర్ల భూమ్యాకర్షణ కాల్వ ద్వారా దాదాపు పది టీఎంసీల వరకు నీటిని తరలించాలనేది మొదటి ప్రతిపాదన. ఇందుకు సుమారు రూ.వంద కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు అంచనా రూపొందించారు. 50 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఉండే మల్లన్నసాగర్ జలాశయంలో కనిష్ఠంగా 30 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ ఉన్నపుడే ఈ భూమ్యాకర్షణ కాల్వ ద్వారా నీటిని తరలించడం సాధ్యమవుతుంది. ఇలాకాకుండా తక్కువ స్థాయి నిల్వ ఉన్నపుడు కూడా తరలించేందుకుగాను మరో ప్రతిపాదన రూపొందించారు. ప్రెషర్ మెయిన్స్ ఏర్పాటు చేయడం ద్వారా మల్లన్నసాగర్‌లో 12 టీఎంసీల నిల్వ ఉన్నప్పటికీ తపాసుపల్లికి నీటిని తరలించేందుకు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇందుకు సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమయింది.

138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles