రికార్డుల కాళేశ్వరం


Mon,April 16, 2018 03:38 AM

Kaleshwaram sets new record in concrete use

ఒక్కరోజులో 7000 క్యూబిక్ మీటర్లు
-మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో కాంక్రీట్ పనులు వేగవంతం
-ఆసియాలోనే సరికొత్త చరిత్ర ..అన్ని ప్రక్రియల్లోనూ అదే తీరు
-సీఎం కేసీఆర్ పరిశీలన తర్వాత మరింత ఊపందుకున్న పనులు
-నిర్మాణరంగంలో అనూహ్య రికార్డులపై మంత్రి హరీశ్‌రావు సంతోషం
-నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు
-ఇదే పట్టుదల, వేగాన్ని మిగిలిన పనుల్లోనూ కొనసాగించాలని సూచన

Kaleshwaram
హైదరాబాద్/ జయశంకర్ జిల్లా ప్రతినిధి - నమస్తే తెలంగాణ: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రికార్డుల మోత మోగిస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కే తలమానికంగా ఉన్న ఈ ప్రాజెక్టు ఆదినుంచీ అనూహ్యరీతిలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక రికార్డులను సాధించిన కాళేశ్వరం.. తాజాగా నిర్మాణరంగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో భాగంగా శనివారం ఒక్కరోజే (24 గంటల్లో) ఏడువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఇది ఆసియాలోనే రికార్డు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలకు ఈ పరిణామం తార్కాణంగా నిలిచింది. సుమారు 37లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసినప్పటి నుంచి.. భూసేకరణ మొదలుకుని బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్, సర్జ్‌పూల్, టన్నెల్ పనుల వరకు నిర్మాణరంగంలో ఈ ప్రాజెక్టు చరిత్ర సృష్టిస్తున్నది.

గత ఏడాది డిసెంబర్‌లో పర్యటన సందర్భంగా సీఎం చేసిన దిశానిర్దేశం దరిమిలా అటు నీటిపారుదలశాఖ, ఇటు నిర్మాణసంస్థలు కార్యాచరణ రూపొందించడంతోనే ఇది సాధ్యమైందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఒక్కరోజులోనే గోదావరిపై నిర్మిస్తున్న మూడు బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణంలో భాగంగా 17,656 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పని జరిగింది. అందులో 1,31,775 బస్తాల సిమెంటును వినియోగించారు. ఇది అసాధారణ విషయం. ఊహించేందుకు కూడా సాధ్యంకానంత స్థాయిలో పనుల వేగం కొనసాగుతున్నట్టు స్పష్టమవుతున్నది. ప్రాజెక్టు పనుల్లో రికార్డులు నమోదు చేస్తుండటంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే పట్టుదల, వేగంతో మిగిలిన పనులను కూడా పూర్తిచేయాలని నీటిపారుదలశాఖ యంత్రాంగం, కాంట్రాక్టు సంస్థల వెన్నుతట్టారు. ఈ ప్రాజెక్టులో రోజుకు మూడు టీఎంసీలను లిఫ్టు చేస్తేనే సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుందన్నారు.

ఆదినుంచీ అదే తీరు.. సీఎం పట్టుదలకు నిదర్శనం

పద్నాలుగు జిల్లాల పరిధిలో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆదినుంచీ వేగంగా కొనసాగుతున్నాయి. ఈ వానకాలంలో కచ్చితంగా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను మిడ్ మానేరుకు తరలించాలనే కృతనిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్ తదనుగుణంగా పనులు జరిగేలా సూచనలు చేస్తూ వస్తున్నారు. తాజా ఫలితం ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ డిసెంబర్ 7, 8 తేదీల్లో సందర్శించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో చేపట్టిన బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్, సర్జ్‌పూల్, టన్నెల్ నిర్మాణ పనులను వరుసగా రెండురోజులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తన పర్యటనలో ఆయన తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌ను డిసెంబర్ 7వ తేదీన సందర్శించారు. ఇక్కడ తెలంగాణ, మహారాష్ట్ర వైపు జరుగుతున్న బరాజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత ఇదే మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌజ్, అన్నారం బరాజ్, కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్‌ను సందర్శించారు. అనంతరం పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని సుందిళ్ల బరాజ్, సిరిపురం, గోలివాడ పంప్‌హౌజ్‌లు, 6, 7, 8వ ప్యాకేజీల్లో సర్జ్‌పూల్, టన్నెల్ పనులను కూడా చూశారు. బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్, సర్జ్‌పూల్, టన్నెల్ నిర్మాణపనుల పురోగతిని సాగునీటిశాఖ ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించారు. ఈ పనుల్లో వేగం పెంచేందుకు ఆయన దిశానిర్దేశం చేశారు. వచ్చే వానకాలంకల్లా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి వానకాలంలో రైతులకు సాగునీరు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే వానకాలం వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి బరాజ్‌కు ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించేందుకు మేడిగడ్డ బరాజ్‌లో రోజుకు సగటున ఏడువేల క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ పనులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువు ప్రకారం పనులు జరగకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని కూడా అన్నారు. దీంతో సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. భూసేకరణ, మట్టి తవ్వకాలు, సిమెంటు కాంక్రీట్ పనుల్లో వేగం పెరిగింది. నాలుగునెలల వ్యవధిలోనే పనుల పురోగతి అందరు ఆశ్చర్యపడేలా చేస్తున్నది. రోజుకు ఏడువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరగాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని శనివారం సాధించినట్టు మేడిగడ్డ బరాజ్‌ను నిర్మిస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, సలహాలు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, సమీక్షల కారణంగానే ఈ అసాధారణ రికార్డు సాధించినట్టు పేర్కొంది.
HarishraoKaleshwaram

పనుల ప్రగతి ఇలా..

ముఖ్యమంత్రి పర్యటించిన సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్‌లో రోజుకు సగటున 1,169 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. ఆ తర్వాత పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక, వివిధ శాఖలు, అధికారుల మధ్య సమన్వయం, ఇంజినీర్లు, కార్మికుల సంఖ్య పెంపుదల, అవసరమైన యంత్ర పరికరాలు సమకూర్చుకోవటం వంటి చర్యలతో రోజుకు సగటున ఈ బరాజ్‌లో ఏడువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల అసాధారణ రికార్డును తెలంగాణ సాగునీటిశాఖ సొంతం చేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మేడిగడ్డ బరాజ్‌లో 7,139 క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ పనులు జరిగాయి. ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కాంక్రీట్ పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణరంగ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యమంత్రి మేడిగడ్డకు వచ్చివెళ్లిన రోజునుంచి ఈ బరాజ్‌లో ఇప్పటివరకు మొత్తం 5,39,361 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. సీఎం కేసీఆర్ పర్యటన రోజు వరకు ఈ బరాజ్‌లో 77,946 క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ పనులు మాత్రమే జరగటం గమనార్హం. ఆయన మేడిగడ్డను సందర్శించిన సమయంలో 4 బ్యాచింగ్ ప్లాంట్లను వినియోగించిన ఏజెన్సీ ప్రతినిధులు ఇప్పుడు వాటి సంఖ్యను ఎనిమిదికి పెంచారు. దీంతో ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ల సామర్థ్యం 390 నుంచి 870 క్యూబిక్ మీటర్లకు పెరిగింది. బూంప్లేసర్ల సంఖ్యను 3 నుంచి అనూహ్యంగా 12కు పెంచారు. కార్మికుల సంఖ్య 1,245 నుంచి 3,065కు పెరిగింది. ఇంజినీర్ల సంఖ్య 113 నుంచి 162కు చేరింది. ట్రాన్సిట్ మిక్సర్ల సంఖ్య 25 నుంచి 85కు పెరిగింది.

అంతటా వేగం

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రతీచోటా వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన మూడు బరాజ్‌లు, మూడు పంప్‌హౌజ్‌లతోపాటు కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్, 6,7,8వ ప్యాకేజీల్లో ప్రతీరోజు 20,447 క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ పనులు జరుగుతున్నట్టు సాగునీటిశాఖ ఇంజినీర్లు వెల్లడించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ ప్రాజెక్టులో జరిగిన సిమెంటు కాంక్రీట్ పనులను పరిశీలిస్తే మేడిగడ్డ బరాజ్‌లో 7,139, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో 1,739, అన్నారం బరాజ్‌లో 3,215, సిరిపురం పంప్‌హౌజ్‌లో 838, సుందిళ్ల బరాజ్‌లో 3,076, గోలివాడ పంప్‌హౌజ్‌లో 1,602, కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్‌లో 762, ఆరో ప్యాకేజీలో 707, ఏడో ప్యాకేజీలో 720, ఎనిమిదో ప్యాకేజీలో 592 క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ పనులు జరగటం విశేషం. కొద్దిరోజుల క్రితం కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్, ఇరిగేషన్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) చీఫ్ ఇంజినీర్ నవీన్‌కుమార్, ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్‌కు చెందిన బీసీ విశ్వకర్మ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లను, కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్, 6,7,8 ప్యాకేజీల్లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యతతో, వేగంగా నిర్మిస్తుండటం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ అభినందించారు.

మూడు టీఎంసీల ఎత్తిపోతతో సీఎం కల సాకారం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఒక్కరోజులో ఏడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో రికార్డు బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ, నీటిపారుదలశాఖ అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. అతి తక్కువకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పనున్నాం. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తయితే సీఎం కల సాకారం అవుతుంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఏజెన్సీలు, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, సిబ్బందికి పేరు పేరునా అభినందనలు. ఇదే పట్టుదల, ఇదే వేగం మిగిలిన పనుల్లోనూ కొనసాగించాలి. నీటిపారుదల, రెవేన్యూ, అటవీ, విద్యుత్తు, గనులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో, సమిష్టిగా పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలి. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ నిర్మాణం.. ఇలా అన్ని రంగాల్లోనూ కాళేశ్వరం కొత్త రికార్డులను తిరగరాస్తుండటం సంతోషం.
- టీ హరీశ్‌రావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి
Kaleshwaram2
-మూడు బరాజ్‌ల నిర్మాణంలో భాగంగా ఒక్కరోజులో 13,430 క్యూబిక్ మీటర్ల పని జరిగింది.
-ఇందుకు 1,00,630 బస్తాల సిమెంటును వాడారు.
-కేవలం మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలోనే 24 గంటల్లో 52,820 సిమెంటు బ్యాగులు వినియోగించారు.
-మూడు పంపుహౌజ్‌ల నిర్మాణంలో భాగంగా ఒక్కరోజులో 4226 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది.
-మొత్తంగా మూడు బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణంలో భాగంగా 17,656 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పని జరిగింది.
-ఇందుకుగాను ఒక్కరోజులోనే 1,31,775 సిమెంటు బ్యాగులు వినియోగించారు.
Kaleshwaram1

7416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS