మానేరుకు కాళేశ్వరం


Sun,August 18, 2019 02:30 AM

Kaleshwaram Project Water Released To Nandi Medaram

-కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు
-నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో నిరంతరంగా నడుస్తున్న మోటర్లు
-మధ్యమానేరుకు తరలుతున్న జలాలు

హైదరాబాద్/ కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నంది (నందిమేడారం), గాయత్రి (లక్ష్మీపూర్) పంప్‌హౌస్‌లలో మోటర్లు నిరంతరంగా నడుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఆరోప్యాకేజీ పెద్దపల్లి జిల్లా నంది పంప్‌హౌస్‌లోని 1, 2, 3 మోటర్ల ద్వారా నంది రిజర్వాయర్‌ను నింపుతున్న అధికారులు, తాజాగా శనివారం ఉదయం 10.30 గంటల నుంచి నంది పంప్‌హౌస్‌లో మూడో మోటర్‌ను ఆఫ్‌చేసి, నాలుగో మోటర్‌ను ఆన్‌చేశారు. ఇక్కడినుంచి వచ్చే నీరు ఏడో ప్యాకేజీ నంది రిజర్వాయర్‌కు చేరుతుండగా, ఎప్పటికప్పుడు ఎనిమిదో ప్యాకేజీ కరీంనగర్ జిల్లా రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. శనివారం ఆరు గేట్లు తెరిచి నీటిని విడుదలచేశారు. గాయత్రి పంప్‌హౌస్‌లో గత ఆదివారం నుంచి రెండు బాహుబలి మోటర్లను విడుతలవారీగా వెట్ ట్రయల్న్ చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐదో మోటర్, రాత్రి 7 గంటల నుంచి నాలుగో మోటర్ నిరంతరంగా నడిపిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నారు. వరదకాల్వ ద్వారా ప్రాజెక్టుకు నీళ్లు చేరుతుండగా, గాయత్రి పంప్‌హౌస్ నుంచి 1.4 టీఎంసీలు వచ్చినట్లు మధ్యమానేరు ఈఈ అశోక్‌కుమార్ చెప్పారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మిడ్‌మానేరు స్లూయిజ్ గేట్ల నుంచి నీటిని వదలగా, శనివారానికి ఎల్‌ఎండీకి స్వల్పంగా వరద వచ్చింది.
godavariwater

గోదావరి వరద తగ్గుముఖం

గోదావరి వరద కొంత తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఒక్కసారిగా గోదావరిలో ప్రవాహం పెరిగిన క్రమంలో పేరూరు దగ్గర తొమ్మిదిన్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగింది. శనివారం ఉదయానికి అది ఏడున్నర లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శుక్రవారం ధవళేశ్వరం దగ్గర మూడున్నర లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైనా.. శుక్రవారం ఎగువన వరద పెరుగటంతో శనివారం ఇన్‌ఫ్లో ఐదున్నర లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అధికారులు అంతేమేర సముద్రంలోకి నీటిని పంపిస్తున్నారు. ఈ నీటిసంవత్సరంలో శనివారం ఉదయం వరకు 1418 టీఎంసీల గోదావరిజలాలు సముద్రంలో కలిశాయి. కాగా ఎగువన ఉన్న గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద వస్తున్నది. శ్రీరాంసాగర్‌కు శనివారం సాయంత్రం ఆరు గంటలకు చుక్క కూడా వరద నమోదుకాలేదు. కడెంకు 1384 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తుండగా.. ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదని అధికారులు పేర్కొన్నారు.

భద్రాద్రి వద్ద తగ్గుతున్న వరద

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ పాల్వంచ రూరల్: భద్రాచలం వద్ద గోదావరిలో నీటిప్రవాహం శనివారం మరింత తగ్గింది. శుక్రవారం రాత్రి 37.9 అడుగుల వద్ద ఉన్న గోదావరి శనివారం ఉదయానికి 32.9 అడుగులకు చేరుకున్నది. క్రమక్రమంగా గంటగంటకు తగ్గుతూ సాయంత్రం 4 గంటల సమయానికి 31.1 అడుగులకు చేరి నిలకడగా ప్రవహిస్తున్నది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు గేట్టు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.
godavariwater1

4332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles