ఎగిసిన గంగమ్మ


Thu,May 16, 2019 02:54 AM

Kaleshwaram Project 3rd and 4th Motor Pump Wet Run Successful

- నాలుగోదారి
-నందిమేడారంలో మూడు, నాలుగో మోటర్ల వెట్న్ విజయవంతం
-నందిమేడారంలో ఇప్పటికే రెండుపంపుల వెట్న్
-ఇక కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఎత్తిపోతకు ఏర్పాట్లు
-ఈ వానకాలంసాగుకు కాళేశ్వరం నీరందించడమే లక్ష్యం
-ప్రారంభించిన కాళేశ్వరం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావ్ దేశ్‌పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ధర్మారం: ఈ వానకాలంలోనే రైతులకు కాళేశ్వరం జలాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం.. బుధవారం మరో కీలకఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారం అండర్ టన్నెల్‌లోని పంప్‌హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే మూడు, నాలుగు మోటర్ల వెట్న్‌న్రు నిర్వహించింది. రెండుమోటర్లు నిర్ణీత సమయంలో నిర్దిష్ట ఆర్పీఎం (రెవల్యూషన్స్ పర్ మినిట్)కు చేరుకొని మేడారం సర్జ్‌పూల్ నుంచి నందిమేడారం రిజర్వాయర్‌లోకి విజయవంతంగా నీటిని ఎత్తిపోశాయి. మూడు, నాలుగు మోటర్ల వెట్న్ సక్సెస్‌కావడంపై కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఇంజినీర్ల బృందం సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.
kaleshwaram0
కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు -2లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఆరో ప్యాకేజీ కింద ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు భూగర్భంలో భారీ పంప్‌హౌస్ నిర్మించిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీరు.. ఆ తర్వాత 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన జంట సొరంగాల ద్వారా నందిమేడారం పంప్‌హౌస్‌లోకి చేరుతుంది. నీటిని మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో 124.4 మెగావాట్ల సా మర్థ్యం ఉన్న ఏడుమోటర్లను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే 4 మోటర్ల బిగింపు పూర్తవగా, మిగిలిన మూడింటి పను లు చివరిదశలో ఉన్నాయి. బిగింపు పూర్తయిన నాలుగు మోటర్లలో గత నెల 24, 25 తేదీల్లో మొదటి, రెండో మోటర్ల వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించిన అధికారులు బుధవారం మూడు, నాలుగు మోటర్ల వెట్న్‌న్రు పూర్తిచేశారు.

మధ్యాహ్నం 12.10 గంటలకు స్విచ్‌ఆన్

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు.. ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్‌తో కలిసి మధ్యాహ్నం 12:10 గంటలకు మూడో మోటర్ ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. నిర్ణీత సమయానికి 200 ఆర్పీఎంకు చేరుకొని నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి నందిమేడారం రిజర్వాయర్‌లోకి 3,200 క్యూసెక్యుల నీటిని ఎత్తిపోసింది. ఈ పంపును 23 నిమిషాలపాటు నడిపించారు. సాయం త్రం 6.40 గంటలకు నాలుగో మోటర్‌ను వెట్న్ నిర్వహించారు. ఈ మోటర్‌కు మొద ట డ్రైరన్, ఆ తర్వాత వెట్న్ నిర్వహించారు. 30 నిమిషాలపాటు పరీక్షించగా.. 3,200 క్యూసెక్కుల నీటిని నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసింది. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఈడీ ప్రభాకర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, నీటిపారుదలశాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ రామారావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇక లింక్-1లో ఎత్తిపోతలకు ఏర్పాట్లు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన లింక్-2లో ఆరో ప్యాకేజీలోని మోటర్ల వెట్న్‌న్రు విజయవంతంగా పూర్తిచేసిన నీటి పారుదలశాఖ అధికారులు.. ఇక లింక్-1లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బరాజ్‌కు అనుబంధంగా ఉన్న కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్ల ద్వారా నీటి ఎత్తిపోత పరీక్షకు ఏర్పాట్లుచేస్తున్నారు. అదేవిధంగా ప్యాకేజీ -7 పనులు పూర్తిచేసి ప్యాకేజీ -8లోని భారీ మోటర్ల ఎత్తిపోతలకు సైతం సిద్ధమవుతున్నారు. మే, జూన్ నెలల్లో లింక్-1, లింక్-2లోని మోటర్లన్నింటినీ సిద్ధం చేసుకొని జూలైలో గోదావరినదిలోకి వచ్చే వరద నీటిని మిడ్‌మానేరుతోపాటు ఎస్సారెస్పీకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వానకాలంలోనే చెరువులు, కుంటలు నింపడంతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 ద్వారా 13లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సర్కార్ సన్నద్ధమవుతున్నది.

ఇరిగేషన్ ఇంజినీర్లకు అభినందనలు

-మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజె క్టు ఆరో ప్యాకేజీలోని నందిమేడారంలో మూడు, నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం విజయవంతంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మోటర్ల వెట్న్ విజయవంతానికి కృషిచేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కాళేశ్వరంతో మరిం త ఆయకట్టు పెరుగుతుందని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మగాణంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని పేర్కొన్నారు.
kaleshwaram1

ముఖ్యమంత్రి సంకల్ప బలంతోనే..

సీఎం కేసీఆర్ సంకల్ప బలంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమైంది. నందిమేడారంలోని మూడు, నాలుగు మోటర్ల వెట్న్ విజయవంతమైంది. రైతులు సంతోషపడదగిన రోజు ఇది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారేదిశలో నందిమేడారం పంపుల వెట్న్ ఒక మైలురాయిగా భావిస్తున్నాం. వచ్చే వానకాలంలో చెరువులు, నింపడంతో పాటు ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 మొత్తం కలిపి 13 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించేలోపు ఎస్సారెస్పీ పునర్జీవ పనులు పూర్తిచేస్తాం.
- శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఎంవో ఓఎస్డీ

చాలా సంతోషంగా ఉన్నది

నందిమేడారంలో మూడు, నాలుగు మోట ర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్ణీత గడువులోపు పనులు పూర్తిచేస్తూ లక్ష్యానికి చేరుకుంటున్నాం. అన్నిశాఖల సమన్వయంతో ముందుకుసాగుతూ నాలు గు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం 100 శాతం విజయవంతంగా నిర్వహిం చాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కరంట్ సిద్ధం

కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేసేందుకు సరిపడా విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేశాం. విద్యుత్ లైన్లతోపాటు సబ్‌స్టేషన్లు, స్విచ్ యార్డుల నిర్మాణాలు పూర్తిచేశాం. సబ్‌స్టేషన్ల రీచార్జి పూర్తయింది. నిర్ణీత సమయానికి ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నాం.
- సూర్యప్రకాశ్, ట్రాన్స్‌కో డైరెక్టర్
kaleshwaram2

పాత ఏజెన్సీకే అదనపు టీఎంసీ పనులు

-మూడో టీఎంసీ పనులపై ఎస్‌ఎల్‌ఎస్‌సీ నిర్ణయం
-రూ.12,392 కోట్లతో అదనపు పంపుల ఏర్పాటు

కాళేశ్వరం ఎత్తిపోతల్లో గోదావరి నుంచి మూడో టీఎంసీ తరలింపునకు చేపట్టాల్సిన పనులపై రాష్ట్రస్థాయి స్టాండింగ్‌కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పాత ఏజెన్సీకే ఎలక్ట్రో మెకానికల్ పనులు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రెండు టీఎంసీల గోదావరిజలాలను ఎత్తిపోసేందుకు మోటర్ల బిగింపు చివరిదశలో ఉన్నది. ఇందుకోసం కన్నెపల్లి పంపుహౌస్‌లో పదకొండు, అన్నారం పంపుహౌస్‌లో ఎనిమిది, సుందిల్ల పంపుహౌస్‌లో తొమ్మిది మోటర్లు బిగిస్తున్నారు. వీటిద్వారా రెండు టీఎంసీల జలాలను లిఫ్టు చేయవచ్చు. మూడో టీఎంసీ తరలింపునకు కన్నెపల్లి పంపుహౌస్‌లో ఆరు, అన్నారం పంపుహౌస్‌లో నాలుగు, సుందిల్ల పంపుహౌస్‌లో ఐదుమోటర్లను అమర్చాలని నిర్ణయించారు. వీటి ఎలక్ట్రోమెకానికల్ పనులకు రూ.12,392 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులకు టెండర్ల పూర్తయ్యేందుకు మూడు నెలలకుపైగా పట్టే అవకాశం ఉన్నదని రెండు రోజుల కిందట భేటీలో రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఏజెన్సీకే పనులు అప్పగిస్తే త్వరగా పనులు పూర్తవుతాయని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే మూడు పంపుహౌస్‌ల్లో పనులు నిర్వహిస్తున్న మెగా ఏజెన్సీకే అదనపు మోటర్ల బిగింపు పనులు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇంధన ధర పెరుగుదల, ఇతరత్రా అంశాలపైనా కమిటీ నిర్ణయం తీసుకున్నది.

అభినవ కాటన్ సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న అభినవ కాటన్ అని కాళేశ్వరం ప్రా జెక్టు ఈఎన్సీ బీ హరిరాం పేర్కొన్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో సర్‌అర్థర్ కాటన్ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హరిరాం మాట్లాడుతూ కృష్ణాడెల్టా కరువు పారదోలేందకు కాటన్ బరాజ్ నిర్మించారన్నారు. బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. నెలరోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్ రామేశ్వర్‌రావు, కార్యదర్శి అంజయ్య,రమణానాయక్ పాల్గొన్నారు.

7198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles