కాళేశ్వరం, భగీరథ..అద్భుతాలు


Tue,February 13, 2018 02:37 AM

Kaleshwaram mission bhagiratha wonderful

-సామాజిక తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ పాలన
-మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రశంస
-కేంద్ర పథకాల అమలు తీరు బాగుంది
-రాష్ట్రం పనితీరుపై కేంద్ర సహాయ మంత్రి రాంకృపాల్‌యాదవ్ సంతృప్తి
-రూరల్ టెక్నాలజీ పార్క్ కృషికి అభినందనలు

హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/రాజేంద్రనగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రముఖుల ప్రశంసల జల్లు కురుస్తూనే ఉన్నది. సోమవారం వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ.. అద్భుతాలని, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగున్నదని అన్నారు. సోమవారం సిరిసిల్లలో రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహారాష్ట్ర గవర్నర్.. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో మంచి ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలు అద్భుతం. తెలుగు తన జీవన గమనాన్ని మార్చుకున్నదని తెలుగు మహాసభల సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి అని ఆయన అన్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐపార్డ్ (తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ)లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాంకృపాల్‌యాదవ్‌కు రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాల పురోగతిని అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
vidhyasagar
ఉపాధిహామీ, పీఎంజీఎస్‌వై, రూర్బన్, డీడీయూజీకేవై, టీఆర్‌ఐజీపీ, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణాభివృద్ధిశాఖ కార్యక్రమాల అమలు బాగున్నదని మెచ్చుకున్నారు. మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హరితహారంలో నాటిన మొక్కల మనుగడ రేటు 70% వరకు ఉండటంపై కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఉపాధిహామీ లక్ష్యాన్ని 16 కోట్ల పనిదినాలకు పెంచాలని, రూ.750 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ త్వరలో విడుదలచేయాలని కోరారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా యువతకు పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ పథకం లక్ష్యాన్ని మరింత పెంచాలని సూచించారు. 2003-04లో పొరపాటు నివేదికవల్ల రాష్ట్రానికి దక్కకుండాపోయిన 1230 కిలోమీటర్ల రహదారుల గురించి గుర్తుచేశారు. రూ.800 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి పీఎంజీఎస్‌వై-2 కింద అనుమతి కోరారు. అలాగే కనీసం జిల్లాకు ఒక్కటైనా రూర్బన్ క్లస్టర్ మంజూరుచేయాలని కోరుతూ కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజల కనీస అవసరాలు తీర్చాలి


ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి సడక్‌యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి ప్రభుత్వ పథకాల ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహారం, వస్త్రాలు, గృహవసతిని అందించవలసిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూవనరుల శాఖ సహాయ మంత్రి రాంకృపాల్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధికోసం చిన్న వ్యాపార సంస్థలకు ఆర్థిక సహాయం అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని కేంద్రమంత్రి సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పుణెలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్ బ్యాంకింగ్ (సీఐసీటీఏబీ) కూడా సహకరిస్తున్నది. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమంలో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లతోపాటు భారతదేశం నుంచి 35 మంది పాల్గొంటున్నారు. నేషనల్ ట్రైనింగ్ పోగ్రామ్ ఆన్ సోషల్ ఆడిట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, వాటర్ రిసోర్సెస్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌కు చెందిన శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్న 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ.. 2022 నాటికి న్యూఇండియాను సాకారం చేసే కృషిలో భాగంగా ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం వ్యవసాయం పైనా, నిరుద్యోగులైన గ్రామీణ ప్రాంతాల యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం, గ్రామీణ అభివృద్ధి, నాణ్యమైన మౌలిక సదుపాయాలను అందించడం కోసం విద్య, ఆరోగ్య సంరక్షణలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదన్నారు.
TSIPARD
కార్యక్రమంలో ఎన్‌ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డితోపాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఎన్‌ఐఆర్డీపీఆర్ ప్రాంగణంలో ఉన్న రూరల్ టెక్నాలజీ పార్క్‌ను సందర్శించారు. ఒక ఆధునిక మినీ ట్రైనింగ్ -కం- కాన్ఫరెన్స్ హాల్‌ను, హైడ్రోపానిక్స్ యూనిట్, సౌరశక్తితో పనిచేసే మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పాదక యూనిట్‌ను ప్రారంభించారు. సూర్యమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నవారితో మంత్రి మాట్లాడి.. పాఠ్యాంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సోలార్ టెక్నీషియన్ల కొరత చాలా ఉందని, ఈ నేపథ్యంలో జీయూటీఎస్ సహకారంతో ఎన్‌ఐఆర్డీపీఆర్ శిక్షణ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సోలార్ డీ హైడ్రేషన్ అండ్ కూలింగ్ టెక్నాలజీ యూనిట్, పుట్టగొడుగుల సేద్య విభాగం, తేనే శుద్ధి విభాగం, ఆదివాసీ ఆభరణాల విభాగం, వేప నూనె సంగ్రహణ విభాగం, కేక్ తయారీ విభాగాలను సందర్శించారు. గ్రామీణ ప్రాంత యువజనులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో రూరల్ టెక్నాలజీ పార్క్ కృషిని కేంద్రమంత్రి అభినందించారు. ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రమంత్రితోను, కార్యదర్శితోను చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఇంచార్జి డాక్టర్ రమేశ్ శక్తివేల్, సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్, ప్రాజెక్టు ఇంజినీర్ బీ ఎన్ మణి తదితరులు పాల్గొన్నారు.

3046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles