కేటీఆర్‌తో పార్టీ బలోపేతం


Sun,December 16, 2018 01:56 AM

Kadiyam Srihari Praises KTR Over Appointed As TRS Working President

-వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకంపై హర్షం
-చారిత్రక నిర్ణయమన్న టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
-సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని వెల్లడి

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నియామకంపై సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. నియామక ప్రకటన వెలువడిన నాటినుంచి శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఆనందడోలికల్లో మునిగిపోయారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌లాంటి సమర్థుడైన నాయకుడి సేవలు పార్టీకి ఎంతో అవసరమన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని భావించిన ప్రజలు మరోసారి అధికారం అప్పజెప్పారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఓట్ల తుఫాన్‌లో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా కొట్టుకుపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం కావడంతో యువతలో నూతనోత్సాహం నెలకొన్నదన్నారు.

యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ కేటీఆర్ తనదైన శైలిలో రాజకీయంగా రాణిస్తున్నారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే సమర్థత సీఎం కేసీఆర్‌కు ఉన్నదని మాజీ మంత్రి, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమించడం పార్టీకి ఎంతో శుభపరిణామమన్నారు. కేటీఆర్ ఎంతో సమర్థుడైన నాయకుడని పేర్కొన్నారు. యువనాయకుడు కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి టీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంలో కేటీఆర్ పాత్ర మరువలేనిదన్నారు. తారకరాముడి నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగిన కేటీఆర్ దేశానికే ఆదర్శమని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. సమర్థవంతమైన నాయకుడు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించడంతో కార్యకర్తల స్థాయి నుంచి ప్రతిఒక్కరికీ సముచిత న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
indrakaran

సంబురాలు..


కేటీఆర్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం కావడంతో సౌదీలో తెలంగాణ ఫోరం సభ్యులు సంబురాలు జరుపుకున్నారు. ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన యువకులు సౌదీలో కేక్ కట్ చేసి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. కువైట్లో ఖమ్మం జిల్లావాసి, కువైట్ టీఆర్‌ఎస్ పార్టీ విభాగం అధ్యక్షురాలు అభిలాష గొడిషాల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ అభిమానులు కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు.

1224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles