గోదావరిలో బోటు వెలికితీత

Wed,October 23, 2019 03:14 AM

-38 రోజుల తర్వాత ఒడ్డుకు..
- ఫలించిన ధర్మాడి సత్యం బృందం కృషి
-పడవలో ఎనిమిది మృతదేహాలు లభ్యం
-కుళ్లిపోయి, ఎముకలు తేలి దుర్వాసన
-47కు చేరిన మృతుల సంఖ్య

అమరావతి/ మడికొండ(వరంగల్), నమస్తే తెలంగాణ: గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటు మంగళవారం ఒడ్డుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నం ఫలించింది. 38 రోజులపాటు నీటిలోనే ఉండిపోయిన బోటులో కుళ్లిపోయిన ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. ఎముకలు బయటకొచ్చి దుర్వాసన వస్తూ.. కనీసం గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. ఇప్పటికీ మరో నలుగురి ఆచూకీ లభించలేదు. ఏపీలోని పాపికొండలకు వెళ్తున్న రాయల్ వశిష్ఠ బోటు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరి నదిలో సెప్టెంబర్ 15వ తేదీన మునిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 77 మంది ప్రయాణిస్తుండగా, 39 మంది మృతిచెందారు. మరో 26 మంది సురక్షితంగా బయటపడగా, మిగిలిన 12 మంది ఆచూకీ లభించలేదు. గోదావరిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బోటు వెలికితీసేందుకు యత్నించి విఫలమయ్యాయి. తర్వాత ఈ బాధ్యతను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది. సెప్టెంబర్ 28న ఆపరేషన్ మొదలుపెట్టిన ఈ బృందం.. గోదావరిలో వరద పోటెత్తడంతో ఈ నెల 3న ఆపరేషన్ నిలిపేసింది. మళ్లీ ఈ నెల 16న పనులను ముమ్మరం చేసింది. విశాఖకు చెందిన స్కూబా డైవర్ల సాయంతో నది గర్భంలో ఇసుకలో కూరుకుపోయిన బోటుకు ఐరన్ రోప్ లు, లంగర్లను కట్టి.. పొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకొచ్చింది. బోటు పూర్తిగా ధ్వంసమైంది. బయటపడ్డ ఎనిమిది మృతదేహాలతో కలిపి ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 47కు చేరింది.

మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు

ఒడ్డుకు చేరిన బోటులో లభ్యమైన ఎనిమిది మృతదేహాల్లో ఓ మహిళ, మరోపాప, ఆరుగురు పురుషులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు చేస్తేనే మృతులు ఎవరనేది తెలుస్తుందని వారు తెలిపారు. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ సేకరించి.. బాధి త కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో పోల్చి శవాల ను అప్పగిస్తామని చెప్పారు. బోటు వద్ద దు ర్వాసన వస్తుండటంతో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడంలేదు.
ROYAL-BOAT1

కడిపికొండకు చెందిన ముగ్గురెక్కడ?

ప్రమాద సమయంలో బోటులో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ కు చెందిన 14 మంది ఉండగా, వారిలో ఐదుగురు మృతిచెందారు. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురు రాజ్‌కుమా ర్, రవి, ధర్మరాజు ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం దొ రికిన శవాల్లో.. తమవారు ఉండొచ్చని, అం త్యక్రియలు చేసే అవకాశమైనా ఉంటుందని బాధిత కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.

3773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles