నిధులు ఫుల్.. పెండింగ్ నిల్


Wed,May 22, 2019 02:50 AM

K RamaKrishna Rao Principal Secretary Finance Department Telangana

-పటిష్ఠంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి
-సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల సమస్య లేదు
-అన్ని రకాల పెన్షన్లకు అందుబాటులో రూ.12వేల కోట్లు
-పెండింగ్ బిల్లులు రూ.3,474 కోట్లు మాత్రమే
-అవికూడా సాంకేతిక కారణాలు, ఎన్నికల కోడ్‌తోనే
-జీఎస్డీపీ వృద్ధిరేటులో సొంతరాబడులలో పెట్టుబడి వ్యయంలో
-తెలంగాణ నంబర్ 1
-పూర్తి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం
-ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే అప్పులు
-రాష్ట్రం అప్పు రూ.1.80 లక్షల కోట్లు
-జీఎస్డీపీలో 22శాతంలోపే అప్పులు
-ఈ ఏడాది సొంత రాబడులలో 14.5% వృద్ధి
-గత ఐదేండ్లలో సగటు వృద్ధిరేటు 16.5%
-ఏ రాష్ట్రం కూడా ఇంత వృద్ధిరేటు సాధించలేదు
-మీడియా సమావేశంలో ఆర్థికశాఖముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు వెల్లడి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే పటిష్ఠంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు స్పష్టంచేశారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పింఛన్లు, ప్రాజెక్టుల బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల కొరత లేదని వివరించారు. రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్-జీఎస్డీపీ) వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. సొంత రాబడుల వృద్ధిరేటులో, పెట్టుబడి వ్యయంలో దేశంలో నంబర్ వన్‌గా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక తాజా పరిస్థితిపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జీఎస్డీపీ గణనీయంగా పెరిగిందని తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధరంగాల్లో రాష్ట్రం మొత్తం సంపద రూ.8,66,875 కోట్లకు పెరిగిందని చెప్పారు. గత 2017-18 సంవత్సరంలో రూ.7,53,804 కోట్లుగా (14.2%) ఉన్న సంపద ఈసారి 15శాతానికి చేరిందని వివరించారు. 2014-15లో 12% ఉన్న జీఎస్డీపీ వృద్ధిరేటు 2015-16లో 14.2 శాతానికి పెరిగిందని చెప్పారు. 2016-17లో 14.2శాతంగా, 2017-18లో 14.3శాతంగా ఉన్న రాష్ట్ర సంపద ఈసారి 15 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రాథమికరంగమైన వ్యవసాయ, అనుబంధరంగాల్లో 10.9%, ద్వితీయశ్రేణిరంగం కింద పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, నిర్మాణరంగంలో 14.9% వృద్ధిరేటు నమోదు చేసుకోగా.. సేవారంగం (టర్షరీ సెక్టార్)లో 19.8% వృద్ధిరేటు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మొత్తంగా 15.5% సగటు వృద్ధిరేటు నమోదైందని వెల్లడించారు.

నిధులు పుష్కలం.. పెండింగ్ బిల్లులు అవాస్తవం

ఒకవైపు రాష్ట్ర సంపద, మరోవైపు రాష్ట్ర రాబడులు గణనీయంగా పెరుగుతున్నందున సంక్షేమ, అభివృద్ధి పథకాలకు చాలినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టంచేశారు. జీతభత్యాలకు, కాంట్రాక్టర్ల బిల్లులకు ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలకు చాలినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరునెలల సమయం వరకు రైతుబంధు, వ్యవసాయ రుణమాఫీ, ఆసరా పెన్షన్‌లకు సరిపడా నిధులను వాడుకోవడానికి చట్టసభ అనుమతి తీసుకున్నామని గుర్తుచేశారు. 39 లక్షలమంది పెన్షనర్లకు అవసరమైన రూ.414కోట్లతోపాటు రెట్టింపు పెన్షన్లు, వయోపరిమితిని తగ్గిస్తే ఇవ్వాల్సిన పెన్షన్లకు అన్ని లెక్కలు వేసిమరీ పక్కాగా రూ.12వేల కోట్ల నిధులను అందుబాటులో ఉంచామని చెప్పారు. రైతుబంధు కింద ఆరువేల కోట్ల రూపాయల పంపిణీకి అంతా సిద్ధంచేస్తున్నామని తెలిపారు.
RAMAKRISHNA-RAO1

పెండింగ్ బిల్లులు రూ.3,474 కోట్లే

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలవారీగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.3,474.22 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. అందులో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి రూ.3162 కోట్లు (ఇందులో భూసేకరణ, పునరావాసం కింద 430.08 కోట్లు, మిషన్ కాకతీయ కింద రూ.529 కోట్లు కూడా ఉన్నాయి.), రోడ్లు, భవనాల శాఖలో రూ.150 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.128 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అవికూడా నిధుల కొరత వల్ల కాదని, కేవలం వివిధరకాల సాంకేతిక కారణాలు, బిల్లుల తయారీలో స్పష్టత లోపించడం, కొన్నిచోట్ల పనులకు క్లియరెన్స్ రాకపోవడం వంటి కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం లేదని రామకృష్ణారావు చెప్పారు. గత సంవత్సరం రూ.1,800 కోట్లు చెల్లించామని, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. సంవత్సరం విషయంలో కొందరికి అయోమయం ఉంది తప్ప వాస్తవానికి ఎటువంటి జాప్యం లేదని విశ్లేషించారు. ఇక ఎన్నికల కోడ్ వల్ల కల్యాణలక్ష్మి ఆన్‌లైన్ పేమెంట్‌లో, కేసీఆర్ కిట్ల ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో కొంత జాప్యం జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ నెల 23న కౌంటింగ్ తర్వాత అసలు సమస్యే ఉండదని చెప్పారు. వాస్తవానికి 52 లక్షల మంది రైతులకు బ్యాంకుల నుంచి నేరుగా చెల్లించామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇ-కుబేర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆర్బీఐ ప్రశంసలను పొందామని చెప్పారు.

స్థిరంగా పెరుగుతున్న సొంతరాబడులు

రాష్ట్ర సొంత రాబడులు స్థిరంగా, బాగా పెరుగుతున్నాయని రామకృష్ణారావు వెల్లడించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలోనూ సొంత రాబడులలో 14.5% వృద్ధిరేటు చోటుచేసుకున్నట్లు వెల్లడించిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి సొంత రాబడులు స్థిరంగా, వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. గత ఐదేండ్లలో సగటు తీసుకుంటే వృద్ధిరేటు 16.5% వరకు పెరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వృద్ధిరేటును సాధించలేదని రామకృష్ణారావు విశ్లేషించారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో కూడా రాబడులలో 24% వృద్ధిరేటు చోటుచేసుకుందని వివరించారు. జీఎస్టీ రాబడిలో అధిక వృద్ధిరేటును సాధించి మనమే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. కేంద్రం నుంచి నష్టపరిహారం తీసుకోకుండా రాబడిని పెంచిన రాష్ట్రంగా ప్రశంసలు అందుకున్నామని తెలిపారు. ప్రధాన రాష్ర్టాల (నాన్-స్పెషల్ క్యాటగిరీ)వారీగా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ (సొంత రాబడుల) వివరాలను ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మీడియాకు అందించారు. (వివరాలు పట్టికలో చూడొచ్చు) అసలు ఒక రాష్ట్రం అభివృద్ధికి జీఎస్డీపీనే ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటామని, దానిని అనుసరించే రెవెన్యూ రాబడులు, ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నింటినీ అంచనా వేస్తామని రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్ర సంపద పెరిగితే రాబడులు పెరుగుతాయని, రాబడులు పెరిగితే భవిష్యత్ అవసరాలకు పెట్టుబడులు పెరుగుతాయని, ఆ తర్వాత రాష్ట్ర ఆస్తులు, సంపద పెరుగుతాయని ఆయన వివరించారు.
RAMAKRISHNA-RAO2

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కంటే తక్కువ అప్పులు

రాష్ట్ర సంపద పెరుగుతున్నదని, కానీ అప్పులు మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే ఉన్నాయని రామకృష్ణారావు స్పష్టంచేశారు. పరిమితికి లోబడి అప్పులు, రాబడులలో వడ్డీల చెల్లింపు పదిశాతం మించకుండా జాగ్రత్త పడుతూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ కలిగిన అతి కొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మూడుసార్లు పెంచుకోగలిగామని చెప్పారు. మొత్తంగా రాష్ట్రం అప్పు రూ.1.80 లక్షల కోట్ల వరకు ఉన్నదని తెలిపారు. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి 22% వరకే ఉన్నదని వివరించారు. ఏ రాష్ట్రమైనా మొత్తం అప్పులు జీఎస్డీపీలో 25% మించరాదు. కానీ.. తెలంగాణ రాష్ట్రం 22శాతంలోపే అప్పులు తీసుకుంటున్నదని చెప్పారు. ఈ ఏడాది మనకు మరో 0.5శాతం పరిమితి పెంచినందున రూ.29,651 కోట్లు అదనంగా అప్పు తీసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. కానీ అంత అప్పు చేయకుండా పరిమితంగా ఉంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నదని స్పష్టంచేశారు. రాజస్థాన్ లాంటి రాష్ర్టాలు పరిమితికి మించి 35 నుంచి 40శాతం వరకు అప్పులు చేస్తున్నాయని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం తెలంగాణ రాష్ట్రం రూ.29,651 కోట్ల వరకు అప్పు తీసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నందున బహిరంగ మార్కెట్లో మన బాండ్లకు మంచి గిరాకీ ఉన్నదని, ప్రతిసారీ ఓవర్ సబ్‌స్ర్కైబ్ అవుతున్నాయని తెలిపారు.

పెట్టుబడి వ్యయంలో నంబర్ 1

భవిష్యత్ అవసరాల కోసం వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, పనులను చేపట్టడానికి ఉద్దేశించే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (పెట్టుబడి వ్యయం)లో ప్రథమ స్థానంలో నిలిచామని రామకృష్ణారావు వెల్లడించారు. గత ఐదేండ్లలో రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,02,140 కోట్లను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద వెచ్చించినట్లు వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,02,140 కోట్లకు పైగా వెచ్చించగా, కార్పొరేషన్లు, ఇతర వ్యవస్థల ద్వారా రూ.62 వేల కోట్లను ఖర్చుచేసినట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తం ఖర్చుచేయలేదన్నారు. రాష్ట్రం ఖర్చులుపోను మిగులు సాధిస్తూ భవిష్యత్ సంపదను పెంచుకోవడానికి పెట్టే పెట్టుబడిని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌గా పరిగణిస్తారని తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులు, సంక్షేమ పథకాలు కాకుండా శాశ్వత ప్రయోజనాలు ఆశించి చేపట్టే ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, వంతెనలు, భవనాలు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకు వస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లలో తెలంగాణలో పెట్టుబడి వ్యయం కింద కేవలం రూ.54 వేల కోట్లు వెచ్చిస్తే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేవలం ఐదేండ్లలోనే రూ.1.64 లక్షల కోట్లను భవిష్యత్ అవసరాలకు ఖర్చుచేశామని రామకృష్ణారావు తెలిపారు. ఇది కూడా దేశంలో అత్యధికమని చెప్పారు.
RAMAKRISHNA-RAO3

4438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles