హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఆర్‌ఎస్ చౌహాన్


Thu,June 20, 2019 02:56 AM

Justice Raghvendra Singh Chauhan appointed Chief Justice of Telangana High Court

-హిమాచల్‌ప్రదేశ్ సీజేగా రామసుబ్రమణియన్
-సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం
-నియమక ఉత్తర్వులు జారీచేసిన న్యాయ మంత్రిత్వశాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు న్యాయమంత్రిత్వశాఖ బుధవారం నియామక ఉత్తర్వులు జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 క్లాస్1 ప్రకారం రాష్ట్రపతి చేపట్టిన నియామకాన్ని కేంద్రం నోటిఫై చేసింది. జస్టిస్ చౌహాన్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయినప్పటి నుంచి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్‌ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. ఈ సిఫారసులను ఆమోదించిన కేంద్రం నియామక ఉత్తర్వులను జారీచేసింది. తెలంగాణ హైకోర్టులో జస్టిస్ చౌహాన్ తర్వాత సీనియర్‌గా ఉన్న జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతి పొందిన ఆయన త్వరలోనే హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా వెళ్లనున్నారు.

క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాల్లో నైపుణ్యం..

జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్.. క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికా ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తిచేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1996 నుంచి 2005 వరకు రాజస్థాన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2005 జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టు, ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చౌహాన్.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన క్రమంలో తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చి ఇక్కడే కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ అయినప్పటి నుంచి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ ఏసీజేగా వ్యవహరిస్తున్నారు.
SBI-chauhan
కోర్టు ఫీజు చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలను ప్రవేశపెట్టేందుకు హైకోర్టు, ఎస్బీఐ ఈ-పే మధ్య కుదుర్చుకొన్న ఒప్పందపత్రాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్‌మిశ్రా మార్చుకొన్నారు. దేశంలోనే ఈ-చెల్లింపుల వ్యవస్థను అమలుచేయనున్న తొలి హైకోర్టు తెలంగాణదే అని సీజే ఆర్‌ఎస్ చౌహాన్ చెప్పారు.

1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles