డీజిల్ దొంగిలిస్తుండగా.. పేలిన ట్యాంకర్లు


Sat,January 13, 2018 03:19 AM

Just half an hour before at Cherlapally Petrol tank blast

-విధ్వంసం సృష్టించిన కాసుల కక్కుర్తి
-30 అడుగుల ఎత్తుకు ఎగిసిన మంటలు
-పది ఫైర్ ఇంజిన్లతో నాలుగు గంటలపాటు శ్రమించిన సిబ్బంది
-12 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
-రూ.కోటి ఆస్తినష్టం
-మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో ఘటన

blast
మేడిపల్లి, గాంధీ దవాఖాన: ఆగిఉన్న ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను అక్రమంగా దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా మంటలు అంటుకొని పేలిపోయింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో డీజిల్ ట్యాంకర్ సైతం పేలిపోయింది. పేలుళ్ల ధాటికి రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. మొత్తంగా రూ.కోటి ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల చౌరస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. చెర్లపల్లిలో పలు ప్రభుత్వ ఇంధన కంపెనీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి నగరానికి పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతూ ఉంటుంది. చర్లపల్లిలో ఇంధనం నింపుకొని బయలుదేరే ట్యాంకర్లు చెంగిచెర్ల చౌరస్తా దగ్గర వరంగల్ హైవేపైకి వచ్చి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. చెంగిచెర్ల వద్ద ట్యాంకర్ల నుంచి భారీగా డీజిల్, పెట్రోల్ చోరీ జరుగుతుందని, పెద్ద ఎత్తున కల్తీ అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. పలు ట్యాంకర్ల డ్రైవర్లు చెంగిచెర్ల చౌరస్తా పరిసర ప్రాంతాల్లో టిఫిన్, చాయ్ కోసం వాహనాలను కొద్దిసేపు ఆపుతారు. కొన్ని ట్యాంకర్లను ఇక్కడే ఉన్న షెడ్లలోకి మళ్లిస్తారని, వాటికి ఉన్న సీల్డ్ కవర్‌ను తొలిగించి కొంత ఇంధనాన్ని చోరీ చేస్తారని, ఆ మేరకు రసాయనాలు నింపి కల్తీ చేస్తారని స్థానికులు చెప్తున్నారు.

ఇదంతా నిత్యకృత్యమని చెప్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి నుంచి బయలుదేరిన ఓ ట్యాంకర్ 2 గంటల సమయంలో చెంగిచెర్ల చౌరస్తా సమీపంలోని ఓ షెడ్డుకు చేరింది. షెడ్డు నిర్వాహకులు ట్యాంకర్ మూత తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో వెల్డింగ్ యంత్రం సాయంతో తీసేందుకు యత్నించారు. నిప్పురవ్వలు ఎగిసిపడి ఒక్కసారిగా ట్యాంకర్‌కు మంటలు అంటుకొని భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి పక్కనే ఉన్న మరో డీజిల్ ట్యాంకర్‌కు కూడా నిప్పంటుకొని సుమారు 30 అడుగుల దూరం ఎగిరిపడి సమీపంలోని ఇంటి గోడను ఢీ కొట్టింది. ఆ ట్యాంకర్‌లోని డీజిల్‌కు కూడా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దావానలంగా మారింది. మంటల ధాటికి మేడిపల్లి నుంచి చెంగిచర్ల వైపు వెళ్తున్న బాటసారులు, వాహనదారులకు సైతం గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో మొత్తం పన్నెండుమంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మిగతావారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెం టనే దవాఖానకు తరలించారు. సంఘటనా స్థ లానికి సమీపంలో జనావాసాలు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షెడ్డు నిర్వాహకుడు రాజు పరారీలో ఉన్నట్టు తెలిసింది.
blast1

10 ఫైర్ ఇంజిన్లు..4 గంటలు

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాదాపు 30 అడుగుల మేర ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు పలు ఫైర్ స్టేషన్ల నుంచి 10 ఫైరింజన్లు వచ్చాయి. సిబ్బంది సుమారు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి షెడ్డు ముందున్న ఫర్నీచర్, టైల్స్ దుకాణాలు, భవనానికి మంటలు అంటుకున్నాయి. దీంతో పాటు రోడ్డుపై వెళ్తున్న నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ గోనె సందీప్‌కుమార్, మేడిపల్లి సీఐ జగన్నాథరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు.
bikee

భోజనం చేసి ఆఫీస్‌కు వెళ్తుండగా..

తీవ్రంగా గాయపడిన చెంగిచెర్లకు చెందిన నల్ల నాగులు (40), ఎండీ జలీల్‌ఖాన్, అంబర్‌పేటకు చెందిన షేక్ ఇబ్రహీం, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మాలోతు స్వామినాయక్ (35), ఏపీలోని మచిలీపట్నంకు చెందిన వాసు (25), కర్నూలుకు చెందిన దేనావత్ వెంకటేశ్‌నాయక్ (26)ను హుటాహుటిన 108 వాహనంలో గాంధీ దవాఖానకు తరలించారు. వీరిలో 60 శాతం గాయాలతో వెంకటేశ్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన వెంకటేశ్ మేడిపల్లిలో నివాసం ఉంటూ చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చి తిరిగి డిపోకు వెళ్తుండగా మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో వెంకటేశ్ హెల్మెట్ పెట్టుకోవడంతో తలకు గాయాలు కాలేదు. హెల్మెట్ తీయలేక, ఒళ్లంతా గాయాలతో అతడు పడిన వేదన స్థానికులను కంటతడి పెట్టించింది. 60 శాతం పైగా కాలిన గాయాలతో వెంకటేశ్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. గాంధీలో చికిత్స పొందుతున్న మిగతావారు పనిమీద మేడిపల్లి వైపు వెళ్తుండగా మంటలు అంటుకున్నాయి.
venkatesh-nayak

6041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS