ఓటర్ల జాబితాకు ఓకే


Thu,October 11, 2018 02:14 AM

joint high court allowed the voter list to be published in the state

-శుక్రవారం ప్రచురణకు హైకోర్టు అనుమతి
-ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోలేం
-జాబితాలో తప్పులు ఉంటే పరిష్కరించాలి
-ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని నివేదించాలి
-ఎన్నికల సంఘానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు
-అభ్యంతరాలన్నీ పరిష్కరించాం..
-హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదన
-అసెంబ్లీ రద్దుపై వ్యాజ్యాల్లో తీర్పు వాయిదా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రచురణకు ఉమ్మడి హైకోర్టు అనుమతించింది. ఈ నెల 12న ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేసిన అభ్యర్థనను అంగీకరించింది. దీనితో శుక్రవారం తుది జాబితా వెల్లడికి మార్గం సుగమమైంది. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు జాబితాను ప్రచురించవద్దంటూ ఈ నెల 5న జారీచేసిన ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఎత్తివేసింది. రాష్ట్ర ఎన్నికల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఓటర్ల నమోదు తదితర అంశాలపై అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈసీఐకి ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. శుక్రవారం జాబితా ప్రకటించిన తర్వాత, జాబితాలో అంశాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఏవిధంగా పరిష్కరిస్తారనే విషయంపై రూట్‌మ్యాప్‌ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడుతామని పేర్కొంటూ ఆ రోజుకు వాయిదావేసింది.

ఎన్నికల సంఘం శుక్రవారం ప్రచురించే తుది ఓటరు జాబితాలోని అంశాలపై అభ్యంతరాలుంటే ఫిర్యాదుచేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. నామినేషన్ దాఖలుచేసే చివరిరోజు మధ్యాహ్నం మూడు గంటలవరకు ఫిర్యాదు చేయడానికి అవకాశముందంటూ ఎన్నికల సంఘం నివేదించిన నేపథ్యంలో అభ్యంతరాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. వాటిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని స్పష్టంచేసింది. ఎన్నికల నిర్వహణతోపాటు ఓటర్ల నమోదు, జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించే బాధ్యత ఎన్నికల సంఘానికే ఉంటుందని వ్యాఖ్యానించింది. సవరణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన జాబితాపై అందిన ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించి, శుక్రవారం ప్రకటించేందుకు తుది జాబితాను ఎన్నికల సంఘం సిద్ధంచేసిన నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి అవకాశం ఇవ్వడం సబబేనని ధర్మాసనం పేర్కొంది.

జాబితా వస్తేనే కదా ఆరోపణలు తేలేది!

సవరించిన ఓటర్ల జాబితాను పరిశీలించకుండా ఆరోపణలుచేయడం సరైంది కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఓటర్ల జాబితాను ప్రచురించడం ద్వారానే ఆరోపణలు వాస్తవమా? కాదా? అనేది తెలిసే అవకాశముంటుందని పేర్కొంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలిగించారని, డూప్లికేట్ ఓట్లు 30 లక్షలకుపైగా ఉన్నందున తప్పులను సరిదిద్దేవరకు తుది జాబితాను ప్రచురించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి దాఖలుచేసిన వ్యాజ్యంపై గతవారం ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. జాబితాలో తప్పుల సవరణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియచేయాలని, తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు తుది జాబితాను ప్రకటించవద్దని పేర్కొంటూ గత శుక్రవారం ఈసీఐకి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఈ నెల 8న మరోసారి, తదుపరి బుధవారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఓటర్ల తుది జాబితాను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చింది.

ఏదోఒక రకంగా ఆరోపణలు చేస్తున్నారు

శాసనసభ రద్దు తర్వాత వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీఐ చర్యలు చేపట్టిందని విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌దేశాయ్ తెలిపారు. అందులో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ నోటిఫికేషన్ జారీచేసి, జాబితాలో తప్పులు, ఇతర అభ్యంతరాలపై ఫిర్యాదులకు 15 రోజులు గడువు ఇచ్చినట్టు తెలిపారు. దీనితో సుమారు 33.14 లక్షల అభ్యంతరాలు వచ్చాయని, వీటిని పరిష్కరించి సవరణ జాబితాను సిద్ధంచేశామని వివరించారు. మరో 799 అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని ఒక్కరోజులో పరిష్కరిస్తామని తెలిపారు. తాము సవరణ జాబితా ప్రచురించాలని భావిస్తున్న సమయంలో దానిని నిలిపివేయాలంటూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.

జాబితాలో అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సవరణ జాబితాను ప్రకటించకుండా నిలిపివేస్తే.. తాము చేపట్టిన చర్యలు ఎలా తెలుస్తాయని వాదించారు. పిటిషనర్ తప్పుడు ఆరోపణలతో వ్యాజ్యం దాఖలుచేశారని వివరించారు. రహస్య ఎజెండాతో ఎన్నికల నిర్వహణకు ఈసీఐ సిద్ధపడుతున్నదని ఇప్పుడు ఆరోపిస్తున్నారని, ఒకవేళ ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే.. ఆపద్ధర్మ ప్రభుత్వ కొనసాగింపునకు ఈసీఐ అనుమతిస్తున్నదని ఆరోపించేవారని అవినాశ్‌దేశాయ్ పేర్కొన్నారు. శాసనసభ రద్దయిన పక్షంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈసీఐ తన విధులను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ నెల 12న ప్రచురించే జాబితా అనంతరం ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే నామినేషన్ల దాఖలు చివరితేదీ వరకు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని వివరించారు. మొదటగా ఈ నెల ఎనిమిదో తేదీనే జాబితా ప్రచురించాలని భావించామని, అయితే కోర్టు ఆదేశాల కారణంగా ఆలస్యమయిందని వివరించారు.

అర్హత తేదీ సమస్య ఇప్పటిది కాదు

కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు అర్హత తేదీ (క్వాలిఫైయింగ్ డేట్)గా ఎన్నికలు జరిగే ఏడాది ప్రారంభరోజును గుర్తిస్తారని హైకోర్టుకు అవినాశ్‌దేశాయ్ వివరించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 14(బీ) ప్రకారం అర్హత తేదీనే ఎన్నికల సంఘం నిర్ధారణకు తీసుకుంటుందని తెలిపారు. తొలుత తెలంగాణలో 2019 మేలో ఎన్నికలు జరుగుతాయనే అంచనాతో 2019 జనవరి ఒకటిని క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ధారిస్తూ ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ జారీచేసినట్టు వివరించారు. అయితే శాసనసభ రద్దు తర్వాత వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ ఏడాదిలోనే ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్టు తెలిపారు. అందులో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ నోటిఫికేషన్ జారీచేసినట్టు, క్వాలిఫైయింగ్ తేదీని జనవరి ఒకటి, 2018గా పేర్కొన్నట్టు వివరించారు.

ఒకే ఇంటిలో వందల ఓట్లు అంశాన్ని పరిశీలించాం

హైదరాబాద్ నగరంలో వందలు, వేల ఓట్లు ఒకే ఇంటి నంబర్‌పై ఉన్నాయని పిటిషనర్ లేవనెత్తిన అంశాలను ఇప్పటికే పరిశీలించామని హైకోర్టుకు ఈసీఐ నివేదించింది. పాతబస్తీలోని ఒక హాస్టల్‌లో 739 ఓట్లున్నాయని, వాటిని పరిశీలించిన తర్వాత 730 మంది ఓటర్లు వాస్తవంగా ఉన్నట్టు తేలిందని అవినాశ్‌దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. మరో ఇంటి నంబర్‌పై వేల ఓట్లు ఉన్నట్టు తెలిపారని, అయితే ఆ ఇంటి నంబర్ ఇప్పడు కేటాయించింది కాదని, నాలుగెకరాల స్థలానికి చాలా ఏండ్లక్రితం ఇంటి నంబర్ కేటాయించారని వివరించారు. అందులో ప్రస్తుతం భారీ అపార్ట్‌మెంట్లు, ఇతర భవనాలు వెలిశాయని, వాటి జాబితాను కలిపితే వేల ఓటర్లు ఉన్నారని తెలియజేశారు.

అసెంబ్లీ రద్దును సవాలుచేసిన వ్యాజ్యాలపై తీర్పు వాయిదా

శాసనసభ రద్దును సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. సభకు తెలియచేయకుండా, సమావేశం నిర్వహించకుండా శాసనసభ రద్దుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని సవాలుచేస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన శశాంక్‌రెడ్డి, ఎన్నికల షెడ్యూల్‌ను సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదావేస్తున్నట్టు తెలిపింది.

3025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles