సిద్దిపేట జిల్లాలో జపాన్ పౌల్ట్రీ


Tue,March 13, 2018 03:38 AM

Japan firm to set up unit in Telangana

-140 ఎకరాల్లో నెలకొల్పనున్న ఇసే సంస్థ
-సుజికీ కంపెనీ సాయంతో బ్యాటరీల ఆర్ అండ్ డీ కేంద్రం
-రెండుమూడేండ్లలో ఉత్పత్తి ప్రారంభం
-అనుమతులు, రాయితీల పత్రాలను అందించిన ప్రభుత్వం
-జపాన్‌తో తెలంగాణకు సత్సంబంధాలు: మంత్రి కేటీఆర్
jayesh-ranjan
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి మరో ప్రముఖ పరిశ్రమ తరలివచ్చింది. జపాన్‌కు చెందిన ఇసే ఫుడ్స్ సంస్థ సిద్దిపేట జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ అనుమతులు, రాయితీల పత్రాలను రాష్ట్ర మంత్రులు కే తారక రామారావు, ఈటల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరఫున ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ ఇసే కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందానికి అందజేశారు. అనంతరం జపాన్ ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు మియకోషి, ఇసే ఫుడ్స్ చైర్మన్ హికనోబు, కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రులు సమావేశమై చర్చించారు. జపాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇసే ఫుడ్స్ గత ఏడాది రూ.2,868 కోట్ల (47 బిలియన్ యెన్‌లు) అమ్మకాలను నమోదు చేసింది.

కంపెనీకి పలు దేశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్టలో 140 ఎకరాల్లో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. ఇక్కడ కోడి గుడ్ల ప్రాసెసింగ్, కోళ్ల ఫాంలలో లభించే వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నది. పౌల్ట్రీ టెక్నాలజీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఇక్కడి విద్యార్థులను శిక్షణ కోసం జపాన్‌కు తీసుకెళ్లనున్నది. దీంతోపాటు ఇసే సంస్థ సుజుకీ కంపెనీ భాగస్వామ్యంతో లిథియం అయాన్ బ్యాటరీల ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రంలో రాబోయే రెండుమూడేండ్లలో బ్యాటరీల ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొననున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ బ్యాడ్మింటన్ అకాడమీతో ఇసే సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది.

ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం

జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం జపాన్‌లో పర్యటించిన సందర్భంగా ఇసేతో ఎంవోయూ కుదుర్చుకున్నామని గుర్తుచేశారు. తెలంగాణకు, జపాన్‌కు మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు జైకా సహకారం అందిస్తున్నదని చెప్పారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రం ఇప్పటికే ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా ఉన్నదని, ఇప్పుడు ఇసే ఫుడ్స్ కంపెనీ రావడం హర్షణీయమని ఆర్థికశాఖమంత్రి ఈటల పేర్కొన్నారు. అనంతరం జపనీస్ భాషలో ముద్రించిన తెలంగాణ పాలసీ ప్రతిని రాష్ట్ర మంత్రులు జపాన్ ప్రతినిధులకు అందించారు.

ప్రభుత్వం చొరవ అభినందనీయం: జపాన్ ప్రధాని సలహాదారు

తెలంగాణకు జపాన్ పరిశ్రమలను రప్పించాలన్న ప్రభుత్వ చొరవను జపాన్ ప్రధాన మంత్రి సలహాదారు మియకొషి అభినందించారు. గతంలో మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి విధానాలను అద్భుతంగా వివరించారని కొనియాడారు. ఇసే పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్నదంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రంగాల్లోనూ సహకారం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయోత్పత్తులు మరింత పెరుగుతాయని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నచ్చడంతోపాటు ఇక్కడి ప్రభుత్వం చూపిన చొరువ వల్లే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని ఇసే కంపెనీ చైర్మన్ హికనోబు ఇసే పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తిలో తమ కంపెనీ సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నదని, ఈ ప్రక్రియలో ఎలాంటి యాంటీ బయోటిక్స్ వినియోగించడం లేదని చెప్పారు.

2352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles