ఒకరి భూమి మరొకరికి పట్టా!


Mon,July 22, 2019 01:57 AM

Janagam Farmers Suffering Revenue Officers Neglect Pattadar Passbook

-రియల్టర్‌తో రెవెన్యూ అధికారుల కుమ్మక్కు
-ధర్మగంటను ఆశ్రయించిన జనగామ జిల్లా మాణిక్యాపురం బాధితులు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం రెవెన్యూ పరిధిలోని మాణిక్యాపురం గ్రామానికి చెందిన బడికె పుషమ్మకు సర్వే నంబర్ 89/ఏ/3లో 2.10 ఎకరాలు, 89/ఏ/2లో 1.02 ఎకరాల భూమి ఉన్నది. 35 ఏండ్ల కిందట భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది సాగు చేసుకొంటున్నారు. 2006లో పుషమ్మ మృతి చెందగా.. ఆమె భర్త సత్తయ్య అనారోగ్యంతో మంచం పట్టారు. దీంతో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా తమ పేరిట పట్టా మార్పిడి చేయాలని కుమారులు బడికె శ్రీనివాస్, బడికె కరుణాకర్ తాసిల్దార్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. వీఆర్వో సంపత్ స్థానిక రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఉపేందర్‌తో కుమ్మక్కై సర్వే నంబర్ 89/ఏ/3లో ఎకరం భూమి మాత్రమే శ్రీనివాస్, కరుణాకర్ పేరిట చేసి మిగిలిన 1.10 ఎకరాల భూమిని బడిగె బుచ్చి ఎల్లయ్య పేరి ట పట్టా చేసినట్టు బాధితులు తెలిపారు. దీం తో గత ఏడాది ఏప్రిల్ 10న మార్పిడి ఎలా జరిగిందని సమాచార హక్కు చట్టం కిందకూడా దరఖాస్తు చేసుకొన్నట్టు పేర్కొన్నారు. ఈ భూమిపై కోర్టు ద్వారా ఇంజెంక్షన్ ఆర్డర్ కూడా పొందినట్టు చెప్పారు.

భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశ్యంతో బుచ్చి ఎల్లయ్య అతని అనుచరులు ట్రాక్టర్‌తో భూమిని చదునుచేస్తుండగా అడ్డుకోబోయిన తమ తండ్రి సత్తయ్యపై దాడి చేసి గాయపరిచి మృతికి కారకులైనట్టు ఆరోపించారు. ఈ విషయంపై గ్రామంలో ఆందోళన చేయడంతో స్పందించిన తాసిల్దార్, వీఆర్వో రికార్డును యథావిధిగా సరిచేస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా తాసిల్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని చెప్పారు. సీసీఎల్ నాంపల్లి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రికార్డులు సరిచేయాలని కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్‌కు నోటీసులు సైతం జారీ అయినట్టు తెలిపారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరుగలేదని బాధితులు వాపోయారు.

166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles