లక్షిస్తేనే పనయితది!


Thu,May 16, 2019 02:20 AM

Janagam Farmers Suffer For Land Registration

-రికార్డులను సరిచేయాలంటే సొమ్ములియ్యాల్సిందే..
-వారసత్వభూమిని ఇతరులకు పట్టాచేసిన వైనం
-పట్టించుకోని తాసిల్దార్.. అడ్డగోలుగా వీఆర్వో నిర్వాకం
-జనగామ జిల్లా కట్కూర్‌లో రైతు సోదరుల ఆవేదన

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన సోదరులు మూసిని లక్ష్మినారాయణ, మూసిని పండరికి వారసత్వంగా 10.36 ఎకరాల భూమి సంక్రమించింది. ఇందులో కొంత భూమిని అమ్ముకోగా మిగిలిన 2.37 ఎకరాల భూమిని లక్ష్మినారాయణ 1.19 ఎకరాలు, పండరి 1.18 ఎకరాల చొప్పున పంచుకుని సాగుచేసుకుంటున్నారు. నిరుడు భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు వీరి భూములు సర్వేచేశారు. లక్ష్మినారాయణకు సర్వే నంబర్ 326/ఎ/2 లో 1.19 ఎకరాలు, పండరికి సర్వే నంబర్ 326/ఎ/1లో 1.18 ఎకరాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 1బీ జారీచేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ పాస్‌బుక్‌లు అందజేశారు. కానీ 1 బీ ప్రకారం కాకుండా పాస్‌పుస్తకంలో భూవిస్తీర్ణం తక్కువగా నమోదుచేశారు.

ఇద్దరు అన్నదమ్ములు ఒక్కొక్కరికి 1.06 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రికార్డుల్లో చేర్చారు. మిగతా 25 గుంటల భూమిని వీరాగౌడ్ అనే వ్యక్తిపేరిట మార్పిడిచేశారు. దీంతో ఆందోళనకు గురైన సోదరులు తాసిల్దార్‌ను కలిసి తమ బాధను చెప్పుకొన్నారు. తప్పిదం జరిగినట్లు గుర్తించి రికార్డులు సరిచేస్తామని తాసిల్దార్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రికార్డులు మారలేదు సరికదా.. బాధితులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీఆర్‌ఏ గొడుగు రాజు ఉద్దేశపూర్వకంగా తమ భూమిని వీరాగౌడ్ పేరిట అక్రమంగా రికార్డులో చేర్చినట్లు బాధితులు పేర్కొన్నారు. పాస్‌పుస్తకాలు పంపిణీ చేసిన సమయంలో వీఆర్‌ఏకు రూ.12 వేలు ముట్టజెప్పినట్లు బాధితులు చెప్పా రు. తమ భూమిలో 25 గుంటలు వేరే వ్యక్తికి పట్టాచేసిన వీఆర్‌ఏ.. ఆ రికార్డులను సరిచేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్‌చేస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.

తాసిల్దార్ పట్టించుకోవడం లేదు.

తమ భూముల్లో కొంతభాగాన్ని ఇతరుల పేరిట రికార్డుల్లో చేర్చిన వీఆర్‌ఏపై ఆధారాలతో సహా తాసిల్దార్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని బాధితులు లక్ష్మీనారాయణ, పండరి చెప్పారు.రికార్డును సరిచేయడానికి వీఆర్‌ఏ లక్ష రూపాయాలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయం తాసిల్దార్‌కు చెప్తే డబ్బుల సంగతి నా ముందు మాట్లాడొద్దని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోయారు. తమ భూమిని పట్టా చేసుకున్న వ్యక్తి స్థానికంగా విలేకరిగా చెలామణీ అవుతున్నందున రెవెన్యూ అధికారులు అతడికే వత్తాసు పలుకుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రికార్డును సరిచేసి న్యాయంచేయాలని లక్ష్మీనారాయణ, పండరి కోరుతున్నారు.

163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles